రెండో సారీ కబ్జాకు కారణమేంటీ..? అధికారుల నిర్లక్ష్యం లేదా..?

సమన్వయం లేకే ఈ దుస్థితా..?

దిశ దశ, మహదేవపూర్:

మండల కేంద్రమైన మహదేవపూర్ బట్టి కొట్టు భూముల వ్యవహారంలో ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వ నిధులు వెచ్చించి కొనుగోలు చేసిన భూములు ఆక్రమణ కాకుండా చర్యలు తీసుకోవడంలో విఫలం అయినట్టు స్పష్టం అవుతోంది. నిరుపేదలకు నివేశన స్థలాలు ఇచ్చిన అధికారులు పట్టాలు పొందిన వారు సదరు భూమిలో ఇండ్లు నిర్మించుకోలేదని వాటిని రద్దు చేసినప్పుడు నిబంధనల మేరకు నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. అదే ప్రభుత్వం పరిహారం చెల్లించి మరీ కొనుగోలు చేసిన భూమిని ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకుంటుంటే నిబంధనలు అమలు చేయడంలో ఎందుకు విఫలం అయ్యారన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది.

నివేదికలు ఇలా…

బట్టి కొట్టులోని 463 సర్వే నెంబర్ భూమిలో 7.37 ఎకరాల భూమిని ప్రభుత్వం గృహ అవసరాలకు కొనుగోలు చేసింది వాస్తవేమనని అప్పటి మహధేవపూర్ తహసీల్దార్ లేఖ నంబర్ 111/2016 తేది: 2016 మార్చి 9న రెవెన్యూ డివిజనల్ అధికారికి నివేదిక ఇచ్చారు. ఇందులో ప్రభుత్వం కొనుగోలు చేసిన భూమిలో ఇద్దరు ఆక్రమణ దారులు ఉండగా వారిని ఖాలీ చేయించామని కూడా పేర్కొన్నారు. తిరిగి ఇదే సర్వే నంబరులోని భూమిని ఇతరులు ఆక్రమించుకున్నారని ఏడాది క్రితం మరో తహసీల్దార్ రిపోర్ట్ ఇచ్చారు. 7.37 ఎకరాల భూమిని నిరుపేదల కోసం సేకరించామని అందులో 1.06 ఎకరాల భూమిని కెజీబీవీ పాఠశాలకు, 2.21 ఎకరాలు వ్యవసాయ గోదాం, రైతు వేదిక, 0.20 గుంటల ఎస్సీ కార్పోరేషన్ భవనాలు చాలా క్రితం నుండే ఉన్నాయని, 2 ఎకరాల విస్తీర్ణంలో బలహీన వర్గాల నివేశన స్థలాలకు కెటాయించారని, 1.30 ఎకరాల భూమి ఆక్రమణలో ఉందని వెల్లడించారు. 2016లోనే ఈ భూమి ఆక్రమణకు గురైందని అప్పటి తహసీల్దార్ నివేదిక ఇచ్చిన తరువాత కూడా ప్రభుత్వ భూమిని కాపాడేందుకు అధికారులు చొరవ చూపలేదని స్పష్టం అవుతోంది. ఏడాది క్రితం మరో తహసీల్దార్ ఇచ్చిన నివేదికలో 1.30 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారని వెల్లడించారంటే ఇట్టి భూమిని సంరక్షించే వారే లేకుండా పోయారన్న విషయం వెల్లడి అవుతోంది.

ఆ శాఖలు ఏం చేశాయి..?

