మోహరించిన కేంద్ర బలగాలు…
మరో ఐదు రోజుల్లో పోలింగ్…
దిశ దశ, దండకారణ్యం:
రాష్ట్రంలో మరో ఐదు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దు ప్రాంతంమంతా బలగాలతో కిక్కిరిసిపోయింది. ఎన్నికలు సాఫీగా జరిగే వరకూ కూడా కంటిమీద కునుకు లేకుండా పోలీసులు, కేంద్ర బలగాలు బందోబస్తు చర్యలు చేపడుతున్నాయి. వేల సంఖ్యలో సరిహద్దుల్లోని జిల్లాలకు చేరుకున్న బలగాలు ప్రాణహిత, గోదావరి తీరాల్లో పకడ్భందీగా గస్తీ చేపడుతున్నాయి.
చత్తీస్ గడ్ నుండి…
ఇటీవలే చత్తీస్ గడ్ లో పోలింగ్ ప్రక్రియ ముగిసిపోవడంతో అక్కడ బందోబస్తు నిర్వహించిన కేంద్ర బలగాలు పెద్ద ఎత్తున తెలంగాణాకు చేరుకున్నాయి. అప్పటికే రాష్ట్ర పోలీసులు, గ్రౌహౌండ్స్ బలగాలు, పారా మిలటరీ ఫోర్స్ నక్సల్స్ కార్యకలాపాలను కట్టడి చేసే పనిలో నిమగ్నం అయ్యాయి. అయితే చత్తీస్ గడ్ లో రెండు విడుతల పోలింగ్ ముగిసిపోవడంతో బస్తర్ అటవీ ప్రాంతంలో నక్సల్స్ ఆపరేషన్లలో పాల్గొన్న బలగాలను కూడా తెలంగాణాకు రప్పించడంతో ఫోర్స్ పెద్ద ఎత్తున తెలంగాణాకు వచ్చి చేరింది. ఈ నెల 30న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మావోయిస్టులు రాష్ట్రంలోకి రాకుండా ఉండాలన్న లక్ష్యంతో రాష్ట్ర పోలీసు అధికారులు స్పెషల్ ఆపరేషన్లకు శ్రీకారం చుట్టారు.
భద్రాచలం వరకు…
ఆసిఫాబాద్ జిల్లా నుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు ప్రాంతాలన్ని కూడా బలగాల కనుసన్నల్లోనే మెదులుతున్న పరిస్థితి ఏర్పడింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అహౌరీ, భామ్రాఘడ్, ధానోరా ప్రాంతాల్లో మావోయిస్టుల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఆయా ప్రాంతాల నుండి తెలంగాణాలోకి చొరబడి ఎన్నికల బహిష్కరణ పిలుపులో భాంగంగా విధ్వంసాలకు కానీ, దాడులకు కానీ పాల్పడే అవకాశాలు ఉన్నాయని ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రాణహిత, గోదావరి నదీ తీరాల్లో పోలీసు బలగాలు కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. అలాగు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్, పల్మెల మండాలు, ములుగు జిల్లా ఏటూరు నాగారం, మంగపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల, వెంకటాపూర్, వాజేడు ఏరియాల్లో బలగాలు నక్సల్స్ ఏరివేత కార్యకలాపాల్లో నిమగ్నం అయ్యాయిన తెలంగాణాలో ఎన్నికల వాతావరణం నెలకొన్న క్రమంలో భద్రాద్రి జిల్లా పోలీసు అధికారులు కొంతమంది కొరియర్లతో పాటు సానుభూతిపరులను అరెస్ట్ చేశారు. నదీ తీరాల్లోని పడవలు తిరిగే ఏరియాలతో పాటు నది పరిసర ప్రాంతాల్లో భద్రతా చర్యలపై ఇప్పటికే సమీక్ష జరిపారు. ఏకంగా పోలీసు కమిషనర్లు, ఎస్పీలు కూడా క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ మావోయిస్టుల కట్టడిపై చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలోకి మావోయిస్టు పార్టీ యాక్షన్ టీం వచ్చిందన్న ప్రచారం కూడా జరగడంతో సరిహద్దుల్లో బందోబస్తు చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. పోలింగ్ పూర్తయిన తరువాత ఈవీఎంలు స్ట్రాంగ్ రూంకు సేఫ్ గా చేరే వరకూ కూడా సరిహద్దుల్లో స్పెషల్ ఆపరేషన్ కొనసాగించే విధంగా పోలీసు అధికారులు కార్యాచరణ రూపొందించారు.