కర్రి గుట్టల వద్ద అసలేం జరుగుతోంది..? మూడో రోజూ కొనసాగుతున్న కూంబింగ్

ముగ్గురు నక్సల్స్ మృతి…

ఇద్దరు జవాన్లకు గాయాలు..?

దిశ దశ, దండకారణ్యం:

తెలంగాణ, చత్తీస్ గడ్ సరిహద్దుల్లోని కర్రి గుట్టల వద్ద అసలేం జరుగుతోంది..? చత్తీస్ గడ్ కు చెందిన బలగాలు గుట్టను చుట్ట ముట్టడానికి కారణమేంటీ..? వేల సంఖ్యలో బలగాలు అక్కడకు చేరుకోవడంతో పాటు అంబూలెన్స్ లను కూడా సిద్దంగా ఉంచడం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్టుగా స్పష్టం అవుతోంది.

మూడు రోజులుగా…

కర్రి గుట్టల వద్ద మూడు రోజులుగా సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి చత్తీస్ గడ్ కు చెందిన బలగాలు. వేల సంఖ్యలో మోహరించిన బలగాలు కర్రిగుట్టలను చుట్టుముట్టగా హెలిక్యాప్టర్ ద్వారా ఏరియల్ సెర్చింగ్ కూడా కొనసాగిస్తున్నారు. బుధవారం ఉదయం కర్రి గుట్టల వద్దకు చేరుకున్న బలగాలు మావోయిస్టుల కదలికలను ఎక్కడికక్కడ కట్టడి చేసే పనిలో నిమగ్నం అయ్యాయి. గురువారం జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు పీఎల్జీఏ మహిళా సభ్యులు మరణించగా, పలువురు నక్సల్స్ గాయపడినట్టు బీజాపూర్ జిల్లా పోలీసు అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అంతేకాకుండా మావోయిస్టు పార్టీకి చెందిన డంప్ కూడా లభ్యం అయినట్టుగా అధికారవర్గాలు చెప్తున్నాయి. DRG, STF, CRPF, COBRA, బస్తర్ ఫైటర్స్ చేపట్టిన ఈ జాయింట్ ఆపరేషన్ బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ పి నేతృత్వంలో కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. శుక్రవారం కూడా బలగాల సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.

ఆపరేషన్ హిడ్మా..!

మావోయిస్టు పార్టీ మిలటరీ చీఫ్ గా వ్యవహరిస్తున్న హిడ్మా రెండు ప్లాటూన్లను వెంటబెట్టుకుని కర్రిగుట్టకు చేరుకున్నట్టుగా చత్తీస్ గడ్ పోలీసు అధికారులు కీలక సమాచారాన్ని అందుకున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర కమిటీ పరిధిలో ఉన్న ఈ గుట్టలపై మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు గణనీయంగా తగ్గిపోయాయని అంచాన వేసినప్పటికీ అనూహ్యంగా ఇక్కడ హిడ్మా ప్రత్యక్ష్యం కావడంతో చత్తీస్ గడ్ పోలీసు అధికారులు బలగాలను అప్రమత్తం చేసినట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. మిలటరీ ప్లాటూన్లను బదలాయించడంతో పాటు శిక్షణకు సంబంధించిన వ్యవహారాలు చక్కబెట్టేందుకే హిడ్మా కర్రి గుట్టలపై డెన్ ఏర్పాటు చేసుకున్నట్టుగా భావిస్తున్నారు.

