బ్లాస్ట్ చేశారా..? పగల గొట్టారా..?

మానేరు నదిలో బండరాళ్లు ఏమయ్యాయ్..?

దిశ దశ, కరీంనగర్:

ఇంటర్నేషనల్ టూరిస్టులను ఆకర్షించే విధంగా నిర్మించ తలపెట్టిన మానేరు రివర్ ఫ్రంట్ పనుల విషయంలో ఆయా శాఖల అధికారులు అసలు నిబంధనలకు అనుకూలంగా వ్యవహరించారా లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇరిగేషన్ పరిధిలో ఉన్న మానేరు నదిలో టూరిజం కార్పోరేషన్ కొన్ని పనులు చేసినట్టుగా పేర్కొంది. హైదరాబాద్ బైపాస్ రోడ్డు నుండి నది వరకు రోడ్డు నిర్మాణం కోసం మట్టి పనులు కూడా చేశామని వివరించింది. అయితే ఇరిగేషన్ వింగ్ నుండి ఎలాంటి అనుమతులు రాకపోవడంతో అర్థాంతరంగా పనులు నిలిపివేశామని స్పష్టం చేసింది. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుందన్న వాదనలు మొదలయ్యాయి. ఇరిగేషన్ విభాగం నుండి అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టామని TSTDC అధికారులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ కు ఇచ్చిన నివేదికలో వెల్లడించిన తరువాత మానేరు రివర్ ఫ్రంట్ విషయంలో అసలేం జరిగింది అన్న చర్చ సాగుతోంది.

బండలెలా తొలగించారు..?

లోయర్ మానేరు డ్యాంకు దిగువన అల్గునూరు వంతెన, తీగల వంతెన మధ్య ఇరువైపులా కరకట్టలతో పాటు ఇతరాత్ర నిర్మాణాలు జరిపారు. అయితే ఇందుకు సంబంధించిన చెక్ మేజర్ చేసిన ఇంజనీరింగ్ అధికారులు కాంట్రాక్టు ఏజెన్సీలకు డబ్బులు కూడా సాంక్షన్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే మానేరు నదిలో ఉన్న బండరాళ్లను తొలగించే విషయంలో నిబంధనలు పాటించారా లేదా అన్న విషయంపై కూడా స్పష్టత రావల్సిన అవసరం ఉంది. బండరాళ్లను పగలగొట్టేందుకు ఎలాంటి టెక్నాలజీని వాడారన్న విషయంపై స్థానికంగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పది కాలాల పాటు ప్రజలకు సేవలందించేందుకు నిర్మించిన రెండు వంతెనల మధ్య ఉన్న బండరాళ్లను బ్లాస్టింగ్ విధానం ద్వారా పగలగొట్టినట్లుగా స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అయితే బండరాళ్లను పేల్చివేసేందుకు ఉపయోగించిన పేలుడు పదార్ధాల వినియోగం కోసం  సంబంధిత శాఖల నుండి అనుమతులు తీసుకున్నారా లేదా అన్న అనుమానం వస్తోంది. పేలుడు పదార్థాలను ఉపయోగించేందుకు ప్రత్యేకంగా నిబంధనలు కూడా ఉన్నందున అందుకు అనుగుణంగా వ్యవహరించారా లేదా అన్న విషయంపై స్పష్టత రావల్సిన అవసరం ఉంది. పేళుల్ల వల్ల సమీపంలో ఉన్న నిర్మాణాలపై ఏ స్థాయిలో ప్రభావం పడుతుందోనన్న విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవల్సి ఉంటుంది. ప్రజా రవాణాకు అత్యంత కీలకంగా ఉపయోగపడుతున్న రెండు వారధులకు వందల కోట్లు వెచ్చించి ప్రభుత్వం నిర్మించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే నదిలో ఉన్న బండరాళ్లను తొలగించేందుకు బ్లాస్టింగ్ చేసినట్టయితే భూమి కొంతమేర కంపించే అవకాశం ఉంటుందన్నది అన్నది వాస్తవం. బండరాళ్లను తొలగించేందుకు బ్లాస్టింగ్ మెటిరియల్ ఉపయోగించినట్టయితే ఇందుకు అధికారులు ఎలా అనుమతి ఇచ్చారోనన్న విషయం అంతుచిక్కకుండా పోతోంది. నదికి ఇరువైపులా వ్యవసాయ భూములు కూడా ఉండడం వల్ల పేళుల్లతో   భూమి లోపల కదిలకలు చోటు చేసుకోవడంతో పాటు బండరాళ్లు కూడా పంట భూములపై పడే ప్రమాదం ఉంటుంది. పబ్లిక్ ప్లేసెస్ లో బండరాళ్లను తొలగించే విషయంలో నిబంధనలు పాటించారా లేదా అన్న విషయంపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఆ బండలు ఏం చేశారు..?

