ఆ సాహసం స్పూర్తి దాయకం…

ఘనంగా సన్మానించిన కలెక్టర్, డీసీపీ

దిశ, దశ, పెద్దపల్లి:

జోరుగు కురుస్తున్న వర్షం… ఉధృతంగా సాగుతున్న నది ప్రవాహంలో 19 మంది వరదల్లో చిక్కుకోవడంతో జిల్లా యంత్రాంగమంతా హై అలెర్ట్ అయింది. అయితే వారిని కాపాడే పరిస్థితి మాత్రం కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అందుబాటులో లేకపోవడంతో వారిని కాపాడడం ఎలా అని ఆలోచిస్తున్న క్రమంలో స్థానిక యువత ధైర్యంగా ముందుకొచ్చి వారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చింది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం గోపాలపూర్ మీదుగా ప్రవహిస్తున్న మానేరు నదిలో ఇసుక రీచులో సుమారు 19 మంది చిక్కుకపోయారు. బాధితుల్లో ఒకరు వీడియో తీసి పంపించడంతో వారు అక్కడ చిక్కుకున్నారన్న విషయం తెలిసి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. హుటాహుటిన గోపాలపూర్ కు చేరుకుని రీచులో ఉన్న వారినిక రక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. క్రమ క్రమంగా పెరుగుతున్న నీటి మట్టం అందరినీ కలవరపరుస్తోంది. అయితే రీచులో చిక్కుకున్న వారిని కాపాడడం ఎలా అని తర్జనభర్జనలు పడుతున్నారు. వెంటనే స్థానిక మత్సకారుల కుటుంబాలకు చెందిన ఐదుగురు యువకులు ధైర్యంగా ముందుకు వచ్చి ఇసుక రీచుల్లో చిక్కుకున్న వారిని కాపాడారు. బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని రీచులో జేసీబీ వద్ద దిక్కులు చూస్తున్న వారిని క్షేమంగా తీసుకరావడంలో స్థానిక యువత సక్సెస్ అయింది.

ఈ చైతన్యం అవసరం: ముజమ్మిల్ ఖాన్, కలెక్టర్

గ్రామాల్లోని యువతలో ఇలాంటి చైతన్యం ఎంతో అవసరమైని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం గోపాలపూర్ ఇసుక రీచు సమీపంలో వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించిన యువతకు ప్రత్యేకంగా సన్మానం చేశారు. మత్సకార కుంటుంబాలకు చెందిన యువత ఇదే స్పూర్తిని నింపినట్టయితే విపత్కర పరిస్థితుల్లో తమను తాము కాపాడుకునేందుకు చైతన్యం వస్తుందన్నారు. సాహసం చేసి 19 మందిని కాపాడిన యువత గ్రామస్థులను సుశిక్షుతులుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. అంతే కాకుండా రెస్క్యూ ఆపరేషన్ పై సంపూర్ణ అవగాహన కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అన్నారు. సాహసం చేసిన వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితి అడిగి తెలుసుకున్న కలెక్టర్ మత్యకార సంఘాల్లో సభ్యత్వం తీసుకున్నట్టయితే ప్రభుత్వం నుండి సాయం అందించేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ సన్మానం చేసిన వారిలో ఎం శ్రీనివాస్, జునుగారి రవి, గడ్డం వెంకటేశ్, జి సందీప్ కుమార్, అరువ సాయి వంశీలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో్ డీసీపీ వైభవ్ గైక్వాడ్, మంథని ఆర్డీఓ వి హునుమ నాయక్, ఏఓ తూము రవిందర్, మంథని ఇంఛార్జి తహసీల్దార్ గిరి తదితరులు పాల్డొన్నారు.

You cannot copy content of this page