Sand policy: అన్నారం బ్యారేజీ సమీపంలో ఇసుక నిల్వలు…

వరద రాకున్నా భారీగా వచ్చి చేరిన ఇసుక..!

దిశ దశ, భూపాలపల్లి:

అన్నారం బ్యారేజీ సమీపంలో ఇసుక నిలువలు భారీగా పేరుకపోయాయి. ఇసుకను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇసుకను తొలగించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్న ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. ఇరిగేషన్ అధికారులతో పాటు సంబంధిత శాఖల అధికారులు అంతా క్లియరెన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తున్న ఈ  ఫైల్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ కు చేరినట్టుగా సమాచారం. జిల్లా స్థాయి సాండ్ కమిటీ నిర్ణయం తీసుకుని ఫైల్ టీఎస్ఎండీసీకి పంపించగానే నోటిఫికేషన్ విడుదల కానుంది. మహదేవపూర్ మండలం అన్నారం సమీపంలో 2 కోట్ల 50 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిలువ ఉందని ఇరిగేషన్ అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. ఈ ఇసుకను తరలించేందుకు ప్రత్యేకంగా 28 క్వారీలను ఏర్పాటు చేయాలని, ఒక్కో క్వారీకి 8 నుండి 9 లక్షల మెట్రిక్ టన్నుల మేర తీసేందుకు అవకాశం ఇవ్వాలని ప్రతిపానల్లో పేర్కొన్నట్టుగా సమాచారం. ఒక్కో రీచుకు రూ. 2.50 లక్షల మేర డిపాజిట్ చేయాల్సి ఉంటుందని, రూ. 23 వేలు నాన్ రిఫండ్ కింద డిపాజిట్ చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ నెలలో నోటిఫికేషన్ ప్రక్రియ కొనసాగించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది.

గతంలోనే…

అయితే గతంలోనే అన్నారం బ్యారేజీలో భారీ ఎత్తున ఇసుక నిలువ ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనాలు వేయడంతో తొలగించేందుకు ఇసుకర రీచులను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి ఇసుక రీచులు ఏర్పాటు చేశారు. తాజాగా 2 కోట్ల 50 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిలువ ఉన్నట్టుగా మరో ప్రతిపాదన తెరపైకి రావడం గమనార్హం. గతంలోనే అన్నారంలో ఇసుక నిలువ ఉందని తేల్చినప్పుడు అధికారులు అంచనాలు వేయడంలో విఫలం అయ్యారా అన్న చర్చ కూడా స్థానికంగా సాగుతోంది. అన్నారంలో ఏ స్థాయిలో ఇసుక నిలువ ఉందోనన్న విషయంపై అప్పటి అధికారులు అంచనా వేయడంలో ఎలా విఫలం అయ్యారోనన్నదే అంతుచిక్కకుండా పోతోంది. ఇప్పుడు 2 కోట్ల 50 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక ఉన్నట్టుగా ఇరిగేషన్ అధికారులు గుర్తించడం గమనార్హం.

NDSA అనుమతి..?

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మూడు బ్యారేజీలుపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (NDSA) విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. మేడిగడ్డ కుంగుబాటుకు గురైన తరువాత రంగలోకి దిగిన NDSA నిపుణుల బృందం మూడు బ్యారేజీల్లో నీటి నిలువ ఉంచకూడదని సూచించింది. మూడు బ్యారేజీల సామర్థ్యాన్ని పరిశీలిస్తున్న నిపుణలు బ్యారేజీల పటిష్టతలకు అవసరమైన కసరత్తులు చేస్తోంది. గ్రౌంటింగ్ వంటి పనులు చేయడంపై NDSA నిపుణులు గతంలోనే తప్పు పట్టడమే కాకుండా బ్యారేజీ పిల్లర్లు కుంగుబాటుకు అసలైన కారణాన్ని గుర్తించలేకపోయామని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో అన్నారంలో కూడా లీకేజీలు వెలుగులోకి వచ్చిన విషయంపై కూడా NDSA నిపుణులు దృష్టి పెట్టారు. అయితే ఇప్పుడు అదే అన్నారం బ్యారేజీ సమీపంలో ఇసుక తొలగించడానికి ఇరిగేషన్ అధికారులు ఎలా ప్రతిపాదనలు సిద్దం చేశారన్నదే అంతుచిక్కకుండా పోతోంది. ఈ మూడు బ్యారేజీల పర్యవేక్షణ బాధ్యత NDSA పరిధిలో ఉన్నందున ఇసుక తరలించేందుకు పర్మిషన్ తీసుకోవల్సి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ విషయంపై సంబంధిత శాఖల అధికారులు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కూడా లేకపోలేదు.

You cannot copy content of this page