సరిహద్దుల్లో హై అలెర్ట్… క్షేత్ర స్థాయిలో పర్యటించిన ఎస్పీ….

దిశ దశ, భూపాలపల్లి:

రాష్ట్రంలో మావోయిస్టులు రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉండడంతో సరిహద్దు ప్రాంతాల్లో అప్రమత్త చర్యలకు శ్రీకారం చుట్టారు భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే. గోదావరి పరివాహక ప్రాంతాల్లో నిఘా కట్టుదిట్టం చేయడంలో భాగంగా కాళేశ్వరం ఠాణాతో పాటు ఇసుక రీచులను పర్యవేక్షించారు. మహదేపూర్, పలిమెల మండలాలను ఆనుకుని ప్రవహిస్తున్న గోదావరి నదికి అవతలి ప్రాంతంలో ఉన్న గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలుకా, చత్తీస్ గడ్ లోని బస్తర్ అటవీ ప్రాంతాలు విస్తరించి ఉన్నాయి. దండకారణ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టులు షెల్టర్ తీసుకుని అక్కడ కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. అయితే పొరుగు రాష్ట్రాలలో మావోయిస్టుల కార్యకలాపాలను అణిచివేసేందుకు బలగాలు స్పెషల్ ఆపరేషన్ చేపట్టాయి. కీకారణ్యాల్లోకి కూడా చొచ్చుకుని వెల్తున్న బలగాలు మావోయిస్టులపై పై చేసి సాధిస్తున్నాయి. దీంతో షెల్టర్ జోన్ అభూజామఢ్  నుండి సరిహద్దు ప్రాంతాలకు మావోయిస్టులు వస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బార్డర్ ఏరియాకు పార్టీ డెన్ లను మార్చుకుంది. ఇదే పద్దతిన మహదేవపూర్, పలిమెల ప్రాంతాలకు అవతలి వైపునకు నక్సల్స్ వచ్చే అవకాశాలు లేకపోలేదని పోలీసులు అంచనా వేస్తున్నారు. అక్కడి నుండి అదును చూసి రాష్ట్రంలోకి రీ ఎంట్రీ ఇచ్చినట్టయితే మళ్లీ మావోయిస్టుల కార్యకలాపాలు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉంటాయని భావించిన జిల్లా ఎస్పీ బార్డర్ ఏరియాపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. సరిహద్దు ప్రాంతాలపై పోలీసులు నిఘా కట్టుదిట్టం చేసి నక్సల్స్ కదలికలపై దృష్టి సారించాలని సిబ్బందిని ఆదేశించారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో భాగంగా ఎస్పీ ప్రత్యేకంగా సరిహధ్దు ప్రాంతాల్లో తిరిగినట్టుగా తెలుస్తోంది. హై అలెర్ట్ గా ఉండి నక్సల్స్ తెలంగాణాలోకి రాకుండానే నిరోధించే విధంగా వ్యవహరించాలని ఎస్పీ ఆదేశించినట్టు సమాచారం. 

You cannot copy content of this page