దిశ దశ, కరీంనగర్:
జివి సదాశివ రావుకు చెందిన సీలింగ్ భూముల వ్యవహారంలో రెవెన్యూ అధికారులు వ్యవహరించిన తీరు విస్మయానికి గురి చేస్తోంది. ఓ సారి ఆ భూములు ఇతరుల ఆధీనంలో ఉన్నాయని, మరో సారి తమ ఆధీనంలోనే ఉన్నాయని చెప్తున్న తీరు విచిత్రంగా ఉంది. కరీంనగర్ సమీపంలోని బొమ్మకల్, నగునూరు శివార్లలోని భూముల విషయంలో రెవెన్యూ అధికారులు కావాలనే తప్పటడుగులు వేశారా..? తాము ఏం చేసినా పట్టించుకునే వారు లేరన్న ధీమా ప్రదర్శించారో తెలియడం లేదు. కానీ అధికార యంత్రాంగం మాత్రం రెడ్ హైండెడ్ గా దొరికిపోయిందన్నది మాత్రం వాస్తవం.
పరిహారం కోసం…
జివి సదాశివ రావుకు సంబంధించిన భూములపై సీలింగ్ ట్రిబ్యూనల్ లో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో 38 ఎకరాల భూమిని పట్టాదారులకు ఇవ్వాలని ట్రిబ్యూనల్ ఆధేశించింది. తమకు అప్పగించిన ఈ భూములకు సంబంధించిన కౌలు డబ్బులు ఇప్పించాలని కోరుతూ పట్టాదారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పట్టదారుల పిటిషన్ ను విచారించిన కోర్టు వారికి డబ్బులు చెల్లించాలని తీర్పు చెప్పింది. 2014 వరకు కౌలు డబ్బులు చెల్లించాలని 2016లో కోర్టు జారీ చేసిన ఆధేశాలను కరీంనగర్ జిల్లా అధికారులు పట్టించుకోకపోవడంతో… పట్టాదారులు తమకు న్యాయం చేయాలని మళ్లీ కోర్టును ఆశ్రయించారు. దీంతో జిల్లా కలెక్టర్ కారును జప్తు చేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి కరీంనగర్ జిల్లా అధికారులు వెంటనే స్పందించి కౌలు తాలుకు రూ. 11 లక్షల 26 వేల 400లు కోర్టులో డిపాజిట్ చేశారు.
సర్కారు ఆధీనంలోనే…
2006లో జగిత్యాల ట్రిబ్యూనల్ ఆదేశాల మేరకు పంచనామ చేసినప్పుడు రెవెన్యూ అధికారులు ఆ భూముల్లో ఇతరుల ఆక్రమణలో ఉన్నారని ధృవీకరించారు. 2017లో కోర్టు ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా అధికారులు అవే భూములకు కౌలు డబ్బులు చెల్లించడం గమనార్హం. ఈ లెక్కన బొమ్మకల్, నగనూరు శివార్లలోని జివి సదాశివరావుకు సంబంధించిన సీలింగ్ భూములు అన్ని కూడా రెవెన్యూ కస్టడీలోనే ఉన్నాయని ఒప్పుకున్నట్టయింది. ఇందుకు పరిహారం కూడా రెవెన్యూ అధికారులు చెల్లించడంతో ఆ భూములు తమ ఆధీనంలోనే ఉన్నాయని స్పష్టం చేసినట్టయింది.
