హిడ్మాకు ఏం కాలే… తప్పుడు ప్రచారమే అంతా

మావోయిస్టు పార్టీ ప్రకటన

బుధవారం రెండు రాష్ట్రాల సరిహద్దు అడవుల్లో జరిగిన సర్జికల్ స్ట్రైక్ లో మావోయిస్టు నేత, బెటాలియన్ కమాండర్ హిడ్మా మరణించినట్లు ఇరు రాష్ట్రాల పోలీసులు చేసిన ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామారాజు (బీకేఏఎస్ఆర్) డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ స్పష్టం చేశారు. గురువారం ఈ మేరకు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణ, చత్తీస్ గడ్ సరిహద్దు కీకారణ్యాలపై బలగాలు దాడులు చేసింది నిజమే కానీ వారి లక్ష్యం మాత్రం నెరవేరలేదన్నారు. బలగాలు చేసిన దాడికి ప్రజా గెరిల్లా సైన్యం (పీఎల్జీఏ) గట్టి సమాధానం ఇచ్చిందన్నారు. దేశ ప్రజలపై ఇక్కడి సైన్యం దాడి చేయడం… తిరిగి ఆ దాడులను సమర్థించుకోవడంతో పాటు సిగ్గులేకుండా ఈ విషయాన్ని గొప్పగా ప్రచారం చేసుకోవడం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుందని అజాద్ వ్యాఖ్యానించారు. దేశ భద్రత కోసం సరిహద్దుల్లో ఉండాల్సిన సైన్యంచే ఛత్తీస్ గడ్ అడవుల్లోని ప్రతి నాలుగు గ్రామలకో క్యాంపు పెట్టి ఆదివాసీలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. నిత్యం ఇనుప బూట్ల పదఘట్టనలో ఆదివాసీలు నలిగిపోతున్నారని, ఈ దేశంలో అత్యంత విలువైన సంపద ఈ దండకారణ్యంలో ఉందని, ఇక్కడ ఉన్న ఖనిజాలు, అటవీ సంపదను కొల్లగొట్టేందుకు బహుల జాతీ కంపెనీలు పన్నాగం పన్నాయని ఆరోపించారు. ఇతర ప్రాంతాల్లాగా ఇక్కడి సంపద దోచుకుపోయేందుకు వీలు పడటంలేదని, ఆదివాసీలను నిత్యం చైతన్యం చేస్తూ వారి సంపద వారికే దక్కాలని మావోయిస్టు పార్టీ కోరుతోందన్నారు. ఈ డిమాండ్ పాలకులకు మింగుడు పడకుండా పోయిందని, ఈ కారణంగానే మావోయిస్టు పార్టీని అంతం చేసేందుకు ప్రభుత్వం శతవిధాల కుట్రలకు పూనుకుంటోందని విమర్శించారు. ఛత్తీస్ గడ్ రాష్ట్రాన్ని పోలీసు క్యాంపులుగా మార్చి ఆకు పచ్చ అడవిలో నెత్తుటేరులు పారించేందుకు నిత్యం దాడులు చేస్తోందన్నారు. చివరకు వైమానిక దాడులు చేస్తున్నదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇప్పటికే అనేక మార్లు వైమానిక దాడులకు పూనుకుని, గ్రామాలపై మోటార్ సెల్స్ వేయించిందని బీకేఏఎస్ఆర్ కార్యదర్శి ఆరోపించారు. మావోయిస్టు పార్టీని ప్రజల నుంచి వేరు చేసేందుకు సామ ధాన బేధ దండోపాయాలను ఎంచుకుందని, ఇలాంటి దాడులను ఖండించాలని ఆజాద్ పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోడీ, అమిత్ షాలు ఇద్దరూ సామ్రాజ్యవాద ఏజెంట్లుగా పనిచేస్తున్నారని, దేశంలో రాజ్యంగ హక్కులను హరించివేస్తున్నారని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. ప్రశ్నించే హక్కు, జీవించే హక్కులను కాలరాస్తున్నారని ఆయన విమర్శించారు. దేశ సంపద కొందరి చేతుల్లో ఉండేందుకు వీలు కలిగేలా చట్టాలను తయారు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సమాధాన్ ప్రహార్ దాడులను ఖండించాలని, దేశ ప్రజలపై వైమానిక దాడులు చేయండం హేయమైన చర్య అని, ప్రజలు మేల్కొని దేశ సంపద కాపాడుకునేందుకు పోరాటాలు చేయాలని కోరారు. గ్రీన్ హంట్ కు వ్యతిరేకంగా పోరాడంతో పాటు దండకారణ్యంలో ఏర్పాటు చేసిన సైన్యాన్ని తక్షణం ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.

You cannot copy content of this page