మరో వైపున నది నుండి తొలగించిన ఆ బండలు ఏం చేశారోనన్న విషయంపై కూడా ఆరా తీయాలన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వాటినే క్రషర్ ద్వారా వివిధ సైజుల్లో కంకరగా మార్చి అదే మానేరు రివర్ ఫ్రంట్ లో జరిగిన నిర్మాణాలకు ఉపయోగించినట్టయితే ఆయా శాఖలకు ఆర్థిక బారం కూడా తగ్గనుంది. ఇదే నదిలో ఇసుక, కంకర లభ్యం అవుతుండడం వల్ల ప్రభుత్వానికి కూడా భారీ ఎత్తున నిధులు మిగిలేవి. అయితే ఇప్పటి వరకు జరిగిన నిర్మాణాలకు ఉపయోగించిన కంకర, ఇసుకను ఎక్కడి నుండి తెప్పించారని బిల్లులు తయారు చేశారన్న విషయంపై కూడా దృష్టి పెట్టాలన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక వేళ ఈ బండరాళ్లను వృధాగా పడేసినట్టయితే వాటిని తరలించేందుకు ఎంత ఖర్చు వెచ్చించారు..? ఎక్కడ వేశారు అన్న వివరాలను కూడా సేకరించాల్సిన అవసరం ఉంది.

రోడ్డు వేయోచ్చా..?

TSTDC అధికారులు NGTకి ఇచ్చిన నివేదికలో చెప్పిన అంశాన్ని బట్టి బైపాస్ రోడ్డును అనుసంధానం చేస్తూ రోడ్డు కోసం మట్టి వేయించామని పేర్కొన్నారు. అయితే టూరిస్టులను ఆకట్టుకునే విధంగా ఆకర్షణీయమైన ఫౌంటెన్ వంటివి ఏర్పాటు చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన TSTDC అధికారులు రోడ్డు నిర్మాణం చేయడం ఏంటన్నది కూడా అంతుచిక్కకుండా పోతోంది. మానేరు నదిలోపల ఇరిగేషన్ అధికారులు నిర్మాణాలు చేసినప్పుడు రోడ్డు నిర్మాణం బాధ్యతలను టూరిజం విభాగానికి అప్పగించడం గమనార్హం. ఇరిగేషన్ అధికారులు కెనాల్స్ తో పాటు రిజర్వాయర్ల్ వద్దకు వెల్లేందుకు అనుకుణంగా రోడ్ల నిర్మాణం చేస్తుంటారు. టూరిజం విభాగం అధికారులు పర్యాటకరంగంపై మాత్రమే దృష్టి సారిస్తుంటారు. అయితే రోడ్డు నిర్మాణం కోసం టూరిజం విభాగం చొరవ తీసుకోవడం ఏంటన్నది కూడా అంతుచిక్కకుండా పోతోంది.

ఇలా ఎలా..?

అసలు పర్యాటక శోభ సంతరించుకునే విధంగా కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం దిగువ ప్రాంతాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావించినప్పుడు పనులన్ని ఒకే శాఖ తరుపున చేయించకుండా రెండు మూడు విభాగాల భాగస్వామ్యం ఉంచడం కూడా సరైన నిర్ణయం కాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నది ఇరిగేషన్ పరిధిలోనిది కాబట్టి ఇక్కడ జరిగే ప్రతి నిర్మాణం కూడా అదే విభాగం నుండి చేయించి టూరిస్టుల కోసం ఏర్పాటు చేసే ఫౌంటన్ బాధ్యతలను టూరిజం శాఖకు అప్పగిస్తే సరిపోయేది కదా అన్న వాదనలు వినిపిస్తున్నాయి. టూరిజం విభాగం సహకారాన్ని మాత్రమే తీసుకుని ఇరిగేషన్ అధికారులు అన్ని సిద్దం చేసి ఆ తరువాత పర్యటక విభాగానికి మెయింటనెన్స్ బాధ్యతలు అప్పగించినా బావుండేదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. లేనట్టయితే పర్యాటకుల కోసం అభివృద్ది చేస్తున్నందున మొత్తం పనులను టూరిజం విభాగానికే అప్పగించిన బావుండేదని అంటున్నారు.  శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఇరిగేషన్ అధికారులు అనుమతులు ఇవ్వకపోవడం మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణాలు రివర్స్ గేర్ వేశాయన్న చర్చ కరీంనగర్ లో సాగుతోంది. దీంతో ఇప్పటి వరకు వెచ్చించిన వంద కోట్లకు పైగా డబ్బు వృధా అయిందన్న ఆందోళన కూడా వ్యక్తం అవుతోంది. 

You cannot copy content of this page