దిశ దశ, కరీంనగర్:
ఆర్టీసీ బస్సుల రాకపోకలతో బిజీబిజీగా ఉండే ఆ డిపోలో ఓ కోడి కూడా షెల్టర్ తీసుకుంటోంది. ప్రయాణీకులను సుదూర ప్రాంతాలకు తరలించి తిరిగి డిపోకు చేరే బస్సులు అక్కడ నిలిపడం కామన్ కానీ ఇక్కడ ఓ కోడి ఉండటం ఏంటని అనుకుంటున్నారా..? ఇంతకీ ఏం జరిగిందంటే… వరంగల్ నుండి వేములవాడ రాజన్న క్షేత్రానికి ఓ ఆర్టీసీ బస్సు బయలుదేరింది. బుధవారం ఆర్టీసీ బస్సు కరీంనగర్ చేరుకునే సరికి అక్కడ ఓ బ్యాగ్ లో ప్యాక్ చేసి పెట్టిన కోడిని గమనించిన ప్రయాణీకులు కండక్టర్ కు సమాచారం ఇచ్చారు. ఎవరి కంట పడకుండా ఓ ప్రయాణికుడు ఓ బుట్టలో కోడిని బందోబస్తుగా ప్యాక్ చేసిన ప్రయాణీకుడు కోడి ఉన్న బ్యాగ్ ను బస్సులోనే మర్చిపోయాడు. దీంతో వెంటనే కండక్టర్ కరీంనగర్ బస్ స్టేషన్ లోని కంట్రోలర్ కు సమాచారం ఇచ్చి కోడిని వారికి అప్పగించారు. కంట్రోలర్ ఆ కోడిని తీసుకెళ్లి కరీంనగర్ 2 డిపో యంత్రాంగానికి అప్పగించారు. ఓ జాలిలో కోడిని ఉంచి దానికి దాణాతో పాటు నీటిని అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏదైతే ఏం ఆర్టీసీ బస్సులతో పాటు కోడి కూడా అక్కడ సెద తీరుతోందని కొందరు ప్రయాణికులు కామెంట్ చేస్తున్నారు. ప్రయాణీకుడు దొరికితే అతనిపై నిభందనల మేరకు జరిమానా విధంచే అవకాశం ఉండేది. కానీ ఆ కోడికి సంబంధించిన వారు ఎవరూ లేకపోవడంతో దాని ఆలనా పాలనా అంతా కూడా ఆర్టీసీ యంత్రాంగం చూసుకోవల్సి వస్తోంది.