రూ. 50వేలు చెల్లించండి
‘బండి’కి హై కోర్ట్ ఆదేశం
దిశ దశ, హైదరాబాద్:
అసెంబ్లీ ఎన్నికల్లో తప్పుడు అఫడవిట్ సమర్పించడంతో పాటు ఎన్నికల నిబంధనల పరిమితికి మించి ఖర్చు చేశారన్న ఆరోపణలకు సంబంధించిన కేసు ఈ నెల 20కి వాయిదా పడింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థిగా కరీంనగర్ నుండి బరిలో నిలిచిన గంగుల కమలాకర్ పై ప్రత్యర్థి బండి సంజయ్ కుమార్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టిన హైకోర్టు కమిషన్ ను అపాయింట్ చేసింది . ఆగస్టు12 నుండి 17లోగా బండి సంజయ్ వాంగ్మూలం తీసుకోవాలని ఆదేశించింది. అయితే క్రాస్ ఎగ్జామినేషన్ కు బండి సంజయ్ అటెండ్ కాలేదు. దీంతో మంగళవారం విచారించిన హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణించిన హైకోర్టు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రూ. 50 వేలు సైనిక్ వెల్ఫైర్ కు చెల్లించాలని ఆదేశించింది. విచారణకు రావల్సిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అందుబాటులో లేరని మళ్లీ వాయిదా వేయాలని కోరుతూ పిటిషన్ వేయడంతో హైకోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
ఇదేనా పద్దతి
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వ్యవహరిస్తున్న తీరు చట్టాన్ని అగౌరవపర్చే విధంగా ఉందని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి ఆరోపించారు. చట్టసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న వ్యక్తే కోర్టులను గౌరవించకపోవడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. పలుమార్లు కోర్టు విచారణకు హాజరుకాకుండా వాయిదాలు కోరుతుండడాన్ని బట్టి చూస్తే ఆయన ఈ కేసును నీరుగార్చుతున్నట్టుగా ఉందన్నారు. కేసు కోట్టివేస్తే జ్యుడిషరీ వ్యవస్థ తీసుకున్న నిర్ణయం అంటూ చెప్పుకుని ప్రజల్లో తిరగాలని చూస్తున్నారన్నారు. గంగుల కమలాకర్ పై కోర్టులో పిటిషన్ వేసి ఎందుకు తప్పించుకుంటున్నారో కరీంనగర్ ప్రజలకు సమాధానం చెప్పాలని జోజిరెడ్డి డిమాండ్ చేశారు. ఓ సారి ఢిల్లీలో మరోసారి అమెరికాలో… సమావేశాఋ ఉన్నాయనో ఏదో ఒక సాకు చూపుతూ విచారణకు హాజరు కాకపోవడం వెనుక ఖచ్చితంగా ప్రత్యర్ధులు ఇద్దరు కూడా ఒక్కటయ్యారని స్పష్టం అవుతోందని ఆరోపించారు. మంత్రి గంగుల కమలాకర్, బండి సంజయ్ లు లోపాయికారి ఒప్పందం కారణంగానే అటు కోర్టుకు హాజరు కాకుండా ఇటు కరీంనగర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. చట్టాలను, కోర్టులను కూడా వాడుకుంటున్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తీరు ఎలా ఉందో కూడా కరీంనగర్ ప్రజలు ఆలోచించాలని కోరారు. మరోసారి విచారణకు హాజరుకాకున్నా, విచారణకు హాజరై తప్పుడు వాంగ్మూలం ఇచ్చినట్టయితే… జ్యుడిషరీ వ్యవస్థను దుర్వినియోగం చేసుకున్న కేసు నమోదు చేసి బండి సంజయ్ కి శిక్ష వేయాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ ను కూడా అభ్యర్థిస్తానని అంబటి జోజిరెడ్డి తెలిపారు