రెస్క్యూ ఆపరేషన్ సాగిందిలా…

దిశ దశ, ఒడిషా:

ఒడిషా రైలు ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. ప్రమాదంలో చిక్కుకున్న వారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు భారీ రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. ఒడిషాలోని బాలేశ్వర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో క్షతగాత్రులను రక్షించేందుకు విపత్తు నిర్వహణ యంత్రాంగం, వైద్య బృందాలు, అంబులెన్సులతో పాటు వివిధ విభాగాలు కార్యరంగంలోకి దూకాయి. భారత సైన్యం , వాయుసేన బృందాలు కూడా రంగంలోకి దిగి సహాయక చర్యలకు పూనుకున్నాయి. ప్రమాద స్థలికి చేరుకున్న ఆయా విభాగాలన్ని కూడా రెస్క్యూ ఆపరేషన్ చేసేందుకు చకచకా స్పందించాయి. రెస్క్యూ ఆపరేషన్ కారణంగా శనివారం మధ్యాహ్నం వరకు ఘటనా స్థలం నుండి అందరిని తరలించగలిగామని రైల్వే అధికారులు చెప్పారు.

ఆపరేషన్ సాగిన తీరు…

బెంగళూరు- హావ్‌డా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, షాలిమార్‌-చెన్నై సెంట్రల్‌ కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లతో పాటు ఓ గూడ్స్‌ రైలు ఒకేచోట ప్రమాదానికి గురయ్యాయి. ఒడిషా రాజధాని భువనేశ్వర్‌కు 170 కి.మీ, కోల్‌కతాకు 250 కి.మీ దూరంలోని బాలేశ్వర్‌ జిల్లాలో శుక్రవారం సాయంత్రం 6.55 గంటలకు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సమాచారం అందిన వెంటనే జాతీయ విపత్తు బృందాలు రంగంలోకి దిగాయి. రాత్రి 8.30 గంటల కల్లా బాలేశ్వర్‌ కు తొలి రెస్క్యూ టీం చేరుకుంది. ఆ తరువాత కటక్‌, కోల్‌కతాల నుండి మరిన్ని బృందాలు చేరుకుని సహాయక చర్యల్లో నిమగ్నం అయ్యాయి. 300 మంది ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్టీఆర్‌ఎఫ్‌ సిబ్బంది తొమ్మిది బృదాలుగా ఏర్పడి ఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. ప్రాణాలతో ఉన్నవారిని గుర్తించి వారిని క్షేమంగా బయటకు తీసుకురాగా అక్కడికి చేరుకున్న వైద్య బృందాలు ప్రయాణీకులకు ప్రాథమిక చికిత్స అందించింది. ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాల్సిన వారిని గుర్తించి వెంట వెంటనే అంబూలెన్స్ ల ద్వారా దవఖానలకు తరలించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ జాగిలాలు, మహిళా సిబ్బందితో అందించిన సేవలకు తోడు భారీ క్రేన్లు, గ్యాస్‌, ప్లాస్మా కటింగ్ యంత్రాలతో రైలు కోచ్‌లను విడదీస్తూ వాటి మధ్యన ఇరుక్కుపోయిన వారిని ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించాయి. ఘటనా స్థలం నుండి వారిని లిఫ్టింగ్‌ ప్యాడ్‌లతో ట్రాక్ బయటకు తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. రైల్వే కోచ్‌లలో ఇరుక్కుపోయిన 44 మంది బాధితులను రక్షించడంతోపాటు 71 మృతదేహాలను ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు బయటకు తీసాయి. ఘటనా స్థలం వద్ద 200 అంబూలెన్సులు, 50 బస్సులు, 45 మొబైల్ ఆరోగ్య కేంద్రాలను హుటాహుటిన ఏర్పాటు చేశారు. వివిధ విభాగాలకు చెందిన 1200 మంది రెస్క్యూ టీమ్ సభ్యులు ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. కటక్ నుండి 25 వైద్య బృందాలు, ఇతర ప్రాంతాలకు చెందిన 50 మంది వైద్యులు రెలు ప్రమాద బాధితులకు సేవలందించారు. ఫోరెన్సిక్ నిపుణులు, భారత వాయుసేన బృందాలు, రెండు ఎంఐ ఎయిర్ ఫోర్స్ హెలిక్యాప్టర్లు, రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో సేవలందించాయి. భారీ ప్రమాదాలు సంభవించినప్పుడు రెస్క్యూ ఆపరేషన్ ఎలా నిర్వహించాలి అన్న విషయాలపై బృందాల సభ్యులకు సుశిక్షతమైన శిక్షణ ఇచ్చామని ఎన్టీఆర్ డైరక్టర్ జనరల్ అతుల్ కార్వాల్ తెలిపారు. ప్రాక్టికల్ నాలెడ్జి కోసం ఈ ఏడాదిలో 55 సార్లు మాక్ డ్రిల్ నిర్వహించామన్నారు. ఇలాంటి అవగాహనతో కూడిన శిక్షణలో తమ టీమ్ ను తర్ఫీదు చేయడం వల్లే సత్వర సేవలు అందించగలిగామన్నారు.

You cannot copy content of this page