మరో వైపున నిరుపేదల కోసం కెటాయించాలని మూడో విడుత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం కొనుగోలు చేసిన ఈ భూమి విషయంలోనే నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరు స్పష్టం అవుతున్న నేపథ్యంలో ఈ భూమిని కొనుగోలు చేసిన సంబంధిత శాఖలకు రెవెన్యూ అధికారులు సమాచారం ఇచ్చేందుకు చొరవ చూపకపోవడానికి కారణమేంటన్నదే అంతు చిక్కడం లేదు. అతేకాకుండా తమ శాఖ నిధులతో కొనుగోలు చేసిన భూమిని సంబంధిత శాఖలు కూడా స్వాధీనం చేసుకోకపోవడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వ అవసరాల కోసం కొనుగోలు చేసిన భూమిని సంరక్షించుకునే బాధ్యత ఆయా శాఖల యంత్రాంగానికి ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజావసరాల కోసం సేకరించిన భూమిని ఆక్రమించుకున్నారన్న విషయాన్ని ఇద్దరు తహసీల్దార్లు దృవీకరించిన తరువాత కూడా వారిపై దురాక్రమణ సెక్షన్లలో క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టయితే మరోకరు అటువైపు కన్నెత్తి చూసేందుకు కూడా సాహసించే వారు కాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరో ట్విస్ట్ ఏంటంటే 2007లో అధికారికంగా 7.37 ఎకరాల భూమి కొనుగోలు చేసినట్టుగా రికార్డులు చెప్తుంటే, lrno: 03/6626/2008 తేది: 13.07.2008న మంథని ఆర్డీఓకు ఇచ్చిన లేఖలో 463 సర్వే నెంబర్ భూమిలో 8 ఎకరాల భూమి ఉందని 160 మంది లబ్దిదారులకు నివేశన స్థలాలు ఇచ్చేందుకు అనుకూలంగా ఉందని మంథని భూ సేకరణ విభాగం ఆర్డీఓ నివేదిక ఇవ్వడం గమనార్హం. ఈ సర్వే నెంబర్ భూమిలో 7.37 ఎకరాలు మాత్రమే కొనుగోలు చేసినట్టుగా, పరిహారం చెల్లించినట్టుగా రికార్డులు చెప్తుంటే అదే సమయంలో భూ సేకరణ విభాగం ఆర్డీఓ 8 ఎకరాల భూమి ఉందని రిపోర్ట్ ఇవ్వడాన్ని గమనిస్తే అధికార యంత్రాంగం పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఆ భూమి ఏమైంది..?

బట్టి కొట్టు భూ మాయాజాలంలో రెవెన్యూ అధికారులు రెండు సార్లు ఇచ్చిన నివేదికలో కూడా 2007 ప్రాంతంలో కొనుగోలు చేసిన భూమికి సంబంధించిన అంశాన్నే పరిగణనలోకి తీసుకున్నట్టుగా స్పష్టం అవుతోంది. 1998 ప్రాంతంలో 176 మంది లబ్దిదారులకు నివేశన స్థలాలు కెటాయించేందుకు భూమిని కొనుగోలు చేసినట్టుగా అప్పటి రికార్డులు తేట తెల్లం చేస్తున్నాయి. అంతర్గత రోడ్లు, వాటర్ ట్యాంక్, కమ్యూనిటీ అవసరాల కోసం 24 గుంటల స్థలం అలాటే చేసినట్టుగా అప్పటి అధికారులు లే ఔట్ కూడా తయారు చేశారు. 1998కి ముందు ఇదే బట్టి కొట్టు సర్వే నెంబర్లలో కొనుగోలు చేసిన ఈ భూమికి సంబంధించిన విషయాలను రెవెన్యూ అధికారులు విస్మరిస్తున్నారు. 1998లో నివేశన స్థలాల కోసం, 2007లో ఇందిరమ్మ ఇండ్లు మూడో ఫేజ్ కోసం కొనుగోలు చేసిన భూమి అంతా కలిపి దాదాపుగా 15 ఎకరాల వరకు ఉండవచ్చని అంచనా. బట్టి కొట్టులోని కేవలం మూడు సర్వే నెంబరల్లో 38 ఎకరాల భూమి పట్టదారుకు ఉన్నట్టయితే అందులో కొనుగోలు చేసిన భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిందే. విడుతల వారిగా కొనుగోలు చేసిన ఈ భూమికి సంబంధించిన రికార్డులు కూడా అందుబాటులో ఉండడంతో పాటు 1998 ప్రాంతంలో నిరుపేదలకు ఇచ్చిన భూమికి సంబంధించిన లే ఔట్ ప్లాన్ కూడా ఉన్నందున ఇక్కడ అసలు ప్రభుత్వం ఆధీనంలో ఉండాల్సిన భూమి ఎంత అన్నది తేల్చాల్సి ఉంది. లేనట్టయితే ప్రభుత్వ నిధులు వెచ్చించి కొనుగోలు చేసిన భూమిని ప్రైవేటు వ్యక్తులు ఇతరులకు విక్రయించే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికే ఈ భూమిలో పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగినట్టుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొనుగోలు చేసిన భూమిని కూడా అక్రమణ దారులో లేక పట్టాదారుల వారుసులో క్రయవిక్రయాలు జరిపినట్టయతే వారిపై క్రిమనల్ చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉంది. ఏకంగా ప్రభుత్వన్నే మోసం చేశారన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

