దిశ దశ, కరీంనగర్ :
పట్టభద్రుల ఎన్నికల లెక్కింపులో తొలి అడుగులోనే విచిత్ర ఫలితాలు ఎదురవుతున్నాయి. తమకే ప్రాధాన్యత లభిస్తుందని కలలు కన్న అభ్యర్థులను డిఫెన్స్ లో పడేస్తున్నాయి. దీంతో గెలుపోటములు శాసించేది చెల్లని ఓట్ల అన్న ఆందోళన మొదలైంది.
చెల్లని ఓట్లు…
ఓటు వేయడంలో పట్టభద్ర ఓటర్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయాలో కూడా తెలియక పోవడంతో అయోమయానికి గురయ్యారు. కరీంనగర్ పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో సోమవారం ప్రారంభం అయింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ లో 70శాతం, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 90శాతం పోలయ్యాయి. ప్రాధాన్యత ప్రామాణికంగా అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. మొదట బ్యాలెట్ పేపర్ల బెండిల్స్ కట్టడంతో పాటు చెల్లని ఓట్లను పక్కన పెడుతున్నారు. గ్రాడ్యూయేట్ ఓట్ల కౌంటింగ్ లో ఇప్పటి వరకూ 320 పోలింగ్ బూతులకు సంబంధించిన బ్యాలెట్ పేపర్ల బెండిల్స్ సిద్ధం చేశారు. ఇందులో 10శాతం ఓట్లు చెల్లనివిగా తేల్చారు ఎన్నికల కౌంటింగ్ అధికారులు. బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేసినప్పుడల్లా తమ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పడి ఉంటాయోనన్న ఆతృత కౌంటింగ్ ఏజెంట్లలో కనిపించకపోగా, ఈ బాక్సులో ఎన్ని చెల్లని ఓట్లు పడ్డాయోనన్న ఆందోళన కనిపిస్తోంది. ఒక్కో పోలింగ్ బూతులో 90 నుండి వంద వరకూ ఓట్లు చెల్లనివి వస్తున్నాయి. గత ఎన్నికల్లో లక్షా 40వేల ఓట్లు పోల్ కాగా దాదాపు 20వేల ఓట్ల వరకూ చెల్లనివి పడ్డాయని తెలుస్తోంది.
సోషల్ మీడియాలో…
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయాలి అన్న విషయంపై సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. సొంత పెన్నులు వాడకూడదని, ఎన్నికల ఉద్యోగులు ఇచ్చిన పెన్ను మాత్రమే వాడాలని, నంబర్లు ఇలా వేస్తేనే ఓటు చెల్లుతుందని కూడా ప్రచారం చేశారు. అయినప్పటికీ పట్టభద్రులు ఓటేసేప్పుడు మాత్రం తప్పిదాలు చేశారు. కొంతమంది బ్యాలెట్ వెనుక భాగంలో ప్రాధాన్యత ఓటు వేయగా మరి కొందరు రైతు బంధు రాలేదని, వేస్ట్ ప్రభుత్వం అని రాశారు.
ఎంత పని అయిందో..?
ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలు కాగానే అభ్యర్థులంతా తలలు పట్టుకుంటున్నారు. ఓటు వేయాలని అభ్యర్థించడంపై దృష్టి సారించామే తప్ప ఓటు ఎలా వేయాలో అన్న విషయంపై అవగాహన కల్పించ లేకపోయామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్వతంత్రుల ఆందోళన…
మరో వైపు చెల్లని ఓట్లు గమనించిన అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. ఎన్నికల అధికారులు ఓటర్లకు అవగాహన కల్పించడంలో విఫలం అయ్యారని ఆరోపించారు. రీ ఎలక్షన్ జరపాలని డిమాండ్ చేశారు. కౌంటింగ్ హాల్ లో పలు మార్లు ఎన్నికల అధికారులకు, ఏజంట్లకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే 1, 2 అని రాసిన ఓట్లను కూడా పరిగణన లోకి తీసుకోవాలని కాంగ్రెస్ అభ్యర్ధి వి నరేందర్ రెడ్డి, ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అభ్యర్థి సర్దార్ రవిందర్ సింగ్ కోరారు.