దిశ దశ, జాతీయం:
దేశ వ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను కూడా ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం చేయాలన్న తలంపుతో ఎన్నికల కమిషన్ ముందుకు సాగుతోంది. ఈశాన్య రాష్ట్రాలతో పాటు కీకారణ్యాల్లో ఉన్నవారు కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈ సారి ప్రత్యేకంగా హెలిక్యాప్టర్ సేవలు వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏయే ప్రాంతాల్లో హెలిక్యాప్టర్లు అవసరమో కూడా అంచానా వేసి ఆయా ప్రాంతాల్లో ఈ మేరకు ఏర్పాట్లను కూడా చేసింది. ఉత్తర భారతంతో పాటు ఈశాన్య రాష్ట్రాలోని కొన్ని ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని గుర్తించిన ఎన్నికల కమిషన్ ఈ మేరకు చర్యలు తీసుకుంది. అయితే తాజాగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూడా హెలిక్యాప్టర్ సేవలు వినియోగించుకోనుంది. ఇంతవరకు ప్రభావిత ప్రాంతాల్లో పొలింగ్ నిర్వహించే అధికార యంత్రాంగం అంతా కూడా రోడ్డు మార్గం గుండా, వాగులు, వంకలు దాటేందుకు నాటు పడవల సాయంతో వెల్లేవారు. ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు మాత్రం హెలిక్యాప్టర్లలో తిరుగుతూ భద్రతా చర్యలు పర్యవేక్షించే వారు. ఓటు హక్కును దేశంలోని అన్ని ప్రాంతాల వారు వినియోగించుకునే విధంగా చర్యలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ పోలింగ్ సిబ్బంది మాత్రమే రహదారుల మీదుగానో, కాలి నడకనో వెల్లే విధానం అమలయ్యేది. మావోయిస్టులు ఎన్నికల బహిష్కరణ పిలుపు విఫలం కావాలన్న తలంపుతో బలగాలను మోహరింపజేసి బందోబస్తు చర్యలు చేపట్టారు. వారు అయితే ఈ సారి మాత్రం ప్రభావిత ప్రాంతాల్లో కూడా హెలిక్యాప్టర్లను వినియోగించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఇందులో భాగంగా చత్తీస్ ఘడ్ లోని బస్తర్ పూర్వ జిల్లా, మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాల్లో హెలిక్యాప్టర్ల ద్వారా పోలింగ్ సిబ్బందిని ఆయా గ్రామాలకు తరలించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఆయా ప్రాంతాలకు వెల్లే పొలింగ్ సిబ్బంది ఉదయం నుండి సాయంత్రం వరకు ఓటింగ్ ప్రక్రియ ముగించుకుని తిరిగి సంబంధిత ప్రాంతాల ఎన్నికల అధికారులకు రిపోర్టు చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 19న మహారాష్ట్ర, చత్తీస్ గడ్ లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ప్రక్రియ జరగనున్నందున అక్కడి పోలీంగ్ అధికార యంత్రాంగాన్ని తరలించేందుకు హెలిక్యాప్టర్లను సిద్దం చేశారు ఆయా జిల్లాలకు చెందిన ఎన్నికల అధికారులు. గతంలో ఉత్తర తెలంగాణాలోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో హెలిక్యాప్టర్ల ద్వారా పోలింగ్ బాక్సుల తరలింపు ప్రక్రియ చేపట్టినప్పటికీ అది రక్షణ చర్యల్లో భాగంగా పోలీసు అధికారులు తీసుకున్న నిర్ణయం. కానీ ఈ సారి అధికారికంగా ఎన్నికల కమిషన్ హెలిక్యాప్టర్లను వినియోగించుకోవాలని ఆదేశించడం కొత్త విధానానికి శ్రీకారం చుట్టినట్టయింది.