అక్షర టౌన్ షిప్ మాయ వెనకున్నదెవరో..? ఫిర్యాదు చేయనట్టయితే..?

 

దిశ దశ, కరీంనగర్:

భవ్యమైన మందిరం మాటున రియల్ ఎస్టేట్ మాఫియా సామాన్యుడి జీవితాలతో చెలగాటమాడాలునుకుందా..? నిబంధనల అమలు కాకుండా అధికార యంత్రాంగాన్ని ఒత్తిడికి గురి చేసి మరీ అనుమతులు ఇప్పించిందెవరూ..? అధికారులు కూడా గుడ్డిగా వ్యవహరించడం వల్ల నష్టం కల్గుతుందన్న విషయాన్ని విస్మరించారెందుకు..? పంచాయితీ సర్పంచ్ ఫిర్యాదు చేయనట్టయితే సామాన్యులు నడిరోడ్డుపై పడేవారు కాదా..?

అక్షర మాయా జాలం…

రహదారి లేని చోట వెంచర్ వేసి ప్లాట్లు కొన్న వారిని నట్టేట ముంచాలన్న స్కెచ్ వేయడం వెనక కారణాలు ఏంటన్నదే అంతుచిక్కకుండా పోయింది. కరీంనగర్ సమీపంలోని నగునూరు దుర్గామాత ఆలయం సమీపంలో అక్షర టౌన్ షిప్ పేరిట భారీ వెంచర్ ప్రారంభించారు. ఇందుకు క్షేత్ర స్థాయి పరిశీలన చేయకుండానే అంతా ఆన్ లైన్ లోనే అనుమతులు ఇచ్చేశారు అధికారులు. వెంచర్ కు ఉన్న అనుభంద రోడ్డు ఎక్కడుంది..? ఎస్సారెస్పీ కెనాల్ రహదారిని కమర్షియల్ అవసరాల కోసం వాడుకునేందుకు నిభందనలు వర్తిస్తాయా..? అసలు 40 ఫీట్ల రోడ్డుకు ఈ వెంచర్ లింక్ అయి ఉందా అన్న బేసికి రూల్స్ ను కూడా పట్టించుకోకుండా పర్మిషన్లు ఇవ్వడం అన్ని వర్గాల వారిని ఆశ్యర్యానికి గురి చేస్తోంది. పంచాయితీతో సంబంధం లేకుండానే సుడా ఇచ్చిన ఈ అనుమతులతో అక్కడ ప్లాట్లు కొన్నవారు నట్టేట మునుగుతారని భావించి ముందస్తుగా అలెర్ట్ అయింది నగునూరు పంచాయితీ పాలకవర్గం. వెంచర్ భూమిని లెవలింగ్ చేస్తున్న క్రమంలో ఎస్సారెస్పీ ఫీల్డ్ చానెల్స్ ధ్వంసం కావడంతో దిగువన ఉన్న రైతులు గగ్గోలు పెట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పంచాయితీ సర్పంచ్ ఆయా శాఖల అధికారులకు, సుడాకు లేఖ రాయడంతో అప్పుడు కదలిక మొదలైంది. ఈ ఫిర్యాదుల పరంపరం కొనసాగిన తరువాత రాజకీయ నాయకుల ఎంట్రీ ఇచ్చి అక్షర టౌన్ షిప్ గురించి పల్లెత్తు మాట అనకుండా కడుపులో పెట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ తమకు ఓట్లు వేసిన ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నామన్న విషయాన్ని విస్మరించారు. నిభందనలకు విరుద్దంగా తాము వ్యవహరిస్తున్నామన్న అంశాన్ని కూడా పక్కనపెట్టిన అప్పటి అధికార పార్టీ నాయకులు వ్యాపారులకు అండగా నిలిచారన్న విమర్శలు ఎదుర్కొన్నారు.

చేష్టలుడిగిన అధికార యంత్రాంగం…

అక్షర టౌన్ షిప్ వ్యవహారంలో ఆయా శాఖలు వ్యవహరించిన తీరు కూడా విచిత్రంగా ఉందనే చెప్పాలి. 40 ఫీట్ల రోడ్డుతో అనుసంధానం లేకున్నా ఈ వెంచర్ కు అనుమతులు ఎలా ఇచ్చారన్నదే మిస్టరీగా మారింది. అంతేకాకుండా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కెనాల్ రహదారిని ఈ వెంచర్ మెయిన్ రోడ్డుగా చూపించడమూ సరికాదన్న విషయాన్ని కూడా పట్టించుకోలేదు. ఇరిగేషన్ అధికారులు కూడా కరీంనగర్ రూరల్ పోలీసులకు ఓ ఫిర్యాదు ఇచ్చి, సుడాకు ఓ లేఖ రాసి చేతులు దులుపుకున్నారు. ఫీల్డ్ చానెల్స్ ను బాగు చేశారు కానీ టౌన్ షిప్ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సీరియస్ గా ఎందుకు పనిచేయలేదన్న ప్రశ్న తలెత్తుతోంది. అంతేకాకుండా సుడా కూడా రెండు సార్లు నోటీసులు ఇఛ్చింది కానీ లే ఔట్ పర్మిషన్ ను మాత్రం రద్దు చేయలేదంటేనే అధికార యంత్రాంగం పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా నగునూరు దుర్గాదేవి ఆలయం కోసం వేసిన రహదారి మీదుగా వెల్లి ఎస్సారెస్పీ కెనాల్ రోడ్డును వినియోగించుకుంటూ వెంచర్ కు చేరాలి. అయితే దుర్గాదేవి ఆలయం కోసం ప్రత్యేకంగా వేసిన రోడ్డును కమర్షియల్ అవసరాలకు ఎలా వినియోగిస్తారన్నది కూడా పజిల్ గానే మారింది.

You cannot copy content of this page