డంప్ యార్డ్ తో ఎన్నెన్ని సమస్యలో…?

టూరిస్టులకు సమస్యగా మారనుందా..?

దాదాపు మూడు దశాబ్దాలుగా ఆ ప్రాంతాన్ని డంప్ యార్డుగా వినియోగిస్తున్నారు. కరీంనగర్ లో ఎక్కడ చెత్త సేకరించినా అక్కడికే చేరవేస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ డంప్ యార్డు నగర వాసులకు సవాల్ విసురుతోంది. ఉన్నట్టుండి డంప్ యార్డులో మంటలు చెలరేగడం… సమీపంలోని ఇండ్లలోకి పొగ చూరుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండేళ్ల క్రితం ఓ సారి అగ్ని ప్రమాదం జరగగా తాజాగా మరోసారి అగ్ని ప్రమాదం సంభవించడం గమనార్హం. మానేరు నది పక్కనే ఏర్పాటు చేసిన ఈ డంప్ యార్డు కాలుష్యాన్ని పంచుతున్నప్పటికీ పట్టించుకునే వారే లేకుండా పోయారన్నది వాస్తవం.

నిత్యం చెత్త ఇలా…

నగరంలో సుమారు 3.50 లక్షల నుండి 4 లక్షల వరకు జనాభా ఉంది. కరీంనగర్ వాసులు పడేస్తున్న చెత్త అంతా ఈ డంప్ యార్డు వచ్చి చేరుతూ ఉంటోంది. సుమారు 140 మెట్రిక్ టన్నుల చెత్త డంప్ యార్డ్ లో పడేస్తున్నట్టు ఓ అంచనా. దశాబ్దాలుగా పేరుకపోయిన చెత్త చిన్న సైజు గుట్టలను మరిపిస్తుందంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మానేరు నది తీరంలో అప్పట్లో ఏర్పాటు చేసిన ఈ డంప్ యార్డును నేటికీ అలాగే కొనసాగిస్తున్నారు. ఒకప్పుడు లక్ష వరకు జనాభా ఉన్నప్పుడు ఈ డంప్ యార్డు నాలుగు లక్షల వరకూ చేరినప్పటికీ అలాగే కొనసాగిస్తున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మరో చోట డంప్ యార్డును ఏర్పాటు చేయడం కానీ ప్రత్యమ్నాయంగా మరిన్ని చోట్ల యార్డులను ఏర్పాటు చేయడం లేదు. దీంతో ఒకే స్థలంలో పడుతున్న ఈ చెత్త రోజుకు రోజుకు పేరుకపోతున్నది. గతంలో ఓ సారి ఇక్కడి డంప్ యార్డను మార్చాలన్న ప్రతిపాదన వచ్చినప్పటికీ ఆచరణలో మాత్రం పెట్ట లేదు.

డంప్ యార్డులో చెలరేగిన మంటలు

మంటల్లోనే…

వేసవి కాలం వచ్చిదంటే చాలు ఈ డంప్ యార్డు సమీపంలోని నివాసితులకు పరీక్ష పెడుతుందనే చెప్పాలి. చెత్తలో రాజుకున్న నిప్పుతో పొగ రావడం అది కాస్తా సమీపంలోని ఇళ్లలోకి చొరబడుతుండడంతో ఆయా ప్రాంతాల వాసులు కాలుష్యం కోరల్లో చిక్కుకుంటున్నారు. రెండేళ్ల క్రితం డంప్ యార్డులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో అటు బల్దియాపై ఆర్థిక భారం పడగా ఇటు నగర వాసులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. తాజాగా మంగళవారం రాత్రి నుండి డంప్ యార్డులో మటలు చెలరేగడంతో ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను ఆర్పే పనిలో నిమగ్నం అయ్యారు. మంటలు చెలరేగినప్పుడల్లా సమీప ప్రాంతాల వాసులు పొగ కారణంగా అనారోగ్యాల బారిన పడే అవకాశం కూడా లేకపోలేదు.

