తెలంగాణ హైకోర్టులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిటిషన్‌పై విచారణ జరిగింది. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో తనపై తీవ్రమైన చర్యలు తీసుకోకుండా సీబీఐని ఆదేశించాలని అవినాష్ తరపు న్యాయవాది హైకోర్టును కోరారు. తీవ్రమైన చర్యలంటే ఏంటని ధర్మాసనం ప్రశ్నించింది. అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని అడుగుతున్నారా? అని హైకోర్టు అడిగింది. చెప్పింది చెప్పినట్లు వాంగ్మూలం చేస్తున్నారన్న నమ్మకం లేదని అవినాష్ న్యాయవాది వెల్లడించారు. విచారణ వీడియో రికార్డింగ్ చేస్తున్నామని సీబీఐ తరఫు న్యాయవాది తెలిపారు. వీడియో రికార్డింగ్ ఏ దశలో ఉందో తెలపాలని సీబీఐకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ కేసుకు సంబంధించిన పూర్తి ఫైల్‌ను సోమవారం సమర్పించాలని ధర్మాసనం సీబీఐకి ఆదేశించింది. పిటిషన్‌లో తన పేరు ప్రస్తావించినందున తన వాదనలు కూడా వినాలని వివేకా కుమార్తె సునీత కోరారు. ఇక వైఎస్ అవినాష్‌రెడ్డికి మద్దతుగా వెళ్లిన అభిమానులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. వారిని అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు తెలంగాణ పోలీసులు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో పులివెందుల, చక్రాయపేట , వేంపల్లి వైసీపీ నేతలు ఉన్నారు.
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో తొలిసారి జనవరి 28న, రెండోసారి ఫిబ్రవరి 24న హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. మార్చి 10న మరోసారి విచారణకు రావాలని ఈ నెల 5న సీఆర్పీసీ 160 కింద సీబీఐ అధికారులు నోటీసులిచ్చారు. ఇంతలోనే గురువారం తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డి రిట్ పిటిషన్ దాఖలు చేయగా.. శుక్రవారం తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది.