కేంద్రం అలా…రాష్ట్రం ఇలా…

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్య సయోధ్య లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సంబంధం ఉన్న వారిని లక్ష్యంగా చేసుకోగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధాలు ఉన్నా వారిని టార్గెట్ చేసుకున్నట్టగా మారిపోయింది. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తుంటే బీజేపీ, టీఆరెఎస్ మధ్య ప్రచ్ఛన్న యుద్దమే జరుగుతున్నట్టుగా మారిపోయింది. నిన్న మొన్నటి వరకు చట్టాపట్టాల్ వేసుకుని తిరిగిన రెండు పార్టీలు ఎడ మొఖం పెడ మొఖం పెట్టుకుని ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకుంటున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరిస్థితి ఎలా ఉందంటే పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్న రీతిలో వ్యవహరిస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఎటు వైపు నుండి ఏ ఉపధృవం ముంచుకొస్తుందోనన్న ఆందోళన రెండు పార్టీల నాయకుల్లో నెలకొంది.

ఈడీ… ఐటీ…

రాష్ట్రంలో ఆర్థిక నేరాలకు పాల్పడ్డ వారే టార్గెట్ గా జాతీయ దర్యాప్తు సంస్థలు ముందుకు సాగుతున్నాయి. లిక్కర్ స్కాంతో మొదలైన ప్రస్థానం ఇప్పుడు గ్రానైట్ తో పాటు ఇతరాత్రా వ్యాపారాలతో సంబంధం ఉన్నవారిపై కొరడా ఝులిపించడం మొదలు పెట్టింది. లిక్కర్ స్కాంలో ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్న అధికారులు ఇప్పుడు ఐటీ దాడులకు కూడా పూనుకుంటున్నారు. కేంద్రం నుండి వస్తున్న ప్రత్యేక బృందాలు రాష్ట్రంపై ప్రత్యేక నిఘా వేశారా అన్నట్టుగా సాగుతోంది. గత సంవత్సరం హెటిరోపై దాడులు, ఈ ఏడాది రాజకీయాలతో సంబంధం ఉన్న సంస్థలు, వ్యాపారులపై దాడులు సాగుతుండడం గమనార్హం. దీంతో ఎప్పుడు ఏ నేతలు కేంద్ర దర్యాప్తు సంస్థలకు చిక్కుతారోనన్న చర్చ మొదలైంది. మునుగోడు ఎన్నికల్లో మంత్రి జగదీశ్వర్ రెడ్డి పీఏ ఇంట్లో ఐటీ సోదాలు చేయగా, ఆ తరువాత రాష్ట్ర మంత్రి గంగుల ఇంట్లో దాడులు జరిగాయి. 2013లో వెలుగులోకి వచ్చిన గ్రానైట్ సీనరేజ్ దారి మళ్లింపుపై ఇటీవల కాలంలో కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదుల వెల్లువ సాగింది. దీంతో గ్రానైట్ వ్యాపారంతో సంబంధం ఉన్న మంత్రి గంగుల కుటుంబం నిర్వహిస్తున్న శ్వేత ఏజన్సీన్, శ్వేత గ్రానైట్స్ తో పాటు పలు గ్రానైట్ వ్యాపారుల ఇళ్లలో దాడులు చేసి రికార్డులు, హార్డ్ డిస్క్ లు సీజ్ చేసుకున్నాయి ఈడీ, ఐటీ బృందాలు. ఓ వైపున గ్రానైల్ వ్యాపారులపై సాగుతున్న నిఘా కొనసాగుతుండగానే మరో వైపున రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బంధువు ఇంట్లో ఐటీ అధికారుల బృందం సోదాలు చేస్తోంది.

కమల్ ఫైల్స్…

ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం వ్యవహార శైలిని ఎండగట్టే విషయంలో ఏ మాత్రం వెనుకంజ వేయడం లేదు. ప్రత్యామ్యాయ ఫ్రంట్ ఏర్పాటుతో పాటు టీఆరెఎస్ పార్టీని బీఆరెఎస్ పార్టీగా ప్రకటించి జాతీయ స్థాయి రాజకీయాలు నెరిపే పనిలో బిజీగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ లక్ష్యంగానే పావులు కదుపుతున్నారు. అయితే ఇంతకాలం బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఇతర పార్టీల నాయకుల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేసిన కేసీఆర్ కు అందివచ్చిన అవకాశం కమల్ ఫైల్స్ అని చెప్పొచ్చు. మోయినాబాద్ ఫాం హౌజ్ లో టీఆరెఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి బీజేపీ తెరలేపిందని ఈ కుట్రను భగ్నం చేశామని తెలంగాణ పోలీసులు ప్రకటించారు. తెలంగాణా ప్రభుత్వాన్ని కూలదోసి బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు వ్యూహ రచన చేసిందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. ఇందుకు ఒక్కో అధారాన్ని వెలుగులోకి తెస్తూ రాష్ట్ర బీజేపీ నాయకులను ఇరుకున పెట్టే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అయితే తెలంగాణలో మరో కొత్త ఎత్తుగడ కూడా స్టార్ట్ అయినట్టుగా స్పష్టం అవుతోంది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ చేస్తున్న దాడులకు అధికారికంగా కౌంటర్ ఇచ్చే ప్రక్రియకు కూడా శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా జీఎస్టీ అధికారుల దాడులు చేయడం ఆరంభం అయింది. సోమవారం మద్యాహ్నం నుండి మునుగోడు బీజేపీ అభ్యర్థి సుశి ఇన్ ఫ్రాలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 20 మంది జీఎస్టీ అధికారులు సోదాలు చేపట్టారు. ఎలాంటి అవకాశం చిక్కినా బీజేపీ నాయకులను ఇరుకున పెట్టే స్కెచ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేసే యోచనలో ఉన్నట్టు ఈ చర్యలు తేటతెల్లం చేస్తున్నాయి.

ప్రతీకారమేనా…?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నడుపుతున్న పార్టీలు వ్యవహరిస్తున్న తీరు ప్రతికారం తీర్చుకునే విధంగా ఉన్నాయన్న చర్చలు కూడా సాగుతున్నాయి. ఈ ఛర్యలతో తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవాలన్న తపన ఇరు పార్టీల్లోనూ కనిపిస్తోందన్నది వాస్తవం. కేంద్ర ప్రభుత్వం టీఆరెఎస్ లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరయినా, బీజేపీని ఇరుకున పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరయినా రెండు పార్టీల నాయకుల ప్రతికారేచ్ఛను వ్యక్తికరిస్తున్నట్టుగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇరు పార్టీల నాయకుల్లో ఇది తమ విజయం అన్న ధీమా వ్యక్తం అవుతున్నప్పటికీ సామాన్య జనంలో మాత్రం వారి ఆంతరంగిక గొడవలే ఇంత దూరం తీసుకొచ్చాయేమోనన్న చర్చ కొన్ని వర్గాల్లో సాగుతోంది. కానీ ఇరు పార్టీలు కూడా తమ బలాన్ని పెంచుకునే దిశగా పావులు కదుపుతున్నాయే తప్ప ప్రజా సంక్షేమం కోసం మాత్రం కాదని అంటున్న వారూ లేకపోలేదు.

నమ్ముతున్నారా..?

కొందరి వాదన అలా ఉంటే మరికొందరి వాదన మరోలా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓ ప్రణాళికా ప్రకారం గేమ్ స్టార్ట్ చేశాయని, కాంగ్రెస్ పార్టీ నామరూపాల్లేకుండా చేయాలన్న లక్ష్యంతోనే గొడవలకు దిగుతూ కొత్త రాద్దాంతాలను సృష్టిస్తున్నాయని అంటున్న వారూ లేకపోలేదు. కమలం, కారు మద్య జరుగుతున్న ఈ గొడవల్లో కాంగ్రెస్ పార్టీ ఉనికి గణనీయంగా తగ్గిపోతుందని, సామాన్య ప్రజలు ఈ రెండు పార్టీల గురించే ఆలోచించడం వల్ల కాంగ్రెస్ ఓటు బ్యాంకు లేకుండా చేయాలన్న లక్ష్యంతో వ్యవహరిస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నవారూ ఉన్నారు. ఇలాంటి చర్చలు కూడా ఆ నోట ఈ నోట సామాన్యుల దరి చేరే అవకాశం లేకపోలేదు. ఇదే నిజమని సగటు ఓటరు నమ్మినట్టయితే రెండు పార్టీల వ్యూహాలు కూడా బెడిసికొట్టే ప్రమాదమూ లేకపోలేదు. సమాచార వ్యవస్థ అంతంతే ఉన్ననాడు ప్రధాన మీడియా వేదిక మాత్రమే వార్తలు, వాటి వెనక దాగి ఉన్న కోణాలను వెలుగులోకి తెచ్చేవి. కానీ ఇప్పుడు సోషల్ మీడియానే ప్రధాన మీడియా కంటే దూకుడుగా ప్రజల్లోకి చొచ్చుకపోయింది. అన్ని పార్టీలు కూడా సోషల్ మీడియాపైనే ఆధారపడి ప్రచారాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీల వ్యవహారాలన్ని ప్రజల్లోకి వెల్లినప్పుడు వాస్తవాలు అవాస్తవాలు ఏమిటి అనేవి బేరీజు వేసుకునే పరిస్థితి సగటు పౌరునికి కూడా ఉంటుందన్నది నిజం.

You cannot copy content of this page