దిశ దశ, ఆసిఫాబాద్:
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సరిహద్దు గ్రామాల్లో హై అలెర్ట్ ప్రకటించారు అటవీ శాఖ అధికారులు. రాత్రి వేళల్లో తిరగకూడదని కోరుతూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మహారాష్ట్రలోని సరిహద్దు అటవీ ప్రాంతం నుండి ఏనుగుల గుంపు తెలంగాణ వైపు పయనిస్తున్నాయని అప్రమత్తంగా ఉండాలని కోరుతూ గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. జిల్లాలోని పెంచికల్ పేటకు 30 కిలో మీటర్ల దూరంలో ఏనుగుల గుంపు ఉన్నట్టుగా అటవీ శాఖ అధికారులకు సమాచారం అందింది. తెలంగాణాలోకి ఏనుగులు వచ్చే అవకాశాలు ఉన్నందున కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేసే పనిలో నిమగ్నం అయ్యారు. గతంలో మహారాష్ట్ర అడవుల నుండి తెలంగాణాలోకి ఏనుగులు చొరబడడంతో సరిహద్దు గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ సారి అలాంటి పరిస్థితులు ఏర్పడకుండా ఉండేందుకు అటవీ అధికారులు ముందస్తుగానే అప్రమత్తం చేస్తున్నారు.