సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్
దిశ దశ. దండకారణ్యం:
మహారాష్ట్రలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మంగళవారం తెల్లవారు జామున జరిగినట్టుగా తెలుస్తున్న ఈ ఘటనలో నలుగురు మావోయిస్టు పార్టీ నక్సల్స్ చనిపోగా భారీగా ఆయుధాలు దొరికినట్టుగా సమాచారం. ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి… మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా రేపన్ పల్లికి సౌత్ ఈస్ట్ ప్రాంతంలోని 5 కిలోమీటర్ల దూరంలోగల కొలమార్క గుట్టల్లో మంగళవారం తెల్లవారు జామున ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ప్రాంతంలో మావోయిస్టుల కార్యకలాపాలు కొనసాగుతున్నాయన్న సమాచారం అందుకున్న వెంటనే అహేరీ సబ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు చెందిన అడిషనల్ ఎస్పీ యాతీష్ దేశ్ ముఖ్ నేతృత్వంలో సీ60, సీఆర్పీఎప్ బలగాలు పెద్దఎత్తున కూంబింగ్ ఆఫరేషన్ చేపట్టాయి. తెల్లవారు జామున నక్సల్స్ డెన్ ఏర్పాటు చేసుకున్న కొలమార్క గుట్టల వద్దకు చేరుకున్న బలగాలను గమనించడంతో ఎదురు కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో తెలంగాణలోని మంగి, ఇంద్రవెల్లి ఏరియా కమిటీ కార్యదర్శి, కొమురం భీం, మంచిర్యాల డివిజన్ కమిటీ సభ్యుడు వర్గీస్,, సిర్పూర్ చెన్నూరు ఏరియా కమిటీ కార్యదర్శి మగ్తూ, ప్లాటూన్ మెంబర్లు కుర్సంగి రాజు, కుడిమెట్ట వెంకటేష్ లు మరణించారు. ఘటనా స్థలం నుండి 1 ఏకే 47, ఒక కార్బైన్, ఒక కంట్రీమేడ్ పిస్టల్, మావోయిస్టులకు సంబంధించిన సాహిత్యం, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలం నుండి మరికొంత మంది నక్సల్స్ తప్పించుకుని ఉంటారని పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నారు. కొలమార్క గుట్టలతో పాటు సమీపంలోని అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ ఆపరేషన్లను మరింత ముమ్మరం చేశారు.
లోకసభ ఎన్నికల నేపథ్యంలో…
లోకసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో సరిహధ్దు అటవీ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకోవడంతో సరిహద్దు అటవీ ప్రాంతం ఉలిక్కిపడింది. కొలమార్క గుట్టల్లో ఎదురు కాల్పుల ఘటనతో సరిహద్దు ప్రాంతాల్లో హై అలెర్ట్ గా వ్యవహరిస్తున్నారు పోలీసులు.