పవన్ కళ్యాణ్ ప్రచార రథంపై చర్చ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల కోసం సిద్దం చేసుకున్న ప్రచార రథం గురించి మీకు తెలుసా..? అసలు ఆయన ఈ వాహనానికి ఆపేరు ఎందుకు పెట్టారు..? ఇలాంటి వాహనాలు ఎక్కడ ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
వైవిద్యతే ఆయన స్పెషాలిటీ…
పవన్ కళ్యాణ్ సహజ సిద్దంగానే ఉన్నట్టు కనిపిస్తారు కానీ ఆయన ఎంచుకునే విధానంలో మాత్రం వైవిద్యత కనబరుస్తారన్నది నిజం. మెగా బ్రదర్స్ కంటే భిన్నమైన జీవన విధానాన్ని ఎంచుకునే పవన్ లో ధార్మిక భావన కూడా ఎక్కువే. భారతీయ ఇతిహాసాలపై అపారమైన నమ్మకం కనబర్చడంతో పాటు భక్తి భావాన్ని కూడా ఎక్కువగా ప్రదర్శిస్తుంటారు. గతంలో గోమాతల సేవలు చేసిన పవన్ వ్యవహరించే తీరు కేవలం ఆయన అభిమానులకే కాదు విభిన్న వర్గాలను కూడా ఆకట్టుకుంటుందన్నది నిజం. ఆధ్యాత్మికత కూడా ఎక్కువగా ఉండే పవన్ కుటుంబానికి అత్యంత ఇష్టమైన దైవం మాత్రం పవనసుత హనుమాన్. అయితే ఈ సారి ఆయన తయారు చేసుకున్న ప్రచార రథానికి పెట్టిన పేరే ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. ‘వారాహి’ అని నామకరణం చేసిన ఈ వాహనంలోనే ఎన్నికలప్పుడు తిరుగుతూ ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. బుధవారం హైదరాబాద్ లో ట్రయల్స్ కూడా చూసిన పవన్ కొన్ని మార్పులు చేర్పుల గురించి కూడా చెప్పి వాటిని సర్దుబాటు చేయాలని చెప్పారు. అయితే వాహనానికి వారాహి పెట్టిన పేరు సప్త మాతృకల్లో ఒకరిది కావడం విశేషం.
సప్త మాతృకలు ఎవరు..?
సప్త మాతృకల గురించి పురణాల్లో వివరించినప్పటికీ చాలా మందికి వీరి గురించి తెలియకపోవచ్చు. దేశంలో కూడా కేవలం రెండు ఆలయాల్లో మాత్రమే ఈ సప్త మాతృకలు వెలిసి ఉన్నారని కూడా తెలుస్తోంది. అందులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి (కాశీ)లోని విశ్వేశ్వర ఆలయం ఒకటి కాగా మరోకటి తెలంగాణాలోని వేములవాడ మాత్రమే. ఏడుగురు మాతృకలు వెలిసిన ఈ రెండు క్షేత్రాలకు మాత్రమే అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. బ్రాహ్మీ, మహేశ్వరీ, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి(ఐంద్రీ), చాముండ అని సప్త మాతృకల పేర్లు. ఒక్కో మాతృక ఒక్కో ప్రత్యేకతను సంతరించుకున్నాయని పండితులు చెప్తున్నారు. బ్రహ్మలోని శక్తి బ్రాహ్మి, విష్ణుశక్తి వైష్ణవి, మహేశ్వరుని శక్తి మహేశ్వరి, స్కందుని శక్తి కౌమారి, యజ్ఞ వరాహస్వామి శక్తి వారాహి, ఇంద్రుని శక్తి (ఐంద్రి), అమ్మవారి భ్రూమధ్యం (కనుబొమల ముడి) నుంచి ఆవిర్భవించిన కాలశక్తి కాళీ (చాముణ్డా)లను సప్త మాతృకలు అని పిలుస్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్దం చేసుకున్న ఎన్నికల ప్రచార వాహనానికి వారాహీ అని పేరు పెట్టారు. యజ్ఞ వరాహశక్తి అన్న ప్రదాయినిగా ఆవిర్భవించిన ఈ మాతృకకు చేతిలో నాగలి, రోకలి ఆయుధాలుగా ఉంటాయి. అన్నోత్పత్తిని, అన్నపరిణామాన్నీ (మార్పును) తెలియజేసే సంకేతాలుగా వీటిని అభివర్ణిస్తుంటారు. దేవతలకు హవ్యాన్నీ, మానవాది జీవులకు యోగ్యమైన అన్నాలను అందించే ఆహార శక్తి వారాహీ మాతృక అని పురణాలు చెప్తున్నాయి. అంటే రానున్న ఎన్నికల్ల తన వారాహీ ద్వారా ఆహరశక్తిని అందించే రథంతో ప్రజల్లోకి వెల్తున్నారని అర్థం.
ఈ టైపు వాహనాలను చూశారా..?
అయితే సాధారణ వాహనాలకు భిన్నంగా కనిపిస్తున్న పవన్ కళ్యాణ్ వారాహీ ప్రచార రథం డిజైన్ కూడా డిఫరెంట్ గానే ఉంది. ఆర్మీ బలగాలు సరిహద్దుల్లో తిరిగేందుకు ఇలాంటి వాహనాలను ఉపయోగిస్తుంటారు. అలాగే నక్సల్స్ ప్రాబల్యం ఉన్న జిల్లాల్లో ఈ టైపు వాహనాలు తిరుగుతుంటాయి. గతంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా ఈ వాహనాలు సంచరించేవి. మందుపాతరలు పేల్చి భద్రతా దళాలను, పోలీసులను హతమారుస్తున్న క్రమంలో స్వీయ రక్షణ చర్యలు తీసుకోవడంలో భాగంగా మైన్ ప్రూఫ్ వాహనాలను ఏర్పాటు చేశారు. అత్యంత శక్తివంతమైన మందుగుండు సామాగ్రితో పేల్చినప్పుడు అందులో ప్రయాణించే వారు క్షేమంగా బయటపడతారని కట్టుదిట్టంగా తయారు చేశారు. మైన్ ప్రూఫ్ వాహనాలను పోలినట్టుగా పవన్ కళ్యాణ్ తయారు చేయించుకున్న వారాహీ ప్రచార రథం ఉండడం విశేషం. ఇది జనసేన పవన్ కళ్యాణ్ తయారు చేసుకున్న ప్రచార రథం కథాకమామిషు.