రూ. 400 కోట్ల కోసం ఇంత కష్టమా? ఆ జరిమానా వసూలు చేస్తే…?

దిశ దశ, కరీంనగర్:

రాష్ట్రంలోని ఇసుక రీచుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గిందని ప్రభుత్వం అంటోంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడంతో సర్కారు కూడా పైసా పైసా జమ చేయాల్సిన పరిస్థితి తయారైంది. అటు అప్పులు… ఇటు పథకాలు సాఫీగా అమలు చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆదాయం పెంచడంపై రాష్ట్ర ప్రభుత్వం తంటాలు పడుతోంది. ఉద్యోగులకు జీతాలు ఇస్తే పథకాల నిధులకు ఆటంకం అవుతుండగా, అన్ని పథకాలకు ఏక కాలంలో డబ్బులు విడుదల చేసే పరిస్థితి అంతకన్నా లేకుండా పోయింది. ఈ రోజు గడిచింది కానీ రేపు ఎలా అన్న ఆందోళనతోనే అధికార యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. దీంతో ఆదాయ వనరులే అత్యంత సవాల్ గా మారిపోయింది.


అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇసుక రీచుల ద్వారా వచ్చే ఆదాయం కోసం అధికార యంత్రాగాన్ని పురమాయిస్తోంది. ఇందుకు వివధ శాఖల అధికారుల సమన్వయంతో నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. రీచులను పర్యవేక్షించడం నుండి వాగులు, వంకల నుండి అక్రమంగా తరలిపోతున్న ఇసుకను పట్టుకునేందుకు, ఓవర్ లోడ్, జీరో దందా కట్టడి చేసేందుకు ఈ బృందాలు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాయి. రేపు ఆదాయం ఎంత మేర వస్తుందోనన్న విషయంపై ఇప్పటివరకు స్పష్టత అయితే లేదు. అధికార యంత్రాంగం టీఏ, డీఏలతో కొంత మేర ఆర్థిక భారం, వారి సొంత శాఖల్లోని పనులు ముందుకు సాగని తీరుతో కొత్త సవాళ్ళను ఎదుర్కొనే పరిస్థితి తయారైంది.

ఆ జరిమానా…

అయితే తెలంగాణ ప్రభుత్వం వసూలు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్న భారీ ఆదాయం విషయాన్ని విస్మరిస్తున్న తీరు విచిత్రంగా ఉంది. అలాగే భారీ ఆదాయాన్ని అందించే అవకాశం ఉన్న అంశాన్ని వదిలేసి, ఇసుక రీచుల చుట్టూ యంత్రాంగంచే ప్రదక్షిణలు చేయించడం కాకుండా లిక్విడ్ క్యాష్ చేతికి వచ్చే మార్గాలపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇదే మైనింగ్ విభాగం పరిధిలోనే ఉన్న అంశాన్ని పరిశీలిస్తే బావుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి సీనరేజ్ ఎగవేసి గ్రానైట్ బ్లాకులను చైనాకు తరలించారని విజిలెన్స్ అధికారులు నివేదికలు ఇచ్చారు. ఆయా రవాణా ఏజెన్సీలు కరీంనగర్ సమీపంలోని పలు గ్రానైట్ క్వారీల నుండి ఈ బ్లాకులు ఏపీలోని పోర్టులకు చేరుకున్నాయని విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ప్రకారం 1+5 జరిమానా వేయాలని మైనింగ్ యాక్ట్ చెప్తోంది. బ్లాకుల విలువ, జరిమానా కలిపి మొత్తం రూ. 749 కోట్లు వసూలు చేయాలని స్పష్టంగా పేర్కొంది. అయితే ఈ జరిమానాను అప్పటి మంత్రి ఒకరు 1+1 చెల్లించాలని మెమో జారీ చేయించారు. అయితే ఇప్పటి వరకూ బాధ్యులైన గ్రానైట్ క్వారీల యజమానులు స్వల్పంగా డబ్బు చెల్లించి చేతులు దులుపుకున్నారు. జరిమానా మొత్తం వసూలు చేసేందుకు అధికార యంత్రాంగం దృష్టి పెట్టడం లేదు. అయితే మైనింగ్ చట్టాల మేరకు వేసిన ఈ జరిమానాలో మినహాయింపు ఇచ్చే అధికారం ఎవరికీ లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి చట్టాన్ని సవరిస్తే తప్ప మైనింగ్ యాక్ట్ నుండి మినహాయింపు ఇచ్చే అవకాశం లేనట్టుగా తెలుస్తోంది. ఈ విషయంపై కోర్టులను ఆశ్రయించినప్పటికీ గ్రానైట్ క్వారీల నిర్వాహకులకు, రవాణా ఏజెన్సీలకు అనుకూలమైన తీర్పు రానట్టుగా తెలుస్తోంది. గతంలో ఇతర రాష్ట్రాల్లోని మైన్స్ విషయంలో కూడా ఇదే విధంగా జరిమానా విధించిన విషయంలో సుప్రీంకోర్టు పెనాల్టీతో సహా వసూలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. కరీంనగర్ గ్రానైట్ జరిమానా విషయంలో కూడా ఇదే విధానం అమలు చేయాల్సి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక వేళ కోర్టులో ఏమైనా పిటిషన్లు విచారణలో ఉన్నట్టయితే వాటిని త్వరితగతిన పరిష్కరించుకునేందుకు చొరవ చూపించాల్సి ఉంటుంది. దీనివల్ల రూ.749 కోట్లే కాకుండా వడ్డీతో వసూలు చేసినట్టయితే రూ. 1200 కోట్ల వరకూ ప్రభుత్వ ఖజానాలోకి నిధులు వచ్చి చేరే అవకాశం ఉంటుంది. అలాగే ఇసుక క్వారీల వద్ద తీసుకుంటున్న కఠిన చర్యలను గ్రానైట్ క్వారీల వద్ద అమలు చేసినట్టయితే భారీ సీనరేజ్ ఫీజు కూడా వసూలు కానుంది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న గ్రానైట్ క్వారీలపై కొరడా ఝులిపించినట్టయితే మరింత ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా గ్రానైట్ క్వారీలు పెద్ద సంఖ్యలో ఉన్నందున ఇసుక రీచులను మించిన ఆదాయం వస్తుందన్న విషయం గమనించాల్సిన అవసరం ఉంది.

You cannot copy content of this page