సమాచారం కోసం ఎదురు చూపు
విడుదల కాని హెల్త్ బులిటెన్…
దిశ దశ, హైదరాబాద్:
ఉద్యమ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్యానికి గురైన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ప్రగతి భవన్ లోనే ప్రముఖ వైద్యులు ఆయనకు వైద్యం అందిస్తున్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అన్న విషయంపై క్లారిటీ ఇచ్చే పరిస్థితి కనిపించకపోవడం ఆయన అభిమానులను కలవరపెడుతోంది. ఛాతి వద్ద ఇన్ ఫెక్షన్ అయిందని నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో మంత్రి కేటీఆర్ అధికారికంగా ప్రకటించారు. అయితే ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితిపై సమగ్రంగా తెలుసుకునే పరిస్థితి లేకుండా పోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు, కేసీఆర్ అభిమానులు ఆయన ఆరోగ్యం ఎలా ఉంది అని వాకబు చేస్తున్నారు. అయినప్పటికీ అధికారికంగా హెల్త్ బులిటెన్ విడుదల చేయకపోవడంతో సీఎం ఆరోగ్యం గురించి పూర్తి క్లారిటీ లేకుండా పోతోంది. ఆర్గాన్స్ సమస్య తీవ్రం అయ్యాయంటూ కొందరు చర్చించుకుంటుండగా, సీఎం కేసీఆర్ ధృడంగా ఉన్నారని ఆయన రెండు మూడు రోజుల్లోనే బాహ్య ప్రపంచంలోకి వస్తారంటూ మరికొందరు చర్చించుకుంటున్నారు. ఎన్నికల వేళ కేసీఆర్ రాష్ట్రమంతా టూర్లు చేయాల్సిన నేపథ్యంలో అనారోగ్యం బారిన పడడం పార్టీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తోంది. ఉద్యమ నేత చేసే ప్రసంగం ప్రభావం అత్యంత తీవ్రంగా తెలంగాణ ప్రజలపై ఉంటుందని ఆయన ఓ సారి రాష్ట్రాన్ని చుట్టి వస్తే ఫలితాలన్ని కూడా తారుమారు అవుతాయన్న బలమైన నమ్మకం పార్టీ నాయకుల్లో నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్యం బారిన పడడం… ఆయన ఆరోగ్య గురించి తెలియకపోవడంతో పార్టీ శ్రేణులు, అభిమానులు అయోమయానికి గురవుతున్నారు. అయితే హెల్త్ బులిటెన్ అయినా రెండు గంటలకోసారి విడుదల చేసినట్టయితే రాష్ట్ర ప్రజలకు ఉద్యమనేత ఆరోగ్య పరిస్థితిపై ఫుల్ క్లారిటీ వస్తుందని అంటున్నారు పలువురు. ప్రముఖులు అనారోగ్యానికి గురయినప్పడు హెల్త్ బులిటెన్లు విడుదల చేసే ఆనవాయితి కొనసాగిస్తారని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం గురించి కూడా ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తే బావుండేందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.