ఇసుక పాలసీ మార్పు ప్రతిపాదన…
లారీ అసోసియేషన్ల వినతులు…
అక్రమాల తంతు వెలుగులోకి…
దిశ దశ, భూపాలపల్లి:
రాష్ట్రంలో ఇసుక సేకరించే విధానంలో మార్పులు చేర్పులు తీసుకరావాలన్న ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. కొన్ని ప్రపోజల్స్ రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉండగా ఇందులో ఏ విదానానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందోనన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు. కానీ తాము ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందన్న ఆందోళన లారీ యజానుల్లో వ్యక్తం అవుతోంది. దీంతో ఇసుక అక్రమ దందాకు తాము బాధ్యులం కాదని రీచుల నిర్వాహకులేనని లారీ అసోసియేషన్ల ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన వినతి పత్రాల్లో వివరించారు. రోజుకు రూ. 2 కోట్ల 30 లక్షల 72 వేల మేర ఇసుక అక్రమ రవాణాతో ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతోందని, రీచుల నిర్వాహకుల వల్లే ఇదంతా జరుగుతోందని వినతి పత్రాల్లో వివరించారు.
గుట్టు రట్టు…
నిత్యం ఇసుక అక్రమ రవాణా సాగుతోందని లారీల్లో ఓవర్ లోడ్ ఇసుక తరలిపోతోందని ఎక్స్ ట్రా బకెట్ విధానం నడుస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తినా టీజీఎండీసీ కానీ ఇతర విభాగాల అధికారులు కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. అక్రమ రవాణాతో సర్కారు ఆదాయానికి కోట్లలో నష్టం వాటిల్లుతోందన్న వాదనలు నిజమేనని లారీ అసోసియేషన్ల ప్రతినిధులు వినతి పత్రాల ద్వారా ఒప్పుకున్నట్టయింది. రోజుకు రూ. 2 కోట్ల 30 లక్షల 72 వేల రూపాయల మేర ప్రభుత్వ ఖజానాలో చేరాల్సిన డబ్బు రీచుల నిర్వాహాకుల చేతుల్లోకి చేరుతోందని స్ఫష్టం అయింది. ఈ లెక్కన ఒక్క నెల సుమారు రూ. 70 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు గండి పడుతున్నట్టేనని గణాంకాలు చెప్తున్నాయి. ఎక్స్ ట్రా బకెట్ విధానం వల్ల సర్కారు ఖాజానాలోకి చేరాల్సిన ఆదాయం ఇప్పటి వరకు జరిగిన ఇసుక వ్యాపారంతో ఎన్ని వందల కోట్లు దారి మల్లి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. లారీ అసోసియేషన్ ప్రతినిధులు ఇచ్చిన వినతి పత్రాల లెక్కలే ఇంతమేర తేలితే జీరో వ్యాపారం ద్వారా, అనుమతులు లేని నదుల్లో తరలిస్తుండడం వల్ల కూడా సర్కారు ఆదాయానికి గండి పడి ఉండకపోయే ప్రసక్తే లేదు.
వినతి పత్రాలతో…
రాష్ట్ర ప్రభుత్వం ఇసుక పాలసీని మార్చాలన్న ప్రతిపాదనను సీరియస్ గానే పరిశీలిస్తుండడంతో ఇసుక రీచుల నిర్వాహాకులు, వర్సెస్ లారీల యజమానులు అన్నట్టుగా కూడా మారిపోయింది. ప్రభుత్వం ఈ నెల 16 నుండి ఇసుక పాలసీ మార్చడం ఖాయం అనుకున్న సమాచారం అందగానే లారీ అసోసియేషన్ ప్రతినిధులు ఇసుక అక్రమ రవాణా నెపాన్ని నిర్వాహాకుల మీదకు తోసేశారు. అయితే ఇంతకాలం ఏనాడూ కూడా ఓవర్ లోడ్ విషయంలో నోరు మెదపని లారీల యజమానులు ఇప్పుడు రీచుల కేంద్రంగా సాగుతున్న అక్రమ వ్యవహారాన్ని బట్టబయలు చేశారు. రాష్ట్రంలో దాదాపు రెండు దశాబ్దాలుగా ఇసుక వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. అప్పటి నుండి కూడా ఇసుక అక్రమ రవాణా గురించి ఆరోపణలు వస్తున్నా అడపాదడపా విజిలెన్స్ దాడులు, ఆర్టీఏ విభాగం తనిఖీలు తప్ప కఠినంగా వ్వవహరించిన వారే లేరన్నది వాస్తవం. ఒక రకంగా చెప్పాలంటే ఎక్స్ ట్రా బకెట్ విధానాన్ని అనధికారికంగానే అయినా అధికారికంగా నిర్వహించే పరిస్థితులను కల్పించారు పాలకులు. దీంతో ఆయా శాఖల యంత్రాంగం కూడా ఈ వ్యవహారం వైపు కన్నెత్తి చూసేందుకు సాహసించకపోగా… తిలా పాపం తలా పిడికెడు అన్నట్టుగా మారిందన్న విమర్శలూ ఉన్నాయి.
