కరీంనగర్‌ TUWJ ఎన్నికలపై హైకోర్టు ఆదేశాలు


దిశ దశ, కరీంనగర్:

TUWJ కరీంనగర్ ఎన్నికల ప్రక్రియపై హైకోర్టు అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. డిసెంబరులో జరిగిన కరీంనగర్‌ తెలంగాణ స్టేట్‌ యూనియన్‌ ఆప్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ (టీయూడబ్లూజే) ఎన్నికలు బైలాస్‌కు వ్యతిరేకంగా జరిగాయని తన పిటిషన్‌ను పరిశీలించాలని చెలుకల రామకృష్ణా రెడ్డి అభ్యర్ధించడంతో ఈ మేరకు  ఆదేశాలను జారీ చేసింది. టీయూడబ్లూజే కరీంనగర్ యూనిట్‌లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ చెలుకల రామక్రిష్ణరెడ్డి ఎన్నికలకు ముందు జిల్లా కలెక్టర్, కార్మిక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన రామక్రిష్ణరెడ్డి ఎలక్షన్ ప్రక్రియ సజావుగా సాగడం లేదంటూ పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓటరు నమోదు జాబితాలో కొత్త వారికి సభ్యత్వం ఇచ్చిన తీరు సక్రమంగా లేదంటూ పలు సందేహాలను వ్యక్తం చేశారు. అయినా ఎన్నికలు నిర్వహించిన అడ్‌హక్‌ కమిటీ, ఎన్నికల అధికారులు ఎలక్షన్  ప్రక్రియను కంప్లీట్ చేశారు. ఎన్నికల సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా, కొత్త వారికి సభ్యత్వం ఇవ్వడంతో పాటు అప్పటికపుడు ఓటు వేసే హక్కు కల్పించడం సరికాదని రామకృష్ణ రెడ్డి తన పిటిషన్‌లో వివరించారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించలేదని, ఒక వర్గానికి కొమ్ముకాసేలా వ్యవహరించారని ఆరోపిస్తూ డిసెంబరు 16వ తేదీన కార్మికశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. యూనియన్ బైలాస్‌కు వ్యతిరేకంగా మేనేజింగ్‌ ఎడిటర్లు, యాజమాన్య ప్రతినిధులకు, విలేకరులు కానివారికి సభ్యత్వం కల్పించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో యూనియన్‌లో ఆఫీస్ బేరర్లుగా పనిచేసిన వారితో పాటు పలువురు సీనియర్ సభ్యులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా తొలగించారని, నిబంధనల ప్రకారం సభ్యులకు నోటీసులు ఇచ్చి సంజాయిషీ తీసుకోవాల్సి ఉందన్నారు. తాను, కార్మికశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని హైకోర్టుకు విన్నవించారు.   సభ్యత్వంపై జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, తాజాగా జరిగిన కరీంనగర్ టీయూడబ్లూజే ఎన్నికల్లో  గెలిచిన అధ్యక్షుడు యూనియన్ నిబంధనల ప్రకారం ప్రాథమిక సభ్యత్వానికీ  అనార్హుడని హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను హైకోర్టుకు సమర్పించారు. దీనిని విచారించిన హైకోర్టు రామకృష్ణ ఫిర్యాదును పరిశీలించాలని ఆదేశించింది.

You cannot copy content of this page