రివర్ ఫ్రంట్ కూ ఎఫెక్ట్…

అయితే పర్యాటకులను ఆకర్షించేందుకు తయారు చేస్తున్న మానేరు రివర్ ఫ్రంట్ కు కూడా ఈ డంప్ యార్డ్ సమస్యగా మారనుంది. లోయర్ మానేరు డ్యాం గేట్లకు దిగువ ప్రాంతంలో తీగల వంతెనతో పాటు చెక్ డ్యాం నిర్మాణం ప్రారంభించారు. మంత్రి గంగుల కమలాకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని గుజరాత్ సబర్మతి తరహాలోనే లోయర్ మానేరు డ్యాంను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుని సీఎం కేసీఆర్ ను ఒప్పించి మరీ రూ. 500 కోట్లకు పైగా నిధులు మంజూరు చేయించారు. కానీ భవిష్యత్తులో చెక్ డ్యాం బ్యాక్ వాటర్ పర్యాటకులు సహనాన్ని పరీక్షంచనుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. డంప్ యార్డు కూడా ఇదే ప్రాంతంలో ఉండడంతో బ్యాక్ వాటర్ లో చెత్త మునిగిపోతుంటుంది. దీనివల్ల దుర్గంధం వెదజల్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అలాగే బ్యాక్ వాటర్ లో బోటింగ్ చేయడానికి కూడా టూరిస్టులకు ఇబ్బందిగా మారనుంది. ఓ వైపున తీగల వంతెన వెలుగు జిలుగులతో ఆనందంలో మునిగి తేలుతున్నా మరో వైపున నీటిపై తిరుగుతున్నామన్న ఆనందం మాత్రం ముందు ముందు పర్యాటకులకు ఉండకపోయే ప్రమాదం ఉన్నది. కరీంనగర్ ను టూరిస్ట్ సెంటర్ గా మార్చాలన్న సంకల్సంగా చేపడుతున్న అభివృద్ది పనులు బాగానే ఉన్నా భవిష్యత్తులో వీటిపై డంప్ యార్డు ప్రభావం ఎంత మేర పడనుంది అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవలసి ఉంది.

అదే ఉదాహారాణ…

ఇంతకాలం దిగువ ప్రాంతాలకు నీరు సాఫీగా ప్రవహిస్తూ ఉండేది. కానీ కాళేశ్వరంలో భాగంగా పెద్దపల్లి సుందిళ్ల వద్ద నిర్మించిన బ్యారేజ్ వల్ల గోదావరిఖని వాసులు ఎంత ఇబ్బంది పడుతున్నారో గమనించాల్సిన అవసరం ఉంది. గోదావరిఖని వద్ద సింగరేణి సంస్థ నుండి వచ్చే వృధా నీరు, ఎన్టీపీసీ కాలుష్యం నీరు, పవర్ హౌజ్ లకు సంబందించిన వాటర్ అంతా కూడా గోదావరి నదిలో కలుస్తుంటుంది. ఇంతకాలం బ్యారేజ్ లేకపోవడంతో దిగువ ప్రాంతాలకు నేరుగా వెల్లిపోయేది. దీనివల్ల కాలుష్యం నీటి ప్రభావం అక్కడి ప్రజలపై పడలేదు కానీ ఇప్పుడు సుందిళ్ల బ్యారేజ్ కారణంగా బ్యాక్ వాటరో లో తరుచూ కాలుష్యం ఎంతమేర కలుస్తోందో స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్కోసారి గోదావరి నీటిలో ఓ నీటి పాయలా కాలుష్యం ప్రవహిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా గతంలో నెట్టింట వైరల్ అయిన విషయం గుర్తుంచుకోవాలి. ఇదే పద్దతిన భవిష్యత్తులో తీగల వంతెనకు దిగువన నిర్మిస్తున్న చెక్ డ్యాం వల్ల్ బ్యాక్ వాటర్ పెద్ద ఎత్తున నిలువ ఉంటుంది. ఈ నీటిలోనే డంప్ యార్డులోని వ్యర్థలు కలిసి కలుషితంగా మారే ప్రమాదం ఉంటుంది. వర్షాకాలం మినహా మిగతా అన్ని కాలాల్లో కూడా కాలుష్యపు నీటిలోనే టూరిస్టులు టూర్లు చేయాల్సి ఉంటుంది. భారీగా వరదలు వచ్చినప్పుడు మాత్రం ఎల్ఎండీ గేట్లు ఎత్తితే కలుషిత నీరు పోయి కొత్త నీరు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ చెక్ డ్యాంకు కట్టడం కన్నా తక్కువ లెవల్లో ఉన్న నీరు మాత్రం ఇక్కడే ఉండిపోతుందన్నది వాస్తవం. ఇలాంటి పరిస్థితుల్లో డంప్ యార్డ్ వల్ల రానున్న కాలంలో పర్యాటకులకు ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నందున ఇప్పటి నుండే ఈ యార్డు విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటే బావుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

You cannot copy content of this page