ఇదే నిజమైతే…
రెవెన్యూ అధికారులు కరీంనగర్ కోర్టులో సీలింగ్ భూములకు సంబంధించిన కౌలు డబ్బులు జమ చేయడంతో ఆ భూములు వారి ఆదీనంలో ఉన్నాయని ఒప్పుకున్నప్పటికీ… ఈ భూముల లావాదేవీలు ఎలా జరిగాయన్నదే మిస్టరీగా మారింది. నగునూరుకు సంబంధించిన భూములను ప్లాట్లుగా చేసి విక్రయించారన్న విషయం ఓపెన్ సీక్రెట్. ఈ వెంచర్ కు ప్రత్యేకంగా స్వాగత తోరణం కూడా నిర్మించి అమ్మకాలు చేశారు. ఆ తరువాత ఇదే భూముల్లో నయ్యీం అనుచరులు తల దూర్చారన్న కారణంతో పోలీస్ స్టేషన్ లో కేసులు కూడా నమోదు అయ్యాయి. మరో వైపున బొమ్మకల్ భూముల్లో అరియంత్ ఎడ్యూకేషన్ సొసైటీకి సంబంధించిన నిర్మాణాలు ఉన్నాయని, కొంత భూమిని ఇతరులు సాగు చేసుకుంటున్నారని గతంలోనే రెవెన్యూ అధికారులు తేల్చారు. వీటన్నింటిని విస్మరించిన రెవెన్యూ యంత్రాంగం క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయకుండానే కోర్టు ఆదేశాల నుండి తప్పించుకునేందుకు హడావుడి నిర్ణయాలు తీసుకున్నట్టుగా స్పష్టం అవుతోంది. పట్టాదారులకు డబ్బులు చెల్లించేప్పుడు వెనకా ముందు ఆలోచించకుండా కోర్టు ఉత్తర్వుల మేరకు నడుచుకుంటే చాలనుకున్న రెవెన్యూ అధికారులు చకాచకా డబ్బులు కోర్టులో డిపాజిట్ చేసేశారు. వాస్తవంగా కోర్టు ఆదేశాల తరువాత సదాశివరావుకు సంబంధించిన సీలింగ్ భూముల విషయంలో క్షేత్ర స్థాయి పరిశీలన చేసినట్టయితే మళ్లీ వాస్తవాలు వెలుగులోకి వచ్చేవి. కానీ అలాంటి చొరవ తీసుకోకుండా అధికార యంత్రాంగం కోర్టులో డబ్బులు చెల్లించేందుకు ముందుకు రావడం విడ్డూరం.
కౌలు ఎలా..?
ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములను నేరుగా లీజుకు ఇచ్చే సాంప్రాదాయం అయితే ప్రభుత్వ విభాగాల్లో ఉండదు. వీటిని ఓపెన్ టెండర్ ద్వారా లీజుకు ఇవ్వాల్సి ఉంటుందన్నది వాస్తవం. సీలింగ్ పరిధిలో ఉన్న ఈ భూముల విషయంలో అధికారులు 2017లో డబ్బులు చెల్లించారు కానీ కౌలుదారులు ఎవరూ..? వారికి ఎలా లీజుకు ఇచ్చారు..? ఇందుకు సంబంధించి ప్రాసెస్ ప్రకారం నడుచుకున్నారా లేదా అన్నది తేల్చాల్సిన బాద్యత రెవెన్యూ అధికారులపై ఉంది. ఒకవేళ నిజంగానే రెవెన్యూ విభాగం ఆధీనంలో ఈ భూములకు ఉన్నట్టయితే ఇందుకు సంబంధించిన లీజు ప్రక్రియ ఏటేటా జరపాల్సి ఉంటుంది. లీజు ద్వారా వచ్చిన ఆదాయాన్ని రెవెన్యూ పద్దుల్లో ఎప్పటికప్పుడు జమ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ పట్టదారులు కోర్టును ఆశ్రయించిన తరువాత… కలెక్టర్ కార్ జప్త్ చేయాలని ఆదేశాలు ఇచ్చిన తరువాత ఆ డబ్బులు డిపాజిట్ చేశారు. ఈ లెక్కన అధికారులు అప్పటికప్పుడు ఇరకాటం నుండి తప్పించుకునే విధంగా వ్యవహరించినట్టుగా స్పష్టం అవుతోంది. సదరు భూములను లీజుకు ఇచ్చేందుకు ఏనాడూ చొరవ చూపనట్టుగా అర్థమవుతోంది. ఒకవేళ లీజుకు ఇచ్చినట్టయితే రెవెన్యూ అధికారులు ఇప్పటి వరకు జరిపిన టెండర్ ప్రక్రియ, ఇందులో పాల్గొన్న రైతుల వివరాలు, ఇందుకు లీజు దారులు చెల్లించిన చెల్లింపులు, భూముల్లో పంటలు సాగు చేసినట్టుగా ఉన్న ఆధారాలు, లీజు దారుల వివరాలు అన్ని కూడా రెవెన్యూ అధికారులు రికార్డుల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. అలాగే లీజు దారులు చెల్లించే డబ్బు కూడా నేరుగా ఇవ్వడానికి నిబంధనలు సహకరిచంవన్నది వాస్తవం. రెవెన్యూ విభాగానికి చెందిన బ్యాంకు అకౌంట్లలో జమ చేసి ఇందుకు సంబంధించిన రశీదులను, లీజు దారులు దరఖాస్తుకు అటాచ్ చేసి రెెవెన్యూ కార్యాలయంలో అప్పగించాల్సి ఉంటుంది. 