పోలీసుల హై అలెర్ట్
దిశ దశ, కరీంనగర్:
కర్ణాటకలో భజరంగ్ దళ్ పై నిషేధం విధిస్తామని కాంగ్రెస్ మేనిఫేస్టోలో పేర్కొన్న అంశంపై తెలంగాణాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హిందుత్వానికి ఆయువు పట్టుగా నిలుస్తున్న భజరంగ్ దళ్ పై కాంగ్రెస్ నిషేధించడం సరికాదంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఇందుకు నిరసనగా శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు, పార్టీ నాయకుల ఇళ్ల ముందు శాంతియుతంగా హనుమాన్ చాలీసా పారాయణం చేయాలని సంజయ్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల వద్ద పోలీసు బలగాలను మోహరించారు. బీజేపీ నేతలు ఇచ్చిన పిలుపు నేపథ్యంలో పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమై కాంగ్రెస్ ఆఫీసుల వద్ద, ప్రధాన కూడళ్లలో బందోబస్తు చర్యలు చేపట్టారు.
కౌంటర్ గా కాంగ్రెస్…
అయితే బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఇచ్చిన పిలుపునకు కౌంటర్ గా యాక్షన్ చేపట్టాలని కాంగ్రెస్ భావించింది. కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ బీజేపీ శ్రేణుల చర్యలను తిప్పి కొట్టేందుకు కాంగ్రెస్ ఆఫీసు వద్దకు చేరుకోవాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఉదయం 9 గంటల కల్లా కరీంనగర్ ఇందిరా భవన్ వద్దకు చేరుకుని బీజేపీ ఎత్తులను నిలువరించాలని కోరారు. ఈ మేరకు జిల్లాలోని పార్టీ నాయకులు డీసీసీ ఆఫీసుకు చేరుకుంటున్నారు.
పోలీసుల హై అలెర్ట్…
ఇకపోతే అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన పిలుపు నేపథ్యంలో పోలీసులు పకడ్భందీగా వ్యవహారిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల సమీపంలోకి చేరుకుంటున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. హనుమాన్ మాల వేసుకున్న వారు డీసీసీ కార్యాలయం సమీపంలో తిరుగుతుండగా వారిని ముందస్తు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. మరో వైపున బీజేపీ శ్రేణులు డీసీసీ కార్యాలయానికి వెల్లేందుకు సమాయత్తమవుతున్నాయి.