సిలబస్ పూర్తి కాక ఇక్కట్లు… టీచర్లపై పడుతున్న అదనపు భారం…
దిశ దశ, హైదరాబాద్:
సర్కారు బడుల్లో చదువులు చతకిలబడినట్టుగా ఉండకూడదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పెంచాలన్న యోచనతో వినూత్న నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు గెజిటెడ్ హెడ్ మాస్టర్లను నియమించాలని భావించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాల్లలో కూడా విద్యా విధానంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. రాష్ట్రంలోని అన్ని హైస్కూళ్లలో హెడ్ మాస్టర్ పోస్టులను ప్రమోషన్ విధానం ద్వారా నింపింది. గెజిటెడ్ హెడ్ మాస్టర్లుగా పదోన్నతుల కల్పించడంతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ. కోట్లలో ఆర్థిక భారం పడుతున్నా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్న సంకల్పంతో ముందుకు సాగింది. ప్రతి ప్రధానోపాధ్యుయుడు ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు గుణాత్మక విద్య అందించేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవల్సి ఉంటుంది. జీఓ నంబర్ 54 ప్రకారం జడ్పీ హై స్కూల్ హెచ్ ఎం ప్రతి రోజు ఒక పీరియడ్ చెప్పాల్సి ఉంటుంది. కనీసం వారానికి 8 పీరియడ్స్ కు తగ్గకుండా విధులు నిర్వర్తిస్తూ స్కూల్ పర్యవేక్షణ బాధ్యతలు చూసుకోవల్సి ఉంటుంది.
వాస్తవం ఇది…
ఎంతో సదుద్ధేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అమలులో మాత్రం ఆచరణకు నోచుకోవడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. చాలా ఉన్నత పాఠశాలల్లో హెడ్ మాస్టర్లు అడ్మినిస్ట్రేషన్ వ్యవహరాలను చక్కబెట్టడానికే పరిమితం అవుతున్నారని తెలుస్తోంది. ఎస్టీఓ, బ్యాంకు, డీఈఓ ఆఫీసులకు వెళ్లాల్సి ఉందన్న కారణాలతో చాలా మంది ప్రధానోపాధ్యాయులు తరగతి గదుల వైపు కన్నెత్తి చూసే పరిస్థితి లే్కుండా పోయింది. వారానికి రెండు రోజులు ఆన్ డ్యూటీపై వెలుతుండడంతో హెచ్ఎంలు బోధించాల్సిన సబ్జెక్టుల సిలబస్ పూర్తి కావడం లేదు. విధుల్లో ఉన్న టీచర్లు విద్యార్థులకు బోధన చేసేందుకు టైం టేబుల్ రీ షెడ్యూల్ చేసుకోవల్సి వస్తోంది. ఒక్కో హెడ్ మాస్టర్ కు వేతనం కోసం రూ. లక్ష యాభై వేల నుండి రూ. 2 లక్షల వరకు ప్రభుత్వం వెచ్చిస్తోంది. హెడ్ మాస్టర్లను ప్రభుత్వం బోధనేతర బాధ్యతలకే పరిమితం చేయడంతో ఆశయ సాధన మాత్రం కార్యరూపం దాల్చడం లేదు. డీఈఓ కార్యాలయాలకు ప్రోఫార్మలను నింపి సంతకాలు పెట్టి పంపించే పనులతో నిమగ్నం అవుతున్న హెచ్ఎంలు క్లాసులు తీసుకునే సంస్కృతికి మంగళం పాడారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అదనపు భారం…
హెడ్ మాస్టర్లు చెప్పాల్సిన సబ్జెక్ట్ సకాలంలో కంప్లీట్ అయ్యే పరిస్థితి లేకపోగా… ఆయా స్కూళ్లలో పని చేస్తున్న టీచర్లపై అదనపు భారం పడుతోంది. ప్రధానోపాధ్యాయులు ఆన్ డ్యూటీలో వెల్లినప్పుడు వారు తీసుకోవల్సిన క్లాస్ నిర్వహించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి వస్తోంది. ఆయా పాఠశాలల్లో పనిచేసే టీచర్ సెలవుపై వెల్లినట్టయితే సబిస్ట్యూట్ టైం టేబుల్ తయారు చేసుకుని అదనపు తరగతులు నిర్వహించాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితులు ఎదురైన పాఠశాలల్లో టీచర్లు వరసగా నాలుగు పీరియడ్లు తీసుకోవల్సి వస్తోంది. ఇతర టీచర్లు సెలవుపై వెల్లినట్టయితే ఎనిమిది పీరియడ్స్ తీసుకోవలన్న ఆదేశాలు వస్తుండడంతో విధులకు వెల్లే ఉపాధ్యాయులు స్ట్రెస్ కు గురవుతున్నారు. తాము వరసగా పీరియడ్స్ తీసుకోలేకపోతున్నామని… మినహాయింపు ఇవ్వాలని అభ్యర్థిస్తున్న టీచర్లు సంజాయిషీ ఇవ్వాలని ఆదేశిస్తున్నారు. సబ్జెక్టు టీచర్లు ఎదుర్కొంటున్న ఈ ఇబ్బందుల ప్రభావం విద్యార్థులపై కూడా ప్రమాదం లేకపోలేదు. అదనపు క్లాసులు నిర్వహించాల్సి వస్తున్న క్రమంలో విద్యార్థులకు పాఠ్యాంశాలపై సంపూర్ణ అవగాహన కల్పించలేకపోతున్నారు. దీంతో స్టూడెంట్స్ కూడా మొక్కుబడి చదువులకే పరిమితం అయ్యే ప్రమాదం లేకపోలేదు. తాము విద్యాబోధన చేసే పరిస్థితి లేదని చెప్తున్న టీచర్ల నుండి వస్తున్న ప్రతికూల సమాధానాలు వస్తున్న క్రమంలో వారిని టార్గెట్ కూడా చేస్తున్నారన్న ఆవేదన వ్యక్తం అవుతోంది. విద్యార్థులకు నిరాంటకంగా విద్యాబోధన చేస్తుండడం వల్ల మానసిక ఒత్తిడికి లోను కావడమే కాకుండా తాము అదనపు భారం మోయలేకపోతున్నామని చెప్పిన తరువాత ఎదురవుతున్న పరిణామాలతో మరింత ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యాశాఖ అధికారులు కూడా ప్రధానోపాధ్యాయులు చేయాల్సిన బోధన అంశం గురించి పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. కొన్ని పాఠశాలల్లో అయితే టైం టేబుళ్లలో కూడా హెచ్ ఎంలు బోధించే విధానానికే స్వస్తి పలికినట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత పాఠశాలల్లో అమలు చేయాల్సిన విధానాలు… వాటిని పాటిస్తున్న తీరుపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. లేనట్టయితే సర్కారు ఆశయానికి గండి పడే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.