సరిహద్దుల్లో హై అలెర్ట్…
దిశ దశ, దండకారణ్యం:
అక్కడ నీటి ప్రవాహపు సవ్వడులతో పాటు బూట్ల చప్పుళ్లు కూడా నిత్యకృత్యంగా మారిపోయాయి. వనాల మధ్య నుండి అలీవ్ గ్రీన్ దుస్తుల్లో అన్నలు రాకుండా జనాల మధ్య ఉన్న ఖాకీలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రాణహిత, గోదావరి నది తీరాల్లో పోలీసులు హై అలెర్ట్ గా ముందుకు సాగుతున్నారు. పొరుగు రాష్ట్రాల నుండి ఏ రూపంలో అయినా మావోయిస్టులు వస్తే ఎలా అని ఆలోచించిన బార్డర్ పోలీసులు పకడ్భందీగా గస్తీ చేపట్టారు.
మావోయిస్టు వారోత్సవాలు…
దేశంలోని వివిధ ప్రాంతాల్లో సైద్దాంతిక పోరాటం చేస్తున్న పలు విప్లవ సంస్థలు ఒకే గొడుకు కిందకు రావాలని నిర్ణయించుకున్నాయి. పీపుల్స్ వార్ తో పాటు దేశంలోని పలు విప్లవ సంస్థలు రెడ్ కారిడార్ ఏర్పాటు చేసుకుని మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ గా ఆవిర్భావం చెందాయి. ఏంసీసీని అధికారికంగా 2004 సెప్టెంబర్ 21న ఉమ్మడి ఆంధ్రప్రదేష్ రాష్ట్ర ప్రభుత్వంతో జరుగుతున్న శాంతి చర్చల సమయంలో పీపుల్స్ వార్ ప్రకటించింది. ఇకనుండి మావోయిస్టు పార్టీగా ఆవిర్భవించినట్టుగా చర్చల ప్రతినిధులు ప్రకటించారు. అప్పటి నుండి ప్రతి సెప్టెంబర్ 21 మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకుంటున్నారు నక్సల్స్. ఇందులో భాగంగా ఈ సారి కూడా మావోయిస్టు పార్టీ 21 నుండి వారం రోజుల పాటు ఉత్సవాలు జరపాలని పిలుపునిచ్చింది. 19 సంవత్సరాల మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణాలోని కుమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగ, భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు హై అలెర్ట్ గా వ్యవహరిస్తున్నారు.
సరిహద్దులే ఆలంబనగా…
అయితే ఐదు జిల్లాల మీదుగా ప్రవహిస్తున్న ప్రాణహిత, గోదావరి నదులకు అవతలి వైపున ఉన్న మహారాష్ట్రలోని గడ్చిరోలి, చత్తీస్ గడ్ లోని పూర్వ బస్తర్ జిల్లాల్లో మావోయిస్టులు ప్రాబల్యాన్ని చాటుకుంటున్నారు. దండకారణ్య అటవీ ప్రాంతంలో క్రాంతీకారీ జనతన్ సర్కార్ పేరిట ఏకంగా సమాంతర ప్రభుత్వాన్నే నడిపిస్తున్నారు. కీకారణ్యాలు, గుట్టలు విస్తరించి ఉన్న ఇంద్రావతి నది పరివాహక ప్రాంతంలోని మహారాష్ట్ర, చత్తీస్ గడ్ రాష్ట్రాల అడవుల్లో మావోయిస్టుల ఉనికి తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో నక్సల్స్ ఏ వేషంలో అయినా తెలంగాణాలోకి చొరబడే అవకాశాలు ఉన్నాయని సరిహద్దు పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఓ వైపున కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తూనే మరో వైపున రహదారుల్లో తెలంగాణ పోలీసులు డేగ కళ్లతో పరిశీలిస్తున్నారు. వారోత్సవాల నేపథ్యంలో రాష్ట్రంలోకి చొరబడి ఏ మాత్రం అలజడి చేసినా ప్రమాదమేనని భావిస్తున్న సరిహద్దు ప్రాంత పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు బార్డర్ ఏరియాలను మానిటరింగ్ చేస్తున్నారు. అనుమానితులతో పాటు గతంలో సానుభూతిపరులుగా పనిచేసిన వారిపై కూడా నిఘా కట్టుదిట్టం చేశారు. మావోయిస్టులను తెలంగాణా సరిహద్దుల్లోకి అడుగుపెట్టనివ్వకూడదన్న పంథంతో పోలీసులు ముందుకు సాగుతున్నారు. దీంతో సీపీలు, ఎస్పీలు కూడా క్షేత్ర స్థాయి పర్యవేక్షణ చేస్తున్నారు.