మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో వరద బీభత్సం
వరదలో చిక్కుకున్న మహిళా కూలీలు…
గిరిజన జిల్లాలో స్తంభించిన రాకపోకలు
దిశ దశ, దండకారణ్యం:
మహారాష్ట్రంలోని గడ్చిరోలి జిల్లా వాసులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. జిల్లాలోని పలు రహదారులపై వరద నీరు పొంగి పొర్లుతుండడంతో జిల్లాలోని రహారులన్ని మూసుకపోయాయి. జిల్లా వాసులు అంతా కూడా తమ ఇండ్లకే పరిమితం అయ్యారు. జిల్లాలోని కర్కపల్లి ప్రాంతంలో వ్యవసాయ కూలీలు వరి నాట్లు వేసేందుకు పొలం బాట పట్టారు. పెద్ద ఎత్తున మహిళా కూలీలు పొలాల్లో వరినాట్లు వేసేందుకు వెల్లే సమయంలో వరద ఉధృతి అంతగా లేకపోగా సాయంత్రం తిరుగుబాట పట్టిన సమయంలో సమీపంలోని వాగు పొంగి పొర్లడంతో మహిళా కూలీలు వరధ ఉధృతిని గమనించి పంట పొలాల వైపు ఆగిపోయారు. సుమారు 50 మంది వ్యవసాయ మహిళా కూలీలు అటువైపుగా చిక్కుకున్న సమాచారం అందుకున్న గ్రామస్థులు కొంతమంది వరధ నీటి నుండి వెల్లి అవతలి వైపు ఉన్న మహిళా కూలీలను క్షేమంగా గ్రామానికి తరలించారు. వ్యవసాయ పనులకు వెల్లిన కూలీలంతా క్షేమంగా ఇండ్లకు చేరుకోవడంతో గ్రామస్థులంతా అంతా ఊపిరి పీల్చుకున్నారు.
స్తంభించిన రవాణా..!
నిరాటంకంగా కురుస్తున్న వర్షాలతో గడ్చిరోలి జిల్లాలోని రహదారులు కూడా నీటి ప్రవాహంలో మునిగిపోయాయి. దీంతో జిల్లాలోని పలు రహదారుల్లో రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలోని ఆలపల్లి, సిరొంచ రహదారిలో నందగావ్ సమీపంలో వరద నీటి ప్రవాహం కారణంగా రహదారిని మూసివేశారు. ఈ జాతీయ రహదారిపై మూడు నుండి నాలుగు అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తుండడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. సిద్కొండ, జింగనూర్, కొత్తపల్లి సమీపంలోని వాగులు, ఆసరెల్లి, ముట్టాపూర్, సోమ్నూర్… మౌషిఖాంబ్, అమీర్జా సమీపంలోని వాగులు, వంకలు, సఖారా, చర్చూర… కుంఫీ, చండాల ప్రాంతంలోని వాగులు, రణమూల్, మడేమూల్… ఆల్లపల్లి, సిరొంచ కాసర్ పల్లి వాగు, కన్హోలీ, బోరీ గన్ పూర్ సమీపంలోని కలమ్ గావ్ నాలా, చమోర్షి, కలమ్ గావ్… చంభర్దా, అమీర్జా ప్రాంతాల్లోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో వాహనాల రాకపోకలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. వర్షాలు ఇలాగే కొనసాగితే ఆయా ప్రాంతాల్లో వాగులు వంకల్లోకి వరద పెద్ద ఎత్తున వచ్చి చేరే అవకాశాలు ఉన్నాయి. దీంతో మరిన్ని రోజులు రాకపోకలు స్తంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలోని పరిమేళి, ఆసరెల్లిల ప్రాంతాల్లో 185 మి.మి. అత్యధిక వర్షపాతం నమోదయినట్టు అధికార వర్గాలు తలిపాయి.
జలమయమైన అటవీ గ్రామాలు…
గడ్చిరోలి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ ప్రాంతాల నుండి కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో జిల్లాలోని చిన్న, చిత, మధ్య, భారీ స్థాయిలో ఉన్న వాగులు వంకలన్ని కూడా పొంగిపొర్లుతున్నాయి. సమీపంలోని నదుల్లో వరద ప్రవాహం ఒత్తిడి కారణంగా వాగులు, వంకల్లోని నీరు సమీప గ్రామాల్లోకి వచ్చి చేరుతోంది. భామ్రాఘడ్ తాలుకాతో పాటు పలు ప్రాంతాల్లోని నది పరివాహక గ్రామాల్లోకి వరద నీరు చొచ్చుకవచ్చింది. దీంతో ఆయా గ్రామాల్లోని జనం రెండు రోజులుగా జలవాసం చేస్తున్నారు. వంటా వార్పు చేసుకునే పరిస్థితి లేక, వరద నీటిలో అటు ఇటు తిరుగుతూ ఆహారం కోసం అన్వేషిస్తున్నారు. మట్టితో నిర్మించుకున్న పూరి గుడిసెలు కావడంతో వర్షపు నీరు కురుస్తుండడంతో ఇండ్లలోని ఆహారాపదార్థాలు, ఇతర సామాగ్రి అంతా కూడా తడిసిపోయాయి. ఈ పరిస్థితుల్లో కనీసం వంట చేసుకునేందుకు నిప్పంటించే అవకాశం కూడా లేకపోవడంతో అటవీ గ్రామాల్లోని జనం అల్లాడిపోతున్నారు. అధికారులు కూడా సత్వర చర్యలు చేపట్టేందుకు కార్యరంగంలోకి దిగినప్పటికీ వరధ ఉధృతి కారణంగా సకాలంలో అడవి బిడ్లకు సాయం అందించే పరిస్థితి లేకుండా పోయింది.