2017లో కోర్టు ఆదేశాల మేరకు రూ. 11 లక్షల పై చిలుకు డిపాజిట్ చేసిన నేపథ్యంలో లీజుకు సంబంధించిన లావాదేవీలు జరిగాయా లేదా అన్నది అధికారులు తేల్చాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా కోర్టులో డిపాజిట్ చేసిన ఈ డబ్బు ఏ పద్దు నుండి డ్రా చేశారన్న విషయంపై కూడా ఆరా తీయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అసలు లీజుకే ఇవ్వని భూముల ద్వారా ఆదాయం ఎలా వచ్చిందన్నదే అంతుచిక్కుకుండా పోతోంది. ఆదాయం రాకున్నప్పటికీ కోర్టులో డబ్బులు డిపాజిట్ చేసిన అధికార యంత్రాంగం ఇతరాత్ర నిధులను వినియోగించినట్టయితే మాత్రం ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసినట్టేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
మొక్కుబడి చర్యలా..?
రెవెన్యూ అధికారులు ఎవరి ప్రాపకం కోసం తప్పటడుడుగులు వేశారో… లేక తెలియక తప్పుల మీదు తప్పులు చేశారో అంతుచిక్కడం లేదు కానీ… ఒక్క సదాశివరావుకు చెందిన సీలింగ్ భూముల వ్యవహరంలోనే ఇన్ని రకాల పొరపాట్లు వెలుగులోకి వస్తున్నాయంటే మిగతా అంశాల్లో ఎలాంటి పరిస్థితి ఉందోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అధికార యంత్రాంగం మొక్కుబడిగా వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి తయారైందన్న అభిప్రాయాలను రెవెన్యూ విభాగం వారే వ్యక్తం చేస్తున్నారు.
కఠినంగా వ్యవహరించాలి: బండారి శేఖర్
కరీంనగర్ సీలింగ్ భూములు వ్యవహారంలో రెవెన్యూ అధికారులు వ్యవహరించిన తీరు నిబంధనలకు విరుద్దంగా ఉందని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ వ్యాఖ్యానించారు. భూములు తమ ఆధీనంలో లేవని ఓ సారి సర్టిఫై చేశారని, మరో సారి తమ ఆధీనంలోనే ఉన్నాయని ఇందుకు లీజు కూడా వస్తుందని డబ్బులు కోర్టులో డిపాజిట్ చేశారన్నారు. ద్వంద విధానాలు ఎలా అవలంభించారో ఆ విబాగం అధికారులకే తెలియాలన్నారు. నిజంగానే సదాశివరావు భూములు లీజుకు ఇచ్చినట్టయితే అందుకు సంబంధించిన ప్రాసెస్ అంతా కోర్టు ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. లీజు ఇచ్చేందుకు నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేశారు..? ఈ వేలంలో ఎంత మంది పాల్గొన్నారు, లీజుదారులు చెల్లించిన డబ్బు ఏ పద్దుల కింద జమ చేశారు..? ఆసక్తి ఉన్నవారు ముందుగా డిపాజిట్ చేసిన వివరాలను కూడా చూపించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే సీలింగ్ భూములను క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు కూడా ప్రత్యేకంగా ఓ కమిటీ వేయాలని వీడియో రికార్డింగ్ ద్వారా సేత్వార్ ఆధారంగా వాటిని పరిశీలించాల్సిన అవసరం ఉందని బండారి శేఖర్ అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారానికి బాధ్యులైన అధికార యంత్రాంగంపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉందని కూడా అన్నారు. ఏటా ఈ భూములు లీజుకు ఇచ్చినట్టయితే ఆ డబ్బులు ప్రభుత్వ అకౌంట్లో ఎందుకు జమ కాలేదో కూడా తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు.