దిశ దశ, జగిత్యాల:
ధర్మపురి ఎన్నిక విషయంలో వారి చేస్తున్న ఆలస్యమే వారిని ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నట్టుగా ఉంది. తాజాగా హై కోర్టు ఇచ్చిన అరెస్ట్ వారెంట్ కూడా ఇవే సంకేతాలను వెల్లడిస్తోంది. రిటైర్డ్ అయిన ఎన్నికల అధికారిని అరెస్ట్ చేసి హై కోర్టు అడిగిన రికార్డులను తీసుకుని రావాలని డీసీపీకి సమన్లు జారీ చేయడం సంచలనంగా మారింది.
ఇంతకీ ఏం జరిగిందంటే..?
ధర్మపురి ఎన్నికల ఫలితాల్లో అవకతవకలు జరిగాయని తాను కౌంటింగ్ సెంటర్లోనే అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ రిటర్నింగ్ అధికారులు పట్టించుకోలేదని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హై కోర్టును ఆశ్రయించారు అయితే అప్పుడు జరిగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియను మళ్లీ జరిపించాలని కోరినా పట్టించుకోనందున రీకౌంటింగ్ చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేశారు అడ్లూరి. ఇందుకు సంబందించిన రికార్డులు కోర్టులో సమర్పించాలని గతంలోనే కోర్టు రిటర్నింగ్ అధికారిని ఆదేశించింది. అయితే సదరు అధికారి రెండు సార్లు కోర్టుకు హాజరైనా రికార్డులు సమర్పించలేదని, మరో రెండు సార్లు కోర్టుకు హాజరు కాలేదని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ న్యాయవాది ధర్మేష్ హై కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన హై కోర్టు న్యాయమూర్తి రిటర్నింగ్ అధికారి ఈ నెల 27న సదరు రిటర్నింగ్ అధికారిని, రికార్డులతో సహా కోర్టులో ప్రోడ్యూస్ చేయాలని మల్కాజ్ గిరి డీసీపీని ఆదేశించింది. దీంతో రిటైర్డ్ రిటర్నింగ్ అధికారిని ఎట్టి పరిస్థితుల్లోనూ కోర్టులో హాజరు పర్చాల్సిన ఆవశ్యకత పోలీసులపై పడింది.
రికార్డులు ఎలా..?
అయితే ఈ కేసులో పిటిషనర్ తరుపున వాదనలు, వాంగ్మూలాల సేకరణ అంతా పూర్తికాగా ఎన్నికలు నిర్వహించిన అధికారులు మాత్రం కోర్టు అడిగిన రికార్డులను ఇంతవరకూ సమర్పించలేదు. దీంతో కోర్టు కూడా ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండడంతో రికార్డులను కోర్టులో ప్రొడ్యూస్ చేయక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే అరెస్ట్ వారెంట్ జారీ చేయడం వల్ల అధికారులు ధర్మపురి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు సంబందించిన అన్ని రికార్డులను కూడా కోర్టులో సమర్పించకతప్పదన్న అభిప్రాయాలే వ్యక్తం అవుతున్నాయి. ఒక వేళ అరెస్ట్ వారెంట్ తరువాత కూడా అధికారుల నుండి స్పందన లేకపోతే కోర్టు సీరియస్ గా తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయని తెలుస్తోంది.