నక్సల్స్ ప్రాబల్య రాష్ట్రాల్లో హైఅలెర్ట్…
నేటి నుండి పీఎల్జీఏ వారోత్సవాలు…
దిశ దశ, దండకారణ్యం:
మావోయిస్టుల ఖిల్లాలో మళ్లీ హై అలెర్ట్ ప్రకటించారు పోలీసు అధికారులు. నిన్న మొన్నటి వరకు చెట్టు, పుట్ట, గుట్టలన్ని తిరుగుతూ నక్సల్స్ కార్యకలాపాలను నిరోధించే పనిలో నిమగ్నమైన పోలీసులు ఎన్నికలు ముగియడంతో ఊపిరి పీల్చుకున్నారు. అలా సెద తీరారో లేదో మావోయిస్టు పార్టీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) వారోత్సవాలు మొదలయ్యాయి. దీంతో పోలీసు యంత్రాంగం అంతా కూడా మళ్లీ అటవీ ప్రాంతాల బాట పట్టక తప్పడం లేదు. ఎన్నికల బహిష్కరణ నినాదాన్ని సక్సెస్ చేసేందుకు ప్రభావిత ప్రాంతాల్లో చర్యలకు పూనుకునే అవకాశాలు ఉన్నాయని భావించిన పోలీసు అధికారులు ఆయా రాష్ట్రాల్లో అప్రమత్తంగా వ్యవహరించారు. డిసెంబర్ 2 నుండి 8 వరకు వారోత్సవాలు ప్రారంభం కావడంతో బలగాలు మళ్లీ గాలింపు చర్యలు చేపడుతున్నాయి. మావోయిస్టు పార్టీకి పట్టున్న చత్తీస్ గడ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్రలతో పాటు తెలంగాణాలోని సరిహద్దుల్లో పోలీసులు అప్రమత్తత చర్యలకు శ్రీకారం చుట్టారు.
వారోత్సవాల వెనక…
చత్తీస్ గడ్ లోని దండకారణ్య అటవీ ప్రాంతంలో గెరిల్లా యుద్దతంత్రం వైపు సాగిన పీపుల్స్ వార్ నక్సల్స్ సమాంతర ప్రభుత్వం నిర్మాణం చేసే పనిలో నిమగ్నం అయ్యారు. ఈ క్రమంలో మావోయిస్టు పార్టీ ప్రత్యేకంగా ఆర్మీని తయారు చేసుకోవాలని నిర్ణయించుకుంది. అప్పటికే ఉత్తర తెలంగాణాలోని అటవీ ప్రాంతాల్లో కూడా పార్టీ కార్యకలాపాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఈ క్రమంలో యుద్దతంత్రంలో సుశిక్షుతులను తయారు చేసిన వారిని మావోయిస్టు పార్టీ సైన్యంగా ఏర్పాటు చేసింది. గెరిల్లా బెటాలియన్స్ గా ఏర్పాటు చేసిన వీరు పార్టీ ప్రముఖుల సెక్యూరిటీతో పాటు దాడులు చేయడంలో కీలక భూమిక పోషించేందుకు వినియోగించాలని పీపుల్స్ వార్ కేంద్ర కమిటీ నిర్ణయించింది. మిలటరీ ప్లాటూన్లను ఏర్పాటు చేసుకున్న పీపుల్స్ వార్ పార్టీ ప్రత్యర్థులపై యుద్దం చేసేందుకు సమాయత్తం అయింది. ప్లాటూన్లను ఏర్పాటు చేయడంలో అప్పటి కేంద్ర కమిటీ సభ్యుడు నల్లా ఆదిరెడ్డి అలియాస్ శ్యాం కీలక పాత్ర పోషించారు. కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండలం కొత్తగట్టుకు చెందిన శ్యాం, ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి, శీలం నరేష్ లక్ష్మీరాజంలు 1999 డిసెంబర్ 2న ఎన్ కౌంటర్ లో హతం అయ్యారు. పీపుల్స్ వార్ పార్టీ కేంద్ర కమిటీ నాయకులను కోల్పోవడం అప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. వీరంతా కూడా నూతనంగా ఏర్పడిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొయ్యూరు అటవీప్రాంతంలో శవాలై తేలడం పీపుల్స్ వార్ పార్టీని ఓ కుదుపు కుదిపేసింది. వామపక్ష భావజాలం ఉన్నవారంతా కూడా ఈ ఎన్ కౌంటర్ పై తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. 2000 సంవత్సరలో మిలటరీ ప్లాటూన్లను పీఎల్జీఏగా పేరు మార్చిన పీపుల్స్ వార్ వీటి సృష్టికర్త అయిన నల్ల ఆదిరెడ్డితో పాటు ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి, శీలం నరేష్ లక్ష్మీరాజంలను స్మరించుకునేందుకు ఏటా డిసెంబర్ 2 నుండి 8వరకు వారోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించింది. 2000 డిసెంబర్ 2 నుండి పీపుల్స్ వార్ కొయ్యూర్ ఎన్ కౌంటర్ మృతులను స్మరించుకుంటూ పీఎల్జీఏ వారోత్సవాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే మావోయిస్టు పార్టీ ఈ సారి కూడా పీఎల్జీఏ వారోత్సవాలను చేపట్టాలని పిలుపునిచ్చింది. జెఎండబ్లుపి డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ తో పాటు పలువురు మావోయిస్టు పార్టీ నాయకులు పీఎల్జీఏ వారోత్సవాలను జరపాలని కోరారు. దీంతో మావోయిస్టు పార్టీ ఈ వారోత్సవాలను పురస్కరించుకుని ఏదైనీ చర్యలకు పాల్పడే అవకాశం ఉందని ప్రభావిత రాష్ట్రాలలో కేంద్ర, రాష్ట్ర బలగాలు అప్రమత్తం అయ్యారు. వారోత్సవాలను పురస్కరించుకుని చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా మోదక్‌పాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆవపల్లి రోడ్డు ప్రాంతంలో ఉన్న ధర్మవరం, పూస్గూరిల వద్ద బ్యానర్లు ఏర్పాటు చేశారు. 23వ పీఎల్జీఏ వారోత్సవాలను విజయవంతం చేయాలంటూ మావోయిస్టు పార్టీ కరపత్రాలు, బ్యానర్ల ద్వారా పిలుపునిచ్చింది. శుక్రవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనతో పూర్వ బస్తర్ ఏరియాలో బలగాలు అప్రమత్తమై నక్సల్స్ చర్యలను కట్టడి చేసేందుకు రంగంలోకి దిగాయి. అలాగే తెలంగాణాలోని ప్రాణహిత, గోదావరి పరివాహక ప్రాంతంలో కూడా మావోయిస్టు పార్టీ చర్యలను నిలువరించేందుకు పోలీసు యంత్రాంగం పకడ్భందీ చర్యలు చేపట్టింది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా సరిహద్దు ప్రాంతాల్లో పోలీసు బలగాలు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి.