చందుపట్ల సునీల్ రెడ్డి ప్రస్థానం
దిశ దశ, మంథని:
ముచ్చటగా మూడో ప్రయత్నంలో ఆయనకు టికెట్ దక్కింది. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టిన ఆయన రెండు సార్లు ప్రయత్నించినా టికెట్ దక్కలేదు. చివరకు బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలచే అవకాశం లభించింది. పెద్దపల్లి మంథని నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా ఎంపిక అయిన చందుపట్ట సునీల్ రెడ్డి ప్రస్థానం ఎదురీతలానే సాగింది.
తొలిమెట్టు ఎక్కడానికే…
2007లో మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రాంరెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనతో ఆయన తనయుడు సునీల్ రెడ్డి కూడా గులాభి కండువా కప్పుకుని ముందుకు సాగారు. 2014 ఎన్నికల్లో మంథని నుండి టీఆర్ఎస్ టికెట్ ఆశించినప్పటికీ అధిష్టానం పుట్ట మధుకు ప్రయారిటీ ఇచ్చింది. దీంతో సునీల్ రెడ్డి రెబెల్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2018 ఎన్నికల్లో కూడా టికెట్ కోసం తీవ్రంగా ఆశించినప్పటికీ సిట్టింగులకే టికెట్ ఇవ్వాలని నిర్ణయించడంతో పుట్ట మధుకే మళ్లీ టికెట్ దక్కింది. దీంతో అధిష్టానం పెద్దలు కూడా సునీల్ రెడ్డిని ఒప్పించి పోటీలో ఉండకుండా ఒప్పించింది. అయితే ఆయనకు రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవి ఇచ్చేందుకు కూడా అధిష్టానం ఒప్పుకుందని కూడా ప్రచారం జరిగినప్పటికీ ఆయనకు మాత్రం అంతగా ప్రాధాన్యత దక్కలేదు. దీంతో సునీల్ రెడ్డి బీజేపీలో చేరి మంథని నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలు నిర్వహించడం మొదలు పెట్టారు. బీజేపీకి ఉన్న క్రేజ్ కూడా తనకు కలిసి వస్తుందని అంచనా వేసిన ఆయన ఈ మేరకు నియోజకవర్గం అంతా కలియతిరుగుతూ పట్టు బిగించే పనిలో నిమగ్నం అయ్యారు.
చివరి క్షణం వరకూ…
అయితే చందుపట్ల సునీల్ రెడ్డి అభ్యర్థిగా బీజేపీ తరుపున బరిలో నిలవడం ఖాయం అనుకున్న క్రమంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. సునీల్ రెడ్డికి టికెట్ వస్తుందా రాదా అన్న ఊగిసలాట పార్టీ క్యాడర్ లో మొదలైంది. మంథని బీఆర్ఎస్ టికెట్ ఆశించిన చల్ల నారాయణ రెడ్డి కూడా బీజేపీలో చేరడం ఆయన అభ్యర్థిత్వం వైపే అధిష్టానం మొగ్గు చూపుతుందన్న ప్రచారం నియోజకవర్గంలో బలంగా వినిపించింది. పార్టీ మారినా సునీల్ రెడ్డికి టికెట్ విషయంలో భంగపాటు తప్పదా అన్న చర్చ మొదలైంది బీజేపీ వర్గాల్లో. కానీ బీజేపీ అధిష్టానం మాత్రం ఆయనవైపే మొగ్గు చూపడంతో సునీల్ రెడ్డి అభ్యర్థిత్వం ఖరారైంది.
తండ్రి అలా…
చందుపట్ల రాంరెడ్డి పొలిటికల్ కెరీర్ కు భిన్నంగా ఆయన తనయుడు సునీల్ రెడ్డి రాజకీయ ప్రస్థానం సాగుతోందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అయ్యాయి. ఖమ్మంపల్లి సర్పంచుగా, ముత్తారం ఎంపీపీగా పని చేసిన ఆయన1994లో టీడీపీ అభ్యర్థిగా స్పీకర్ శ్రీపాదరావుపై అనూహ్య విజయం సాధించారు. రాష్ట్రం అంతా కూడా శ్రీపాదరావు గెలుపు నల్లేరుపై నడకేనన్న ధీమాతో ఉంటే మంథని ప్రజలు మాత్రం భిన్నమైన తీర్పు ఇచ్చారు. అయితే ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో రాంరెడ్డి రెండు సార్లు పోటీ చేసినప్పటికీ ఆయనకు అండగా నిలువ లేదు మంథని ప్రజలు. సునీల్ రెడ్డి మాత్రం అభ్యర్థిత్వం కోసమే మూడు ఎన్నికల వరకూ ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎదురైంది. ఏది ఏమైనా సునీల్ రెడ్డి బీజేపీ తరుపున పోటీ చేస్తుండడంతో ఈ సారి మాత్రం మంథని ఎన్నికల్లో ముగ్గురు బలమైన అభ్యర్థుల మధ్య పోరు సాగేలా కనిపిస్తోంది.