లారీల రీ డిజైన్…
ఇకపోతే ఇసుక అక్రమ రవాణా విషయంలో చూసి చూడనట్టుగా వ్యవహరించాల్సి వస్తుండడంతో లారీల్లో ఓవర్ లోడ్ విషయంలో కొత్త కొత్త పదాలను తెరపైకి తెచ్చిన సందర్భాలూ ఉన్నాయి. మొదట బాడీ సైజులో ఇసుక రవాణా చేసేందుకు అనుమతి ఇచ్చారన్న వాదనలు తెరపైకి వచ్చాయి. నిర్వాహాకులు, లారీల యజమానులు ఒత్తిళ్లు తీసుకరావడంతో బాడీ సైజ్ లోడింగ్ విధానం అమలు చేసేందుకు మౌఖిక ఆదేశాలను అమలు చేశారన్నది వాస్తవం. దీంతో లారీల యజమానుల్లో కూడా సరికొత్త ఆలోచన మెదలవడంతో బాడీల రీడిజైన్ చేయడం మొదలు పెట్టారు. ఆర్టీఏ నిబంధనల ప్రకారం లారీ టైర్ల సామర్థ్యాన్ని బట్టి ఇసుక లోడ్ చేయాల్సి ఉన్నప్పటికీ బాడీ సైజ్ పద్దతిని పాటిస్తుండడంతో లారీల రూపు రేఖలు మారిపోయాయి. బాడీలను రీ డిజైన్ చేసి మరీ ఓవర్ లోడ్ విధానాన్ని అవలంభిస్తున్నారన్నది జగమెరిగిన సత్యం. చూడడానికి బాడీ సైజే అనిపిస్తున్నా లారీల ఎత్తు పెంచి, వెనక ప్రాంతంలో విస్తరింపజేసి ఇసుక రవాణా చేస్తున్నారు. అయితే రీచు నిర్వాహకుల కారణంగానే తాము ఒవర్ లోడ్ చేసుకోవల్సిన పరిస్థితులు తయారయ్యాయని లారీల ఓనర్స్ అసోసియేషన్ల నాయకులు చెప్తున్నప్పటికీ, గతంలో ఈ విధానాన్ని వారు వ్యతిరేకించిన దాఖలాలు అయితే లేవు. ఇంతకాలం రీచుల నిర్వాహకులు, లారీల యజమానుల మద్య జరిగిన ఒప్పందం సాఫీగా సాగిపోయినప్పటికీ ఇప్పుడు మాత్రం ఓవర్ లోడింగ్ పద్దతికి అసలు కారణం రీచుల నిర్వాహకులేనని వాదిస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే ఓవర్ లోడింగ్ విధానంతో వెల్లే లారీలు ఫలనా ప్రాంతం వెల్లే వరకూ మోటారు వెహికిల్ విభాగం అధికారులు పట్టుకుంటే రీచు నిర్వాహకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని, ఆ తరువాత ఆ బాధ్యత తమ భుజాలపై వేసుకుంటామన్న ఒఫ్పందాలు చేసుకోవడం వెనక ఆంతర్యం ఏంటని లారీల యజమానుల తీరును తప్పు పడుతున్నారు. ఇప్పుడు మాత్రం ఇసుక ఓవర్ లోడ్ విధానానికి కారణం రీచుల నిర్వాహాకుల మీద తోసేస్తున్నప్పటికీ… వారితో లారీల యజమానులు చేతులు కలిపింది నిజమా కాదా అన్న చర్చ కూడా సాగుతోంది. ప్రభుత్వం రాష్ట్రాన్ని ఒక యూనిట్ గా చేసి ఇసుక రవాణా చేయాలన్న యోచన చేస్తోందనగానే లారీల యజమానులు తమ ఉపాధి పోందుతున్న ఆందోళనతో నిర్వాహాకులపై నెపం తోసేస్తున్నట్టుగా ఉంది కానీ, ఇందులో వారి ప్రమేయం కూడా ఉందన్న విషయాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉందని అంటున్న వారూ లేకపోలేదు. ఏది ఏమైనా ఇసుక రాష్ట్ర ప్రభుత్వానికే కాదు ఈ వ్యవహారంతో ముడిపడి ఉన్న చాలా మందికి కూడా ఆదాయ వనరుగా మారిపోయింది. అయితే రాష్ట్ర ప్రభత్వం కొత్తగా తీసుకొచ్చే పాలసీలతో అయినా ఇసుక అక్రమ వ్యాపారంపై కఠినంగా వ్యవహరించాల్సిన ఆవశ్యకత అయితే ఉంది.