పట్టాలు ఇవ్వకున్నా పాగా ఎలా వేశారు..?

నర్సింగాపూర్ భూములపై చర్చ

దిశ దశ, జగిత్యాల:

రాజకీయ నాయకుల, జిల్లా స్థాయి అధికారుల కుటుంబాలకు చెందిన వారి పేరిట ప్రభుత్వ భూమి హక్కులు ఎలా కల్పించారన్నదే పజిల్ గా మారింది. రూ. కోట్లు విలువ చేసే ఈ భూమి సర్కారుదే అయినప్పటికీ పట్ట దారులకు చెందినదని కూడా మార్చడం వెనక అసలేం జరిగిందన్నదే అంతు చిక్కకుండా పోతోంది. జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ లోని ప్రభుత్వ భూమి ఆక్రమించుకున్న విషయంపై ఎమ్మెల్సీ టీ జీవన్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో డొంక కదులుతున్న ఈ భూముల వ్యవహారం బట్టబయలు కావడం స్థానికంగా సంచలనంగా మారింది. ఈ విషయంపై రెవెన్యూ అధికారులు విచారణ జరిపి రికార్డులు కూడా తారు మారు చేశారని తేల్చారు. అయితే 80 ఎకరాల వరకు భూమికి యాజమాన్య హక్కులు కల్పించేందుకు సాహించిన వారు ఎవరూ..? ఇందుకు వారిని ఉసిగొలపింది ఎవరూ అన్నదే అంతు చిక్కకుండా పోతోంది. ల్యాండ్ బ్యాంకు లేక ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎక్కడికక్కడ బ్రేకులు పడుతుంటే ప్రైవేటు వ్యక్తులు దర్జాగా ఆక్రమించుకున్న తీరు రెవెన్యూ అధికారులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రికార్డుల్లో పేర్లు రాయించుకున్న వారిలో వివిధ పార్టీలకు చెందిన నాయకులే కాకుండా ఓ ఉన్నతాధికారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్టుగా రెవెన్యూ వర్గాల ద్వారా తెలుస్తోంది. సునిశితంగా ఈ అంశాన్ని పరిశీలించినట్టయితే దీని వెనక ఏదో మతలబు జరిగే ఉంటుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కమర్షియల్ అవసరాలకూ…

అయితే అసలు ప్రభుత్వ భూమికి అసైన్ చేయకుండానే రికార్డుల్లో పేర్లు రాయించుకుని ధరణీ పోర్టలో లో పట్టా భూములుగా అప్ డేట్ చేయించుకున్న వారిలో చాలా మంది కూడా వ్యవసాయ అవసరాలకు మాత్రం ఈ భూమిని వినియోగించడం లేదని తెలుస్తోంది. ఇటుక బట్టీలను ఏర్పాటు చేసి కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తున్నట్టుగా కూడా రెవెన్యూ అధికారులు గుర్తించారు. సాధారణంగా నిరుపేదలకు రెవెన్యూ భూమిని నివేశన స్థలాలకు, వ్యవసాయ అవసరాలకు మాత్రమే కెటాయించాల్సి ఉంటుంది కానీ నర్సింగాపూర్ భూమి మాత్రం కమర్షియల్ అవసరాలకు ఉపయోగపడుతుండడం విచిత్రంగా ఉంది. ధరణీ రికార్డుల్లో పట్టా భూమి అని మార్చారన్న ధీమాతో ఉన్నారా లేక తమను అడ్డుకునే వారు ఎవరూ లేరన్న దీమానా అన్న చర్చ సాగుతోంది. 437 సర్వే నంబర్ లో 378 ఎకరాల మేర భూమి ఉండగా 77 ఎకరాల వరకు గతంలో లావూణీ పట్టాలు ఇవ్వాగా ఆ భూములు కూడా పట్టా అని ధరణీ పోర్టల్ లో అప్ లోడ్ చేసినట్టుగా రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఈ లెక్కన ఈ సర్వే నెంబర్ లో ఉన్న మొత్తం భూమి రికార్డులు మార్చేసే ప్రయత్నాలు ఏమైనా జరిగాయా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

ఎప్పుడు మార్చారో..?

2014-15 సమయంలో నర్సింగాపూర్ లోని ప్రభుత్వ భూమి రికార్డులు తారు మారు చేసినట్టుగా రెవెన్యూ అధికారులు అనుమానిస్తున్నారు. అయితే జగిత్యాల జిల్లా కేంద్రంగా ప్రకటించే అవకాశాలు ఉన్న విషయాన్ని గమనించిన కొందరు ధరణీ పోర్టల్ ఏర్పాటు చేసే ముందు రికార్డులను మార్చేసి ఉంటారన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. జిల్లా కేంద్రం అయితే భవిష్యత్తులో ఈ భూమి ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుందన్న అంచనాతోనే రికార్డుల్లోకి తమ పేర్లను నమోదు చేయించుకుని ఉంటారని కూడా భావిస్తున్నారు.

ఇంటి దొంగలెవరో…?

ప్రభుత్వ భూమిని అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే విషయంలో రెవెన్యూ యంత్రాంగం కూడా తమ వంతు సహకారం అందించి ఉంటుందన్న చర్చ కూడా స్థానికంగా సాగుతోంది. వారి సపోర్ట్ లేనట్టయితే రెవెన్యూ అధికార యంత్రాంగం వద్ద భద్రంగా ఉండే రికార్డులు తారు మారు అయ్యే అవకాశమే లేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా రెవెన్యూ ఉన్నతాధికారులు సమగ్రంగా ఆరా తీసి కోట్ల విలువ చేసే భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడంతోనే సరిపెట్టకుండా అక్రమాలకు పాల్పడిన ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. కఠిన చర్యలు తీసుకున్నట్టయితే భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కావని, ప్రభుత్వ ఆస్తులు కూడా భద్రంగా ఉంటాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.

You cannot copy content of this page