నదిలో తవ్వకున్నా ఇసుక ఎలా పుట్టుకొస్తోంది..?

దిశ దశ, కరీంనగర్:

తాము అనుకున్నది సాధించాలంటే లోసుగులు వెతుక్కుని ముందుకు సాగడం సహజం. అయితే విచారణ జరిపితే పక్కా దొరికే విషయాలను కూడా విస్మరించడమే విచిత్రంగా మారింది. ఇసుక విషయంలో అటు కాంట్రాక్టర్లు ఇటు మైనింగ్ అధికారులు తెరపైకి తీసుకొచ్చిన వాదన మాత్రం అత్యంత విచిత్రంగా ఉంది. ఇసుక తవ్వకాలు జరపొద్దని ఎన్జీటీ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది కానీ రవాణా చేసుకోవద్దని కాదుకదా అన్నదే వారంటున్న పాయింట్. అయితే రవాణా విషయంలో ఎన్జీటీ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదు కాబట్టి స్టాక్ ఉన్న ఇసుకను విక్రయిస్తున్నమన్నదే వారి లాజిక్. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉందన్న విషయాన్ని వారు విస్మరించారు.

ఏడు నెలల క్రితం…

నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ తో పాటు, సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు తాము కరీంనగర్ జిల్లాలోని 8 ఇసుక రీచుల్లో తవ్వకాలు నిలిపివేస్తున్నామని మైనింగ్ అధికారులు ఫిర్యాదు దారులకు లిఖిత పూర్వకంగా సమాచారం ఇచ్చారు. గత సంవత్సరం జూన్ 24న గనులు, భూగర్భ శాఖ ఇంఛార్జి అసిస్టెంట్ డైరక్టర్ సత్యనారాయణ లేఖ నంబర్ 4404 ద్వారా సమాచారం ఇచ్చారు. వీణవంక మండలం మల్లారెడ్డిపల్లికి చెందిన సంధి సురేందర్ రెడ్డికి ఈ సమాచారం ఇచ్చిన తరువాత నుండి ఇటీవల వరకు కూడా ఇసుక రవాణా చేస్తూనే ఉన్నారు. స్టాక్ యార్డుల్లో ఉన్న ఇసుకను రవాణా చేయవద్దన్న ఆదేశాలు లేనందున తాము అక్కడ నిలువ ఉన్న దానిని మాత్రమే విక్రయిస్తున్నామన్న కారణం చూపిస్తూ ఇంతకాలం గడిపారు. కానీ అసలు విషయాన్ని మాత్రం అధికారులు పట్టించుకోకపోవడం విచిత్రంగా ఉంది. సాధారణంగా ఓ ఇసుక రీచు వద్ద స్టాక్ యార్డు కోసం 10 లేదా 20 ఎకరాల వరకు భూమిని లీజుకు తీసుకుంటారు కాంట్రాక్టర్లు. ఈ భూములకు సంబంధించిన లీజు అగ్రిమెంట్లను కూడా టీఎస్ఎండీసీ కార్యాలయంలో దాఖలు చేస్తారు. అయితే ఒక ఎకరంలో ఎంతమేర ఇసుకను నిల్వ ఉంచవచ్చన్న అంచనాలకు సంబంధించిన గణాంకాలు మైనింగ్ అధికారుల వద్ద ఖచ్చితంగా ఉంటాయి. ఈ లెక్కన జిల్లాలోని 8 రీచులకు సంబంధించిన స్టాకు యార్డుల్లో ఎంతమేర ఇసుక నిలువ ఉందో అంత వరకే వేబిల్లులు జారీ చేయాల్సి ఉంటుంది కదా. కానీ గత సంవత్సరం జూన్ నుండి ఇప్పటి వరకు నిరవధికంగా ఇక్కడి నుండి ఇసుక తరలించేందుకు ఎలా అనుమతులు ఇస్తున్నారన్నదే పజిల్ గా మారింది. రవాణా చేయవద్దని ఎన్జీటీ మధ్యంతర ఉత్తర్వుల్లో లేవన్న కారణం చూపిస్తున్న అధికారులు ఆయా రీచుల్లో 7 నెలలకు సరిపడా స్టాక్ నిలువ ఉంచారన్నదే మిస్టరీగా మారింది. ఆయా రీచుల నుండి ఎన్ని క్యూబిక్ మీటర్ల ఇసుక తరలించాలని నిర్దేశించారో అందుకు తగ్గట్టుగా నదిలో కొంత విస్తీర్ణాన్ని గుర్తించి హద్దులు ఏర్పాటు చేసి ఇసుక తవ్వకాలు జరిపి స్టాక్ యార్డుకు తరలించాలని మైనింగ్ అధికారులు సూచిస్తారు. అంతేకాకుండా 2 మీటర్ల లోతు మించి కూడా ఇసుక తవ్వకాలు జరపకూడదన్న నిభందనలు కూడా ఉన్నాయి. అయితే గత సంవత్సరం జూన్ నుండి ఇప్పటి వరకు ఆయా రీచుల నుండి ఇసుక తరలిస్తున్నట్టుగా స్పష్టం అవుతోంది. అంటే స్టాక్ యార్డుల్లోకి అంత పెద్ద పరిమాణంలో ఇసుక ఎలా వచ్చి చేరిందన్నది పజిల్ గా మారింది. టీఎస్ఎండీసీ అధికారులు ఇచ్చిన హద్దులను దాటి కానీ, 2 మీటర్లను మించి కాని తవ్వకాలు జరపకుండా  లక్షలాది క్యూబిక్ మీటర్ల ఇసుక స్టాక్ యార్డుల్లోకి వచ్చి చేరడం వెనక మిరాకిల్ జరిగిందా అన్న చర్చ కూడా సాగుతోంది.

