అవ్వకు పెట్టరట బువ్వ… న్యాయం చేయాలంటున్న నరసవ్వ

దిశ దశ, మానకొండూరు:

పేగు బంధం తెంచుకుని పుట్టిన బిడ్డలు కన్నతల్లికి బుక్కెడన్నం పెట్టడం లేదు. ఆస్తుల పంచుకునే వరకు వారసులం కానీ అమ్మను చూసుకునేందుకు కాదని అంటున్నారు… గుడిసెలో ఉంటున్న తన గురించి పట్టించుకోవడం లేదని ఓ వృద్దురాలు పోలీసులను ఆశ్రయించింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరుకు చెందిన నరసవ్వ దీనస్థితి దారుణంగా ఉంది. కడుపున పుట్టిన నలుగురు కొడుకులను ఓ ఇంటి వాళ్లను చేసి, ఆస్తుల పంపకాలు చేసి ప్రయోజకులను చేసింది నరసవ్వ. అయితే వృద్దాప్యానికి చేరుకున్న ఆమె ఓ చిన్న గుడిసెలో తల దాచుకుంటూ జీవనం సాగిస్తోంది. చేతులు వణుకుతూ… ఊత కర్ర సాయంతో నడుస్తున్న తనకు అన్నం కూడా పెట్టడం లేదని వాపోయింది. తన పట్ల వివక్ష చూపుతున్న బిడ్డలను పిలిచి తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. ఎల్ఎండీ ఎస్సై చేరాలను కలిసిన నరసవ్వ తన గోడు వెల్లబోసుకోవడంతో ఆమెకు బాసటగా నిలిస్తామని చెప్పారు. తల్లి పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యం సరికాదని వారికి నచ్చచెప్తామని ఎస్సై నరసవ్వకు మాట ఇచ్చారు.

You cannot copy content of this page