ఏఐఎఫ్బీ అభ్యర్థి అంబటి జోజిరెడ్డి
దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ నుండి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న గంగుల కమలాకర్ కు బిఫారం ఇవ్వడంలో జరుగుతున్న ఆలస్యంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కరీంనగర్ అభ్యర్థి అంబటి జోజిరెడ్డి అన్నారు. మంగళవారం కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ…
జిల్లాలోని అధికార పార్టీ నాయకుల్లో ముసలం మొదలైనట్టుగా ఉందని, అయితే ఇప్పటి వరకు ఇచ్చిన భిపారం జాబితాలో కరీంనగర్ ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల కమలాకర్ గారి పేరు లేకపోవడం ఆశ్యర్యానికి గురి చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మంత్రి కేటీఆర్ గారికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడని చెప్పుకుంటున్నప్పటికీ గంగుల కమలాకర్ కు తొలి విడుతలో బీఫారం ఇవ్వకపోవడం ఎందుకో అన్నదే అంతుచిక్కకుండా పోయిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు వెళ్లిన పీడ్ బ్యాక్ కారణంగానే బీఫారం ఇవ్వడంలో ఆలస్యం అవుతోందా లేక మరేదైనా కారణం ఉందా అని ఆయన ప్రశ్నించారు. అభ్యర్థి గంగుల కమలాకర్ గారు బలమైన వ్యక్తి కాదని ప్రత్యామ్నాయ అభ్యర్థిని అన్వేషించే పనిలో అధిష్టానం ఉందన్న ప్రచారం కూడా జరుగుతుండడం వల్లే కరీంనగర్ లో అనుమానాలు తీవ్రం అయ్యాయని అన్నారు. అందుకే ఇప్పటి వరకు గంగుల కమలాకర్ కు బీఫారం ఇవ్వలేదని, ప్రత్యామ్నాయ అభ్యర్థి దొరకనట్టయితే చివరి క్షణంలో గంగుల కమలాకర్ గారికి బీఫారం ఇస్తారని బీఆర్ఎస్ పార్టీ నాయకులే చెవులు కొరుక్కుంటున్నారన్నారు. దీంతో గంగుల కమలాకర్ పై నాయకత్వానికి విశ్వాసం లేకుండా పోయిందని, అత్యంత ఆప్తుడైన వ్యక్తికి ఆలస్యంగా బీఫారం ఇవ్వడం వెనక కారణాలు ఏంటన్నది కరీంనగర్ ప్రజలకు అంతుచిక్కకుండా పోయిందన్నారు. ఒకవేళ సన్నిహితుడు కాబట్టే లేట్ గా ఇచ్చారని కరీంనగర్ నాయకులు చెప్పుకునే ప్రయత్నం చేసినట్టయితే ముందుగా మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారితో పాటు ఇతర మంత్రులకు కూడా బీఫారాలు ఇచ్చారని, వారితోపాటే గంగుల కమలాకర్ కు ఇవ్వకపోవడం కారణం ఏంటో వివరించాలని జోజిరెడ్డి డిమాండ్ చేశారు.
కేటీఆర్ గారు సమాధానం చెప్పి రండి…
బుధవారం కరీంనగర్ రానున్న మంత్రి కేటీఆర్ ప్రజలకు తన ప్రశ్నలకు సమాధానలు చెప్పిన తరువాతే ప్రచారం చేసేందుకు రావాలని ఏఐఎఫ్ బి అభ్యర్థి అంబటి జోజిరెడ్డి డిమాండ్ చేశారు. ప్రధానంగా కరీంనగర్ నగరానికి శోభాయమానమని చెప్తున్న తీగల వంతెన నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలు ఇచ్చారని, దీంతో ఈ వంతెనపై పగుళ్లు బారి అందరికీ కనిపిస్తున్నా పైపై మెరుగులు దిద్దుతూ కాలం వెల్లదీస్తున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. గతంలో వంతెన అప్రోచ్ రోడ్డుపై పగుళ్లు తేలాయని, సైడ్ వాల్స్ పగిలిపోయాయని వెలుగులోకి తీసుకవస్తే సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్ష పార్టీల వారిని ఇష్టారీతిన దూషించారని, క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాలేదని చెప్తున్న అధికార పార్టీ నాయకులు మరోసారి తీగల వంతెన పరిస్థితి ఎలా తయారైందో గమనించాలని కోరారు. వందల కోట్లు ఖర్చు చేసిన తీగల వంతెన ప్రారంభించి ఏడాది తిరగకముందే ఎందుకు శిథిలమై