పాడి వర్సెస్… పాడి…

హుజురాబాద్ లో రసవత్తర పోరు తప్పదా..?

కాంగ్రెస్ చూపు ఆయన వైపు…

ఎంపీ అయితే బావుంటుందన్న యోచన…

ఎమ్మెల్యే కోసం తెరపైకి వచ్చిన ప్రతిపాదన

దిశ దశ, హుజురాబాద్ కరస్పాండెంట్:

హుజురాబాద్ ఎన్నికల్లో మరోసారి రసవత్తర పోరు జరగనుందా..? ఇంతకాలం వేర్వేరు కుటుంబాల నుండి బరిలో నిలిస్తే ఈ సారి ఒకే కుటుంబం నుండి ప్రత్యర్థులు కానున్నారా..? కాంగ్రెస్ అధిష్టానం మదిలో ఇదే ఆలోచన ఉందా… లేక ఆయనే ఉత్సాహంగా ఉన్నారా..?

ఒకే కుటుంబం…

ఓటు బ్యాంకు ఉన్న బలమైన అభ్యర్థిని బరిలో నిలబెట్టుకోలేకపోయామని, మరోసారి అక్కడి నుండి జెండా ఎగురవేయాలన్న యోచనలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంతకాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్న పాడి కౌశిక్ రెడ్డి ఉప ఎన్నికల్లో గులాభి కండువా కప్పుకోవడంతో ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ను రంగంలోకి దింపింది కాంగ్రెస్ అధిష్టానం. అయితే అంచనాలు తలకిందులు చేస్తూ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని హుజురాబాద్ వాసులు విశ్వసించినట్టుగా కనిపించలేదు. దీంతో అతి తక్కువ ఓట్లను దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవాన్ని చవి చూసింది. దీంతో వచ్చే జనరల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చూపాలన్న తాపత్రయంతో ఆ పార్టీ నాయకులు కసరత్తులు చేస్తున్నట్టుగా ఉంది. రానున్న ఎన్నికల్లో కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా నిలిచే అవకాశాలు దాదాపు ఖాయం కాగా, ఆయనపై పై చేయి సాధించేందుకు వ్యూహాల్లో మునిగి తేలుతున్నట్టుగా ఉంది కాంగ్రెస్ అధిష్టానం. పాడి కౌశిక్ రెడ్డిపై అదే ఫ్యామిలీకి చెందిన ఉదయ్ నందన్ రెడ్డిని బరిలో దింపితే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. పూర్వీకులంతా రక్త సంబంధీకులే అయినప్పటికీ ఉదయ్ నందన్ రెడ్డి, కౌశిక్ రెడ్డి కుటుంబాల మధ్య వైరుధ్యాలు నెలకొని ఉన్నాయి. దీంతో ఉదయ్ నందన్ రెడ్డి కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని యోచిస్తుండడం కూడా కలిసి వస్తుందని భావిస్తున్న నేపథ్యంలో ఆయనను హుజురాబాద్ బరిలో నిలిపితే ఎలా ఉంటుంది అన్న ప్రతిపాదన తెరపైకి వచ్చినట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది.

యూప్ టీవీ అధినేత…

యూప్ టీవీ అధినేతగా ఉన్న ఉదయ్ నందన్ రెడ్డి స్వగ్రామం కూడా వీణవంక కావడం విశేషం. అయితే ఆయన ఎన్జీఓ ద్వారా గ్రామీణ ప్రాంతాల వారికి సేవా కార్యక్రమాలతో అనుభందం పెనవేసుకున్నారు. సామాజిక ధృక్ఫథం కూడా ఉన్న ఆయన కరీంనగర్ జిల్లాలోని చాలా చోట్ల కూడా దశాబ్ద కాలంగా సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఉన్న పేరు, కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ కలిస్తే ఎలా ఉంటుంది అన్న యోచనలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రతిపాదనల విషయంలో ఉదయ్ నందన్ రెడ్డి ఎలా స్పందిస్తారోనన్నది వేచి చూడాల్సి ఉంది. ఇంతకు ముందు కూడా ఓ సారి ప్రతిపాదన వస్తే కరీంనగర్ నుండి ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా నెలకొన్న పరిణామాల దృష్ట్య ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ముందుకు వస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది. మరో వైపున కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థుల అన్వేషణలో ఉదయ్ నందన్ రెడ్డి పేరు కూడా పరిశీలించి ఉంటుంది కానీ ఆయనకే టికెట్ కనఫర్మ్ మాత్రం చేయలేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో హుజురాబాద్ టఫ్ ఫైట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా దృష్టి సారించినట్టుగా స్పష్టం అవుతోంది.

You cannot copy content of this page