వారికే నిబంధనలా..?

బట్టి కొట్టు భూముల్లో మరో అంశాన్ని కూడా అధికారులు గమనించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం అధికారికంగా నిరుపేదలకు లే ఔట్ వేసి మరీ నివేశన స్థలాలు కెటాయించింది. అయితే ఈ స్థలాల్లో లబ్దిదారులు ఇండ్లను నిర్మించుకోలేదన్న కారణంతో రద్దు చేశారు అధికారులు. వాస్తవంగా ప్రభుత్వం సామూహికంగా నివేశన స్థలాలు కెటాయించినప్పుడు మౌళిక వసతులు కూడా కల్పించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి ఆయా శాఖలతో సమన్వయం చేస్తూ స్కూల్, పార్క్, తాగు నీటి సరఫరా, విద్యుత్ సరఫరా వంటి మౌళిక వసతులను కల్పించాలి. కానీ అప్పుడు నిరుపేదలకు ఇచ్చిన తరువాత ఈ అంశాలను పట్టించుకోకుండానే లబ్దిదారులు ఇండ్లు నిర్మించుకోలేదన్న సాకుతో వాటిని రద్దు చేశారు. అయితే సామాన్య లబ్దిదారుల విషయంలో కఠినంగా చట్టాలకు పని చెప్పిన అధికారులు బట్టి కొట్టులో ప్రభుత్వం డబ్బు చెల్లించి కొనుగోలు చేసిన భూమిని కాపాడుకునే విషయంలో ఎందుకు కఠినంగా వ్యవహరించడం లేదో అంతు చిక్కకుండా పోతోంది. విడుతల వారిగా ఇక్కడ కొనుగోలు చేసిన భూమిని స్వాధీనం చేసుకునేందుకు పట్టాదారుల వారసులపై చట్టాలను ఉపయోగించాల్సిన అవసరం ఉంది. ఓ వైపున ప్రభుత్వానికి విక్రయించి మరో వైపున సామాన్యులను మోసం చేసిన కేసులను ఉపయోగించాల్సిన ఆవశ్యకత ఉంది. అంతే కాకుండా ప్రభుత్వం సంక్షేమ పథకాల కోసం కొనుగోలు చేసిన ఈ భూమిని ఆక్రమించుకున్న వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవల్సిన ఆవశ్యకత ఉంది. తప్పుడు నివేదికలు ఇస్తూ ఉన్నతాధికారులను తప్పదోవ పట్టించిన సంబంధిత శాఖల అధికారులు, తమ శాఖ నిధులతో కొనుగోలు చేసిన భూమిని గాలికి వదిలేసిన వారిపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్టయితే ప్రభుత్వ భూమి సంరక్షణ చట్టాలకు పదును పెడ్తాయి ఆయా విభాగాలు.

You cannot copy content of this page