అణిచివేత నుండి… అమాత్యుని వరకు…

విమర్శల నుండి పొగడ్తల వరకు…

కేంద్ర మంత్రి బండి సంజయ ప్రస్థానం…

దిశ దశ, కరీంనగర్:

రెండున్నర దశాబ్దాల క్రితం పార్టీ కార్యకలాపాల్లో క్రియాశీలంగా పాల్గొంటున్న ఆయన్ని బలహీనుడిగా చేయాలని చూశారు ప్రత్యర్థులు. అణిచివేత ధోరణితో ఆయన్ని వెంటాడిన తీరు అంతా ఇంతాకాదు. సంస్థాగత ఎన్నికల్లో అయినా… పార్టీ పదవుల్లో అయినా ఆయన ఆదిపత్యానికి చెక్ పెట్టుకుంటూ వచ్చారు. తమ కళ్లముందటి పిల్లవాడు ఎదిగితే ఇబ్బందనుకున్నారో లేక… ఏకు మేకవుతాడునుకున్నారో తెలియదు కానీ… స్వయం సేవక్ నుండి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆ నాయకుడు మాత్రం ప్రత్యక్ష్య నరకాన్నే అనుభవించారు. అయినా పార్టీ వీడకుండా… ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదిగిన తీరు మాత్రం ఆశ్యర్యానికి గురి చేస్తోంది.

బండి సంజయ్ ప్రస్థానం…

ఆర్ఎస్సెస్ లో స్వయం సేవకుడిగా మొదలైన బండి సంజయ్ ప్రస్థానంలో చాలా సందర్బాల్లో పూల బాట కన్నా ముళ్ల బాటే ఎదురైంది. శిశు మందిర్ విద్యార్థి కూడా అయిన సంజయ్ ప్రత్యక్ష్య రాజకీయాల్లోకి వచ్చిన తరువాత పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనే వాడు. అర్బన్ బ్యాంకు డైరక్టర్ గా, కార్పోరేటర్ గా, పార్టీ రాష్ట్ర స్థాయి కమిటీల్లో బాధ్యతలు చేపట్టిన ఆయన ఎంపీగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, కేంద్ర సహాయ మంత్రి పదవులు అందుకున్నారు. రెండున్నర దశాబ్దాల క్రితం సంస్థగత ఎన్నికల ప్రక్రియలో బండి సంజయ్ ని ఓడించాలని… ఆయన నాయకత్వానికి మొదట్లోనే చెక్ పెట్టాలని ప్రత్యర్థులు పావులు కదిపి సక్సెస్ అయ్యారు. సంజయ్ కి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించినప్పుడు కూడా అడ్డుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. బీజేవైఎం జాతీయ కమిటీలో బాధ్యతలు అప్పగించినప్పుడు కూడా ఆయన పదవి నుండి తొలగించేందుకు సొంత పార్టీ నాయకులే పావులు కదిపారు. సంఘ్ పరివార్ ఆశీస్సులు ఉండడంతో పాటు ఆయనలోని మొండి ధైర్యం ముందుకు నడిపించింది. సంజయ్ ఎడ్డెం అంటే తెడ్డెం అనడానికే ప్రాధాన్యత ఇచ్చారు ఆయన్ని ఆణిచివేసేందుకు ప్రయత్నించిన వారు. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్ష్య పదవి మార్పు విషయంలో కూడా సంజయ్ వైఫల్యాలు అంటూ మీడియాకు లీకులు ఇచ్చారు. అయితే రెండో సారి ఎంపీగా 2.25 లక్షల మెజార్టీ అందుకున్న ఆయనను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి వరించడం గమనార్హం. వెంకయ్య నాయుడు జాతీయ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతల్లో ఉన్న సమయంలో కొంతకాలం ఢిల్లీలో ఆయన వెంట ఉన్న సంజయ్ ప్రత్యక్ష్య రాజకీయాల్లోకి రావాలన్న తపనతో కరీంనగర్ వచ్చారు. వచ్చినప్పటి నుండి కూడా సంజయ్ లక్ష్యంగానే వైరి వర్గం పావులు కదిపింది.

ప్రత్యర్థి పార్టీలు సైతం…

ఇకపోతే బండి సంజయ్ సొంత పార్టీనే కాకుండా ప్రత్యర్థి పార్టీ నాయకులు కూడా టార్గెట్ చేసుకుని విమర్శలు చేశారు. సంజయ్ ఏనాడూ సక్సెస్ కాలేదని… ఆయన అభివృద్ది చేయలేదని విమర్శలు చేశారు. మొన్నటికి మొన్న కరీంనగర్ స్మార్ట్ సిటీగా గుర్తించే విషయంలో కూడా సంజయ్ పాత్ర లేదని ఘాటైన పదజాలం ఉపయోగించారు. స్మార్ట్ సిటీగా గుర్తించే విషయంలో ఢిల్లీకి వెల్లిన కరీంనగర్ బల్దియా బృందంలో కనీసం సంజయ్ ని ఆహ్వనించకూడా లేదు. అయినప్పటికీ స్మార్ట్ సిటీ గుర్తింపు కోసం తనవంతుగా పార్టీ నేతలత చర్చించారు సంజయ్. అయితే తాజాగా జరిగిన లోకసభ ఎన్నికల్లో కూడా స్మార్ట్ సిటీ ఏర్పాటు పాత్రలో సంజయ్ పాత్ర ఏ మాత్రం లేదన్న ఆరోపణలు ఘాటుగా చేశారు. బండి సంజయ్ ని టార్గెట్ చేస్తూ పలుమార్లు మీడియా ముందు వ్యాఖ్యానించిన మేయర్ సునీల్ రావు కూడా ‘‘బండి’’ని పొగడుతుండడం గమనార్హం. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు, కార్పోరేటర్లు కూడా వ్యక్తిగతంగా వెల్లి తమ సహచరుడు అంటూ అభినందనలతో ముంచెత్తుతున్నారు.

You cannot copy content of this page