నేటికీ వెంటాడుతున్న వైనం…
అన్నల పిలుపు సర్కారు ఆచరణ…
అడవులే ఆలంబనగా చేసుకని జీవనం సాగిస్తున్న గిరిజనుల సాగు చేసుకునేందుకు అవసరమైన భూములు అవసరమని అన్నలు నాడు పిలుపునిచ్చారు. ఆ నాటి విప్లవకారులు ఇచ్చిన పిలుపుతో పోడు వ్యసాయానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికీ ఆ నినాదాన్ని అందుకునే అటవీ ప్రాంత వాసులు అడవులను నరికి వ్యవసాయం చేసుకుంటున్నారు. నాలుగు దశాబ్దాల క్రితం పీపుల్స్ వార్ నక్సల్స్ ఇచ్చిన పోడు వ్యవసాయంపై స్పెషల్ స్టోరీ…
పోడు సాగు…
అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులు ఉత్పత్తులను సేకరించి ఉపాధి పొందుతూ తమ కుటుంబానికి అవసరమైనంత భూమిని చదును చేసుకుని అందులోనే వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించే వారు. అయితే అడవులపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న గిరిజనులు వ్యవసాయం కోసం భూమి చాలినంత లేదన్న విషయాన్ని గమనించి పోడు సాగు కోసం 1982 ప్రాంతంలో పీపుల్స్ వార్ నక్సల్స్ అడవులను నరికి వ్యవసాయం చేసుకోవాలని పిలునిచ్చారు. అప్పటికే అడవులపై ఆధారపడిన కుటుంబాలు తప్ప ఇతరులు అటువైపు కన్నెత్తి చూడలేదు. ఆనాడు అడవులు నరికి వేయవద్దన్న భావనకు తోడు అటవీ అధికారులంటే అప్పటి ప్రజల్లో నెలకొన్న భయం కూడా పోడు నినాదాన్ని అందుకుని ముందుకు వచ్చేవారు చాలా తక్కువ సంఖ్యలోనే ఉండేవారు. అంతేకాకుండా పీపుల్స్ వార్ దళాల ఉనికి కూడా అంతంతమాత్రమే ఉండడంతో అడవులు నరికి సాగు చేస్తున్నతమపై ఫారెస్ట్ అధికారులు కేసులు నమోదు చేస్తే తమను కాపాడేవారు ఎవరూ అన్న ఆందోళన కూడా నెలకొనడం కూడా మరో కారణమని చెప్పవచ్చు.
1990లో పెరిగిన వైనం..
పోడు నినాదానికి ఆకర్షితులై అడవులను నరికేవేసే ప్రక్రియ ఎక్కువగా 1990వ దశాబ్దంలోనే సాగింది. 1989 ఎన్నికల తరువాత పీపుల్స్ వార్ నక్సల్స్ కు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు స్వేచ్చ కల్పిస్తామని ప్రజా క్షేత్రంలో తిరిగేందుకు అనుమతి ఇస్తామని ప్రకటించింది. ఎన్నికలకు ముందు చెన్నారెడ్డి ఇచ్చిన ఈ హామీ మేరకు ఎన్నికల తరువాత ఆచరణలో పెట్టడంతో పాటు అణగారిన, అణిచివేతకు గురైన, బడుగు, బలహీన వర్గాల్లో పీపుల్స్ వార్ పట్టు కూడా పెద్ద ఎత్తున సాధించింది. దీంతో దళాల కదిలకలు కూడా పెద్ద ఎత్తున పెరగడంతో ప్రజలు పీపుల్స్ వార్ నినాదాలను అందిపుచ్చుకుని ఆచరణలో పెట్టేవారు. ఇదే సమయంలో పోడు సాగు కూడా తెలంగాణాలోని అటవీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సాగింది. అడవులను నమ్ముకుని జీవనం సాగిస్తున్న వారే కాకుండా అటవీ గ్రామాల్లో నివసిస్తున్న చాలా మంది కూడా పోడు వ్యవసాయం కోసం అడవులను నరికివేసే ప్రక్రియ వైపు అడుగులేశారు. దీంతో కీకారణ్యాలన్ని మైదానాలుగా మారి సాగు భూములుగా బదలాయించబడ్డాయి. అటవీ శాఖ రికార్డుల్లో ఆ భూములు ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ కు చెందినవేనని పేర్కొన్నప్పటికీ లక్ష ఎకరాల వరకూ భూములు పంట చేలుగా మారిపోయాయి. అటవీ అధికారులు ఎంక్రోచ్ మెంట్ యాక్ట్ తో పాటు ఇతరాత్ర చట్టాలకు పనిచెప్పి కొంతకాలం కేసులు నమోదు చేసినప్పటికీ పెద్ద ఎత్తున ఆధారపడి జీవనం సాగిస్తున్న జనంతో ముడిపడి ఉన్న వ్యవహారం కాబట్టి సీరియస్ గా ముందుకు సాగలేకపోయారు. అంతేకాకుండా 1990వ దశాబ్దంలో నక్సల్స్ తిరుగులేని పట్టు సాధించడంతో అడవుల్లో ఫారెస్ట్ అధికారులు తిరిగే పరిస్థితి కూడా లేకుండా పోయింది. అన్నల భయానికి తోడు అటవీ అధికారుల కార్యాలయాలు పేల్చేయడం, కమ్యూనికేషన్ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేయడంతో అటవీ అధికారులు పట్టణాల బాట పట్టాల్సి రావడం వల్ల కూడా పోడు సాగు మరింత పెరిగిందని చెప్పాలి.