స్టాక్ వివరాలేవి..? 

ఇక్కడ టీఎస్ఎండీసీ అధికారుల నిర్లక్ష్యం స్ఫష్టంగా కనిపిస్తోంది. ఎన్జీటీ మధ్యంతర ఉత్తర్వుల తరువాత రీచుల వారిగా స్టాక్ యార్డుల్లో ఎంతమేర స్టాక్ ఉంది అన్న విషయంపై క్షేత్ర స్థాయిలో పర్యటించి రికార్డులు టీఎస్ఎండీసీ కార్యాలయానికి పంపంచారా లేదా అన్న విషయం కూడా తేలాలి. ఒక వేళ స్టాక్ట్ వివరాలను పంపించినట్టయితే అంతకు మించి పరిణామంలో ఇసుక తరలించేందుకు వే బిల్లులు జారీ అయితే అధికారులే రెడ్ హైండెడ్ గా తప్పిదాలు చేసినట్టుగా స్పష్టం అవుతుంది. స్టాక్ వివరాలు పంపించనట్టయితే ఎన్జీటీ ఉత్తర్వుల తరువా స్టాక్ వివరాలు మెయింటెన్ చేయకపోవడం కూడా అధికారులు చేసిన తప్పేనన్నది వాస్తవం. ఎందుకంటే ఒక్కో రీచులో ఎంతమేర ఇసుక ఉందో ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసే విధానాన్ని కూడా టీఎస్ఎండీసీ అమలు చేస్తోంది. ఈ లెక్కన ఎన్జీటీ ఉత్తర్వులు సంబంధిత అధికారులకు అందినప్పుడు ఉన్న స్టాక్ ఎంత..? ఆ తరువాత విక్రయించింది ఎంత అన్న వివరాలు వెలుగులోకి వస్తే ఎన్జీటీ ఆధేశాలు ధిక్కరించినట్టు అవుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

కలెక్టర్ ఆదేశాలతో వెలుగులోకి… 

తాజాగా కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి కరీంనగర్ జిల్లాలోని ఇసుక తవ్వకాలు, రవాణాను తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నిలిపివేయాలంటూ రెండు రోజుల క్రితం ప్రొసిడింగ్స్ ద్వారా ఆదేశించారు. దీంతో జిల్లాలోని 8 రీచుల్లో ఇసుక రీచులను మూసివేసే ప్రక్రియ మొదలైంది.

కలెక్టర్ ను తప్పుదారి పట్టించారు: పిటిషనర్

మరో వైపున జిల్లాకు చెందిన మైనింగ్ అధికారులు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని తప్పుదారి పట్టించారని పిటిషనర్ సంధి సురేందర్ రెడ్డి అంటున్నారు. ఈ మేరకు సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయంలో ఫిర్యాదు కూడా చేశారు. సుప్రీంకోర్టు, ఎన్జీటీ ఉత్తర్వుల గురించి ఎన్నికల సమయంలో జిల్లాకు వచ్చిన కలెక్టర్ కు చెప్పకుండా అధికారులు గతంలో ఉన్న కాంట్రాక్టును పొడగించడమేనంటూ బుకాయించారని ఆయన ఆరోపిస్తున్నారు. దీంతో కలెక్టర్ జిల్లా అధికారుల మాటలు నమ్మి ఎన్నికల సమయంలో జిల్లాలోని ఆయా రీచుల నుండి ఇసుక తరలించేందుకు అనుమతిని పొడగించారన్నారు. ఇంతకాలం అసలు రవాణా చేయకూడదన్న ఆదేశాలు ఎన్జీటీ ఇవ్వలేదంటూ ఇష్టారీతిన వ్యాపారం చేశారని సురేందర్ రెడ్డి ఆరోపించారు. అయితే స్టాక్ యార్డుల్లో ఎన్జీటీ ఆదేశాలు వచ్చినప్పటి వరకు ఎంతమేర ఇసుక ఉందో అంతవరకే వేబిల్లులు జారీ చేయాల్సి ఉంటుంది కానీ 7 నెలల కాలంగా ఇసుక ఎక్కడి నుండి వచ్చిందో తేల్చాల్సిన అవసరం ఉందని కలెక్టర్ కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒకవేళ స్టాక్ యార్డుల్లో నిలువ ఉన్న ఇసుకనే రవాణా చేశారంటే ఒక్కో స్టాక్ యార్డుకు సంబంధించిన డాటాను బేరీజు వేసుకోవాలని కోరారు. పెద్ద ఎత్తున ఇసుకను స్టాక్ యార్డులకు రీచుల కాంట్రాక్టర్లు తరలించుకున్నట్టయితే నిభందనలకు విరుద్దంగా నదిలో తవ్వకాలు జరిపినట్టేనని సురేందర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్లకు ఇచ్చిన పరిమితి దాటి తవ్వకాలు జరపడం, డెప్త్ విషయంలో కూడా ఎక్కువగా తవ్వినట్టేనని ఇందుకు బాధ్యులైన కాంట్రాక్టర్లపై పర్యావరణ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయడంతో పాటు ఇందుకు వత్తాసు పలికిన ఆయా శాఖల అధికారులపై  కూడా చర్యలు తీసుకోవాలని సురేందర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. మైనింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు అంతా నిభందనల ప్రకరమే నడుచుకున్నట్టయితే అంత పెద్ద మొత్తంలో ఇసుక స్టాకు యార్డుల్లోకి ఎక్కడి నుండి తెచ్చారోనన్న విషయాలపై కూడా ఆరా తీయాల్సి ఉందన్నారు.

You cannot copy content of this page