నేరేళ్ల బాధితులు గుర్తులేరా..?
బీఎస్సీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్పీ
దిశ దశ, సిరిసిల్ల:
ఐటీ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కేటీఆర్ తన సొంత నియోజకవర్గానికి ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారో చెప్పాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ… సిరిసిల్ల నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న కేటీఆర్ ఇక్కడి యువతలో ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించారో చెప్పాలన్నారు. నిత్యం అబద్దాలు, అసత్యాలు చెప్తూ నమ్మిస్తూ మోసం చేసే కుట్ర జరుగుతోందే తప్ప ప్రజా సంక్షేమాన్ని విస్మరించారని మండి పడ్డారు. సిరిసిల్లలో రాచరిక పాలన సాగుతోందని, పరిహారం ఇవ్వకుండానే పేద భూములు లాక్కున్నారని, ఆ భూముల్లో ఏ కంపెనీలో పెట్టారో వివరించాలని ఆర్ఎస్పీ డిమాండ్ చేశారు. 2017లో ఒకరి చావుకు కారణమైన ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుని, ఆగ్రహంతో ఊగిపోయిన స్థానికులు లారీలు తగలబెట్టారన్నారు. అయితే బాధితులకు ఎదురవుతున్న బాధలను పట్టించుకోకుండా నాలుగు రోజుల పాటు వారిపైనే థర్డ్ డిగ్రీ ఉపయోగించారని, కరెంట్ షాకు పెట్టి చిత్ర హింసలకు గురిచేశారని ప్రవీణ్ కుమార్ దుయ్యబట్టారు. బాధితుల పక్షాన పోరాటం చేసిన వారిని కేటీఆర్ కొనుగోలు చేసి వాస్తవాలు మాట్లాడే వారి గొంతు నొక్కారని ఆరోపించారు. అయితే బీఎస్పీ మాత్రం బాధితుల పక్షాణ పోరాటం చేస్తుందని, ఇప్పటికీ కేటీఆర్ సిరిసిల్లకు వచ్చినప్పుడల్లా వీరిని అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజమని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల్లో చనిపోయిన రైతులు, జవాన్లకు సాయం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ నేరెళ్ల బాధితులను మాత్రం ఆదుకోలేదని వారికి సాయం చేయలేదని విమర్శించారు. ఎమ్మెల్సీ కవిత స్వాంతంత్ర్య సమర యోధురాలా ఆమెను కాపాడేందుకు 30 లక్షల మంది నిరుద్యోగ యువతను వదిలిపెట్టి కేటీఆర్ ఢిల్లీకి ఎలా వెల్లారని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన అడిషనల్ అడ్వకేట్ జనరల్ కవిత కోసం ఢిల్లీకి ఎలా వెల్లారో చెప్పాలన్నారు. తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం పెరగలేదని మీ కుటుంబ ఆదాయం మాత్రమే పెరిగిందని, ఫాంహౌజ్, రాజ భవనాలు వదిలి బయటకు వస్తే సమాజంలోని పేదరికం కనిపిస్తుందన్నారు. 2016 నుండి ఒక్కసారి కూడా అంబేడ్కర్ కు పూలమాల వేయలేదు కానీ ఇప్పుడు విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారని ఎద్దేవ చేశారు. లీకేజీకి సంబంధించిన అధికారిక డాటా ప్రకటిస్తున్న కేటీఆర్ కు ఆ డాటా ఎలా దొరికిందో చెప్పాలని, ఆ వివరాలు ఎవరు ఇచ్చారని అడిగారు. మీరు కమిషన్ పీఆర్వోనా, సిట్ అధికారా రాజ్యాంగబద్ద సంస్థతో కేటీఆర్ కు ఏంపనో అర్థం కావడం లేదన్నారు. కేసీఆర్ మీడియా ముందుకు రావడానికి భయపడుతున్నారని, పేపర్ లీకేజీ కుంభకోణం మేమే కనుక్కున్నాం అని కెటీఅర్, హరీష్ రావు అబద్దాలు ఆడుతున్నారని ఆరోపించారు. 100కి కాల్ చేసి ఒక వ్యక్తి చెప్పడం వల్ల లీకేజీ కుంభకోణం బయటపడిందన్న విషయాన్ని బయటకు చెప్పడం లేదని ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. 10వ తరగతి పేపర్ లీకేజీలో 48 గంటల్లోనే వాట్సాప్ చాట్, కాల్ డాటా బయటకు తీసి నిందితులను అరెస్ట్ చేసిన ప్రభుత్వానికి మార్చి 11 న జరిగిన పేపర్ లీకేజీ కేసు విచారణలో పూర్తి వివరాలు ఎందుకు దొరకడం లేదో చెప్పాలన్నారు. కమిషన్ సభ్యులుగా ఉన్నలింగారెడ్డి, సుమిత్రా, కారెం రవీందర్ రెడ్డి, సత్యనారాయణ వీరంతా కూడా సీఎం కేసీఆర్ అనుచరులేనని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్పీ ఆరోపించారు. వీరందరి కాల్ డాటాతో పాటు టాప్ 500 ర్యాంకర్ల డాటా కూడా బయటకు తీయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 18న అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా నిర్వహించబోతున్నామని వివరించారు.