దిశ దశ, హైదరాబాద్:
ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన వారి రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారు..? అసలు నిభందనలు ఏం చెప్తున్నాయి..? వీరికి ఎవరు రక్షణ చర్యలు తీసుకుంటారు..? తాజాగా జడ్చర్ల్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తనకు ఎస్కార్ట్ ఇవ్వవద్దని జిల్లా ఎస్పీని కోరుతూ రాసిన లేఖ వైరల్ అవుతోంది. అసలు ఏం జరిగింది..?
రక్షణ చర్యలు ఎలా అంటే..?
ప్రముఖుల భద్రత విషయంలో పోలీసు విభాగానికి కూడా నిభందనలు ఉన్నాయి. ఎమ్మెల్యేలకు 2 ప్లస్ 2 సెక్యూరిటీని సంబంధిత జిల్లాకు చెందిన పోలీసు అధికారులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఎమ్మెల్యే రక్షణ చర్యల్లో భాగంగా నిరంతరం డ్యూటీలో ఇద్దరు అంగరక్షకులు పనిచేస్తారు. ఇద్దరికి రెస్ట్ ఇచ్చిన తరువాత మరో ఇద్దరు విధుల్లో చేరాల్సి ఉంటుంది. అయితే ఆరు నెలలకోసారి గన్ మెన్లను మార్చి వేరేవారిని నియమించాల్సి ఉంటుంది. ఆర్మ్ డ్ రిజర్వూ విభాగం పోలీసు అధికారులు మాత్రమే ఈ గన్ మెన్లను నియమించడం వంటి వ్యవహరాలు పర్యవేక్షించాల్సి ఉంటుంది. మంత్రులకు మాత్రం ఎమ్మెల్యేలు కల్పించే 2 ప్లస్ 2 గన్ మెన్లతో పాటు ఇంటలీజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ఐఎస్ డబ్లు) స్పెషల్ సెక్యూరిటీని ఏర్పాటు చేస్తారు. క్యాబినెట్ హోదాలో ఉండే వీరికి మాత్రం ఎస్కార్ట్, పైలెట్ వాహనాలను కూడా ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా వీరికి ఎస్కార్ట్, పైలెట్ వాహనాలను ఏర్పాటు చేస్తారు.
కాన్వాయ్ అవసరమా.?
అయితే నిరంతరం తమ తమ నియోజకవర్గాల ప్రజలతో మమేకమవుతూ పర్యటనలు చేసే ఎమ్మెల్యేలకు ఎస్కార్ట్ చేసే విధానం ఉండదు. సొంత నియోజకవర్గాల్లో పర్యటించినప్పుడు ఎమ్మెల్యేలు హాజరయ్యే సభలు, సమావేశాలు, ఇతర కార్యక్రమాల వద్ద బందోబస్తు చేపట్టేందుకు సంబంధిత స్టేషన్ లో పనిచేసే పోలీసు అధికారులు డ్యూటీలు చేయాల్సి ఉంటుంది. కానీ ఎమ్మెల్యే తమ స్టేషన్ జ్యురిడిక్షన్ కు రాగానే రిసివ్ చేసుకోవడం, వెల్లిపోయేప్పుడు వీడ్కోలు చెప్పేందుకు ఎమ్మెల్యే కాన్వాయ్ లో తిరగాల్సిన అవసరం లేదు. సంబంధం లేకున్నా కొంతమంది పోలీసు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఎమ్మెల్యేల కాన్వాయ్ కి ఎస్కార్ట్ చేసే విధానాన్ని అలవాటు చేసేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. తమ టూర్లో ఖచ్చితంగా ఎస్కార్ట్ విధానం ఉంటుందన్న స్థితికి ఎమ్మెల్యేలు చేరిపోయారు.
ఆ ఎమ్మెల్యే లేఖ వెనక…
అయితే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి జిల్లా ఎస్సీకి రాసిన లేఖకు కారణం కూడా ఇదేనని చెప్పవచ్చు. సాధారణంగా ఇద్దరు గన్ మెన్లతో తాను ప్రజల్లోకి వెల్తుంటే ఎస్కార్ట్ ఇచ్చేందుకు అలవాటు పడిపోయిన పోలీసు అధికారులు ఆయన కాన్వాయిలో తిరుగుతుండడంతో ఆయన ఇబ్బంది పడ్డారనిపిస్తోంది. దీంతో తనకు ఎస్కార్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఎస్పీకి లేఖ రాసినట్టుగా స్పష్టం అవుతోంది. ప్రభుత్వాలు, పోలీసు ఉన్నతాధికారులు కూడా పోలీసు ఎస్కార్ట్ కల్పించే విషయంలో చూసీ చూడనట్టుగా వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి తయారైందన్న వాదనలు ఉన్నాయి.
దశాబ్దాల క్రితం…
అయితే దశాబ్దాల క్రితం అయితే కనీసం అంగరక్షకులు కూడా లేకుండా ఎమ్మెల్యేలు జనంతో మమేకం అయిన వారెందరో ఉన్నారు. 1990వ దశాబ్దానికి ముందు చాలా మంది ఎమ్మెల్యేలు గన్ మెన్లు లేకుండానే జనంతో మమేకం అయ్యేవారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రాతినిథ్యం వహించిన ఎమ్మెల్యేలు కూడా చాలా మంది అంగరక్షకులతో సంబంధం లేకుండానే ముందుకు సాగారు. కానీ ఇప్పుడు గన్ మెన్లు ఉండడం అనేది పొలిటికల్ లీడర్లకు క్రేజీని తెచ్చిపెడ్తున్నట్టుగా మారిపోయిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కారణంగానే ముఖ్యమైన నాయకులకు సాన్నిహిత్యంగా మెదిలో సెకండ్ క్యాడర్ లీడర్లు కూడా గన్ మెన్లను నియమించుకునేందుకు ముప్పు తిప్పలు పడుతున్నారు. ఇదే సమయంలో పోలీసు అధికారులు కూడా ఎమ్మెల్యేలకు రక్షణ వలయంగా ఏర్పడేందుకు ఉత్సుకత చూపించడంతో ఇప్పుడు ఎస్కార్ట్ గా పోలీసు వాహనాలు తిరగాల్సిందేనన్న పరిస్థితి తయారైంది. వీఐపీల సెక్యూరిటీ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు సమీక్ష జరిపి నిభందనలకు తగ్గట్టుగా రక్షణ చర్యలు తీసుకున్నట్టయితే పోలీసు విభాగం సేవలు సామాన్యులకు సకాలంలో అందే అవకాశాలు ఉన్నాయి.