స్వీయ రక్షణ చర్యలు…

అయితే కర్రి గుట్టలపై మావోయిస్టు పార్టీ భారీ ఎత్తున స్వీయ రక్షణ చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కర్రి గుట్టలపై షెల్టర్ జోన్ గా ఏర్పాటు చేసుకున్న పరిసర ప్రాంతాల్లో మందుపాతరలను అమర్చినట్టుగా సమాచారం. బలగాలు కూంబింగ్ కు వచ్చినట్టయితే ఎదురు దాడి చేసేందుకు అన్ని విధాలుగా సమాయత్తం అయినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా గుట్టపై బంకర్లను కూడా ఏర్పాటు చేసుకున్న మావోయిస్టులు బలగాలు కూంబింగ్ కోసం వచ్చినట్టయితే దాడుల నుండి తప్పించుకునేందుకు బంకర్లలోకి వెల్లి తల దాచుకునేందుకు వ్యూహం రచించుకుని ఉంటారని అంచనా వేస్తున్నారు. నిత్యవసరాలను కూడా గుట్టపైకి గతంలోనే తరలించి స్టోర్ చేసి పెట్టుకున్న నేపథ్యంలో బలగాలు దాడులు చేసినా ఆహారం కూడా సమృద్దిగా అందుబాటులో ఉండి ఉంటుందని అనుకుంటున్నారు. అయితే హిడ్మా కర్రిగుట్టలపై సాయుధ శిక్షణ ఇచ్చేందుకు వచ్చారా లేక మిలటరీ ప్లాటూన్ సభ్యులను బదలాయించుకునేందుకు వచ్చారా అన్న విషయంపై స్పష్టత రావడం లేదు. కర్రి గుట్టలను బలగాలు చుట్టు ముట్టడంతో అటువైపుగా స్థానికులు ఎవ్వరిని కూడా అనుమతించడం లేదు. మీడియా ప్రతినిధులు కూడా కర్రిగుట్టల వైపునకు వెల్తున్న క్రమంలో మార్గ మధ్యలోనే అడ్డుకున్నాయి. డ్రోన్లు, హెలిక్యాప్టర్ల సహాయంతో కూడా కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్టుగా స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అయితే మావోయిస్టులు గుట్ట కిందకు వస్తే మాత్రం బలగాలు వారిని చుట్టు ముట్టేందుకు అన్ని విధాలుగా రంగం సిద్దం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మావోయిస్టు పార్టీ శ్రేణులు కర్రి గుట్టపైనే బంకర్లను నిర్మాణం చేసుకోవడం వల్ల బలగాల ఏరివేత చర్యలకు ఆటంకంగా మారినట్టుగా తెలుస్తోంది. అయితే కర్రి గుట్టల వద్ద ఉన్న వాస్తవ పరిస్థితులు మాత్రం చత్తీస్ గడ్ పోలీసు అధికారులు అధికారికంగా ప్రకటిస్తే తప్ప బాహ్య ప్రపంచానికి పూర్తి వివరాలు తెలిసే అవకాశం లేకుండా పోయింది. హిడ్మాతో పాటు మిలటరీ ప్లాటూన్ లను ఏరివేసినట్టయితే మావోయిస్టు పార్టీ తీరని నష్టాన్ని చవి చూస్తోందని, దీంతో పార్టీ బలహీనపడుతోందని అంచనా వేస్తున్న పోలీసు అధికారులు ఈ ఆపరేషన్ ను యథావిధిగా కొనసాగించే యోచనలోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. అవసరమైతే మరిన్ని బలగాలను కూడా సమీప ప్రాంతాల్లో మోహరించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్న యోచనలో చత్తీస్ గడ్ పోలీసు అధికారులు ఉన్నట్టుగా సమాచారం.

బార్డర్ లో హై అలెర్ట్…

ఇకపోతే తెలంగాణ సరిహధ్దుల్లో పోలీసు అధికారులు హై అలెర్ట్ ప్రకటించారు. కర్రి గుట్టల వద్ద చత్తీస్ గడ్ బలగాలు ఆపరేషన్ చేపట్టిన నేపథ్యంలో గుట్ట మీద ఉన్న నక్సల్స్ తప్పించుకుని రాష్ట్రంలోకి చొరబడే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసిన అధికారులు సరిహధ్దుల్లో హై అలెర్ట్ ప్రకటించారు. ములుగు, భద్రాద్రి జిల్లాల సరిహధ్దు గ్రామాల్లో కూంబింగ్ చేపట్టినట్టుగా తెలుస్తోంది.

You cannot copy content of this page