పోతోంది..? ఇందుకు బాధ్యులు ఎవరూ అన్న విషయంపై మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అక్రమాలకు తెరలేపుతూ నిర్మాణాల్లో శాస్త్రీయత లేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందన్న విషయం గుర్తు పెట్టుకోవాలని జోజిరెడ్డి అన్నారు. అలాగే కరీంనగర్ మైనార్టీ సమూహానికి సంబంధించిన వక్ఫ్ బోర్డు ఆస్తుల ఆక్రమణ విషయంలోనూ మంత్రి కేటీఆర్ తమ వైఖరి ఏంటో వెలిబుచ్చాల్సిన అవసరం ఉందన్నారు. ఖాజీపూర్ లోని వక్ఫ్ బోర్డు భూమిని మంత్రి గంగుల కమలాకర్ గారు ఫేక్ డ్యాక్యూమెంట్లతో లావాదేవీలు జరిపి కొనుగోలు చేసినట్టుగా చూపిస్తున్నది వాస్తవమా కాదా? వక్ఫ్ బోర్డు పరిధిలోని ఈ భూమికి సంబంధించిన ట్రాంజక్షన్స్ నిలిపివేయాలని కోరుతూ మైనార్టీ అధికారులు లేఖలు రాసింది నిజమా కాదా..? ఈ భూమిపై మంత్రి గంగుల కమలాకర్ ప్రభుత్వంలో ప్రతినిధిగా ఉంటూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా హై కోర్టును ఆశ్రయించింది నిజమా కాదా..? మరో వైపున గంగుల కమలాకర్ స్వాధీనం చేసుకున్న భూమి సర్వే నెంబర్లను వక్ఫ్ బోర్టు ఆస్తుల జాబితా నుండి తొలగించాలని కోరుతూ లేఖ రాసింది వాస్తవమా కాదా అన్న విషయాలను మంత్రి కేటీఆర్ కరీంనగర్ ప్రజలకు వివరించాలని అంబటి జోజిరెడ్డి డిమాండ్ చేశారు. మంత్రి గంగుల కమలాకర్ గారి ఆధీనంలో ఉన్న ఆ భూమి ఎవరిదో మంత్రి కేటీఆర్ గారు తేల్చి చెప్పి కరీంనగర్ సమాజానికి వాస్తవాలను వివరించి ఇందుకు సంబంధించిన డాక్యూమెంట్లను కూడా చూపించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ లో పెద్ద ఎత్తున ఉన్న మైనార్టీ సోదరుల ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు కుట్రలకు తెరలేపిన మంత్రి గంగుల కమలాకర్ గారి వ్యవహారాన్ని మీరు ఒప్పుకుంటున్నట్టయితే మీకు మైనార్టీలపై ఎలాంటి ప్రేమ లేదని భావించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. మరో వైపున బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల రాజకీయాల కోసం వాడుకుంటున్న తీగలగుట్టపల్లి రైల్వే ఫ్లై ఓవర్ విషయంలో కూడా మంత్రి కేటీఆర్ గారు ఇక్కడి సమాజానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఆర్వోబీని రీ డిజైన్ చేయడానికి కారణాలు ఏంటీ..? కమర్షియల్ ప్రాంతం ఉన్న కరీంనగర్ వైపునకు ఎక్కువ శాతం నిర్మాణం చేపట్టాలని, నాన్ కమర్షియల్ ఏరియాగా ఉన్న తీగలగుట్టపల్లి ప్రాంతం వైపు తక్కువ దూరం నిర్మాణం చేయాలని ప్రతిపాదనలు చేయడానికి కారణం ఏంటో కరీంనగర్ ప్రజలకు వివరించాల్సిన అవసరం మంత్రి కేటీఆర్ పై ఉందన్నారు. తీగలగుట్టపల్లిలో ఉన్న కేసీఆర్ ఫాం హౌజ్ కోసం ఈ వంతెనను రీ డిజైన్ చేశారా లేక, మరేదైనా కారణం ఉందా కరీంనగర్ ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. వంతెన వెడల్పు చేయడానికి కారణమేంటీ..? ఇక్కడ నిర్మాణాలు జరుపుకున్న వారి పొట్ట కొట్టేందుకా లేక, మీ మంత్రి గంగుల కమలాకర్ గారి బంధువుల గ్రానైట్ లారీల రాకపోకలు సులువుగా ఉండేందుకా అన్న విషయంపై కూడా క్లారిటీ ఇవ్వాలని జోజిరెడ్డి కోరారు. కరీంనగర్ లో జరిగే బహిరంగ సభకు హాజరవుతున్న మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఈ అంశాలపై సమగ్రంగా కరీంనగర్ ప్రజలకు వివరించిన తరువాతే ఇక్కడి బీఆర్ఎస్ అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేయాలని అంబటి జోజిరెడ్డి సూచించారు.