వైఎస్… కేసీఆర్…
ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోడు వ్యవసాయం చేసుకుంటున్న వారికి ఆ భూముల్లో పట్టాలు ఇస్తామని ప్రకటించారు. ఈ మేరకు 2006లో రాష్ట్రంలోని సుమారు 70 వేల మందికి 38 వేల ఎకరాల వరకూ పట్టాలు ఇచ్చారు. అటవీ శాఖ రికార్డుల్లో ఉన్నఈ భూముల్లో ఆయా ప్రాంతాల్లోని రైతాంగానికి పట్టాలు ఇవ్వడం అసాధ్యమని తేల్చినప్పటికీ అప్పటి ప్రభుత్వం సుసాధ్యం చేసింది. అయితే ఎప్పుడైతే ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టిందో అప్పటి నుండి అడవుల నరికివేత తీవ్రతరం అయింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం పోడు వ్యవసాయానికి విధివిధానాలు అమలు చేయడంతో కొత్తగా అడవులను నరికిన వారికి మాత్రం పట్టాలు ఇవ్వలేదు. కానీ ఇలాంటి అవకాశం భవిష్యత్తులో ఏనాటికైనా మళ్లీ వస్తుందన్న ఆశతో పోడు సాగును మాత్రం చాలా మంది వదులుకోలేదు. పట్టాలు అందని వారితో పాటు కొత్తగా పోడు సాగు వల్ల తమకు భూములు వస్తాయని ఆశించిన వారంతా కూడా అటువైపే మొగ్గు చూపారు. తెలంగాణ కల సాకారం అయిన తరువాత పోడు వ్యవసాయం చేసుకునే వారికి మళ్లీ పట్టాలు ఇస్తామని ప్రకటించడంతో మరింత మంది తమ కుటుంబ సభ్యుల కోసం అడవులను నరికి భూములను సాగు చేయడం ఆరంభించారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంపై విధివిధానలు తయారు చేయడం, కమిటీలు వేసి పోడు సాగు చేసే వారిని గుర్తించడం వంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టినప్పటికీ ఆచరణలో మాత్రం పెట్టలేకపోతోంది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యానికి మించి అడవులు నరికివేతకు గురై పోడు కోసం వస్తున్న దరఖాస్తుల సంఖ్య పెరగడమే కారణమని తెలుస్తోంది. దీనివల్ల పర్యవరణ సమతుల్యత పూర్తిగా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయన్న ఆందోళనలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ విధానం ఓ వైపున సాగుతుండగానే మరోవైపున అటవీ గ్రామాల్లో ఫారెస్ట్ అధికారులు గిరిజనులకు మధ్య పెద్ద ఎత్తున వార్ ప్రారంభం అయింది. తాము కొన్నేళ్లుగా పోడు వ్యవసాయం చేస్తున్నామని అటవీ ప్రాంత వాసులు చెప్తుంటే కొత్తగా నరికివేసి సాగు చేస్తున్నారన్న వాదనలు అటవీ అధికారులు వినిపిస్తున్నారు. అటవీ భూముల్లోకి చొరబడుతున్నారన్న ఆరోపణలు కూడా ఎక్కువయ్యాయి. దీంతో అటవీ ప్రాంత వాసులకు, అటవీ శాఖ అధికారులకు మధ్య ప్రచ్ఛన్న యుద్దమే సాగుతోంది.