ముందు జాగ్రత్త చర్యలో బార్డర్ పోలీస్
దిశ దశ, దండకారణ్యం:
కీకారణ్యల నడుమ ఎర్ర జెండాలు పట్టుకుని పాటలు పాడుతూ సాయుధ పోరుబాటలో నినందించిన ప్రాంతమది. జనాల్లో కలిసిపోయిన అన్నలు, వారిని ఏరివేసేందుకు పోలీసులు… కూంబింగ్ ఆపరేషన్లతో అట్టుడికిపోయిన ప్రాంతమది. ఎప్పుడు ఎటువైపు నుండి తుపాకుల మోతలు వినిపిస్తాయోనన్న భయానక పరిస్థితులు నాటివి. అన్నలు ఇన్ ఫార్మర్ అని అన్నలు ముద్ర వేస్తారన్న భయం కొందరిదైతే… మిలిటెంట్ గా పనిచేస్తున్నావా అంటూ పోలీసులు కన్నెర్ర జేస్తారన్న భయం మరికొందరిది. మందుపాతరల పేళుల్లు… బూట్ల చప్పుళ్లతో మారుమోగిన ఆ అటవీ ప్రాంతమంతా 15 ఏళ్లుగా నిశ్శబ్ద వాతావరణానికి చేరింది. అన్నల కంచుకోటకు బీటలు వారడంతో తెలంగాణలోని అటవీ ప్రాంతాల్లో ఒక్క సారిగా పరిస్థితి మారిపోయింది. అయితే అక్కడ మాత్రం సరిహధ్దులను కాపాడే పనిలో నిరంతరం శ్రమించాల్సి వస్తోంది పోలీసులకు. వేకువ జామునే లేచి కాళ్లకు బుద్ది చెప్పి అడవి బిడ్డలతో మమేకమై అన్నలకు నో ఎంట్రీ చెప్పే ప్రయత్నంలో తలమునకలవుతున్నారు అక్కడి పోలీసులు. ప్రాణహిత, గోదావరి నదుల పరివాహక ప్రాంతంలో దళాల ఉనికి లేకుండా పోయినప్పటికీ పోలీసులు మాత్రం నిత్యం అప్రమత్తంగా ఉండక తప్పడం లేదు.
పొరుగు రాష్ట్రాల ఎఫెక్ట్…
రాష్ట్రంలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాలోని పోలీసు యంత్రాంగం నది పరివాహక ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేస్తూ విధులు నిర్వర్తిస్తున్నారు. పొరుగునే ఉన్న మహారాష్ట్రలోని గడ్చిరోలి, చత్తీస్ గడ్ లోని బస్తర్ అటవీ ప్రాంతంలో పాతుకపోయిన మావోయిస్టులు రాష్ట్రంలోకి రాకుండా నిలువరించేందుకు నదుల పరవళ్లతో పోటీ పడుతూ కాఖీలు కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు మైదాన ప్రాంతాలు, కీకారణ్యాల్లో ఉనికిని చాటుకుని మందుపాతరలు, క్లైమోర్ మైన్స్ పేల్చడం, సింగిల్ టార్గెట్లపై తుపాకులు ఎక్కుపెట్టడం వంటి ఘటనలు నిత్యకృత్యంగా ఉండేవి. కాని ఇప్పుడు దళాల కదలికలూ పూర్తిగా లేకుండా పోయాయి. కానీ దండకారణ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర బలగాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టు సరిహద్దులు దాటి తెలంగాణలోకి వస్తే మళ్లీ ఆందోళనకర పరిస్థితులు నెలకొంటాయని గుర్తించిన పోలీసు ఉన్నతాధికారులు పరివాహక ప్రాంతాల్లోనే వారిని నిలువరించాలని నిర్ణయించారు. ఇందు కోసం సరిహద్దులను డేగ కళ్లతో నిశితంగా పరిశీలించాలని ఆదేశించారు. దీంతో పరివాహక ప్రాంతంలో ఉన్న ఐదు జిల్లాల పోలీసు బలగాలు ఆపరేషన్లపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు.
రిపిట్ కాకూడదనేనా..?
దాదాపు రెండు దశాబ్దాల క్రితం సరిహద్దు ప్రాంతాల్లో ఓ ఆనవాయితీని అప్పటి పీపుల్స్ వార్ కొనసాగించేంది. తెలంగాణ సరిహద్దుల్లో ఏదైని చర్యలకు పాల్పడిన వెంటనే నక్సల్స్ పొరుగునే ఉన్న దండకారణ్య అటవీ ప్రాంతంలోకి వెల్లి షెల్టర్ తీసుకునే వారు. అక్కడ విధ్వంసాలకు పాల్పడితే తెలంగాణా సరిహద్దు అడవుల్లోకి వచ్చే వారు. అయితే తెలంగాణలో మావోయిస్టుల ఉనికి లేకుండా పోవడంతో దండకారణ్యంలోని సరిహద్దు గ్రామాలను ఉత్తర తెలంగాణ కమిటీకి శాశ్వత షెల్టర్ జోన్లుగా ఇచ్చేశారు. ఆ తరువాత ఉత్తర తెలంగాణ కమిటీని కూడా తీసేసిన మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీతో సరిపెట్టుకోవల్సి వచ్చింది. అయితే బడే చొక్కారావు అలియాస్ దామోదర్ లాంటి పార్టీకి చెందిన కీలక నాయకులు తిరిగి ఉత్తర తెలంగాణాలో పట్టు సాధించే ప్రయత్నాల్లో మునిగిపోవడంతో పోలీసులు హై అలెర్ట్ అయ్యారు. 1989 ప్రాంతంలో ఉన్నట్టుగా ఏటూరునాగారం, మహదేవపూర్ ఏరియా కమిటీ, సరిహద్దు జిల్లాల కమిటీలను వేసి రీ ఎంట్రీకి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే భూపాలపల్లి జిల్లా పల్మెల అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు ఎదురు కాల్పులు చోటు చేసుకోగా కొన్ని ఆయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో సరిహద్దుల్లో నిఘా కట్టదిట్టం చేయాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించారు. మహేందర్ రెడ్డి డీజీపీగా బాధ్యతలు నిర్వర్తించిన కాలంలో పలు మార్లు సరిహధ్దు జిల్లాల్లో సెక్యురిటీ సమావేశాలు ఏర్పాటు చేశారు. దీంతో సరిహద్దుల్లోని నది పరివాహక జిల్లాల పోలీసులు మాత్రం అటు కూంబింగ్ ఆపరేషన్లు, ఇటు అడవి బిడ్డలతో మమేకం కావడం కోసం నిరంతరం శ్రమించాల్సి వస్తోంది. ఉనికిలో లేకున్నప్పటికీ భవిష్యత్తులో మావోయిస్టులు రాష్ట్రంలోకి అడుగు పెట్టకుండా ఉండేందుకు ఐదు జిల్లాలో పోలీసులు కేంద్ర పారా మిలటరీ బలగాలు కంటి మీద కునుకు లేకుండా పని చేయాల్సి వస్తోంది.