ఎగువన వెల వెల… దిగువన కళ కళ…

గోదావరిలో వరద ఉధృతి తీరు…

దిశ దశ, హైదరాబాద్:

తెలంగాణ మీదుగా ప్రవహిస్తున్న గోదావరి నదిలో వరధ ఉధృతి అంతంత మాత్రంగానే కొనసాగుతోంది. అయితే దిగువ ప్రాంతంలో ఉప నదుల నుండి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో క్రమక్రమంగా నీటి మట్టం పెరుగుతోంది. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నది పొంగిపొర్లుతోంది. తెలంగాణలోని నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల మీదుగా ప్రవహిస్తున్న గోదావరి నదిలో నీరు లేక బోసిపోయినట్టుగానే కనిపిస్తోంది. ఆదివారం రాత్రి వరకు వరద ఆదిలాబాద్ జిల్లా మీదుగా వచ్చే వరద నీరు కడెం ప్రాజెక్టుకు మరింత చేరితే మాత్రం గేట్లు ఎత్తే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడి నుండి పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లికి వరద నీరు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు నామమాత్రంగానే వస్తోంది. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తినప్పటికీ భారీ వరద మాత్రం రావడం లేదు. దీంతో ఆదివారం సాయంత్రం వరకు ఈ ప్రాజెక్టుకు 18,518 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా 19.693 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. 90 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఎస్సారెస్పీకి భారీగా వరద నీరు వచ్చి చేరినా ఇప్పట్లో మాత్రం గేట్లు ఎత్తే అవకాశం అయితే కనిపించడం లేదు. దీంతో దిగువ ప్రాంతమైన జగిత్యాల, ధర్మపురి, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఎస్సారెస్పీ ద్వారా వరద నీరు రావడం లేదు. మరో వైపున కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు సామర్థ్యం 7.603 టీఎంసీలు కాగా ఇన్ ఫ్లో 1017 క్యూసెక్కులు ఉండగా మూడు గేట్లు ఎత్తి దిగువకు 14, 453 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 7.8779 టీఎంసీల నీరు మాత్రమే నిలువ ఉంది. ఎగువ ప్రాంతం నుండి ఇన్ ఫ్లో 14,333 క్యూసెక్కుల నీరు మాత్రమే వచ్చి చేరుతోంది. గోదావరిఖనికి దిగువన ఉన్న సుందిళ్ల పార్వతి బ్యారేజీ 8.83 టీఎంసీల సామర్థ్యం కాగా దిగువ ప్రాంతానికి వచ్చిన నీటిని వదిలేస్తున్నారు అధికారులు. ఇక్కడికి ఇన్ ఫ్లో 5429 క్యూసెక్కుల వరద నీరు వస్తోందని అధికారులు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అన్నారం సరస్వతి బ్యారేజీకి 16,600 క్యూసెక్కుల నీరు ఎగువ ప్రాంతం నుండి వచ్చి చేరుతుండగా మొత్తం నీటిని దిగువకు వదిలేస్తున్నారు. మహదేవపూర్ మండలం మేడిగడ్డ వద్దకు వచ్చేసరికి మాత్రం పరిస్థితి మారిపోయింది. మహారాష్ట, తెలంగాణ సరిహద్దుల మీదుగా ప్రవహిస్తున్న కాళేశ్వరం వద్ద గోదావరి నదిలో కలుస్తున్న ప్రాణహిత నదిలో ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. దీంతో మేడిగడ్డ బ్యారేజీ వద్దకు వరద పోటు తీవ్ర రూపం దాల్చుతోంది. శనివారం 3,73,500 క్యూసెక్కుల వరద నీరు రాగా… ఆదివారం రాత్రి 9 గంటల  వరకు తీవ్రంగా పెరిగిపోయింది. 6,07,700 క్యూసెక్కుల నీరు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ వద్దకు వచ్చి చేరుతోంది. ప్రాణహిత నది పొంగిపొర్లుతున్న కారణంగానే ఇక్కడ వరద నీరు భారీగా వచ్చి చేరుతోందని స్పష్టం అవుతోంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులోని సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలకు వచ్చి చేరుతున్న నీటిని దిగువకు వదిలేయాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆదేశించడంతో మూడు బ్యారేజీల గేట్లు కూడా ఎత్తి ఉంచారు అధికారులు. దీంతో ఇక్కడకు వచ్చి చేరుతున్న నీరు అంతా కూడా దిగువకు వెల్లిపోతోంది. చత్తీస్ గడ్, మహారాష్ట్రల మీదుగా ప్రవహిస్తున్న ఇంద్రావతి నది నీరు పలిమెల మండలం దమ్మూరు వద్ద కలుస్తోంది. దీంతో పాటు ఇతర క్యాచ్ మెంట్ ఏరియాల నీరు అంతా కూడా ములుగు జిల్లాలోని తుపాకుల గూడెం సమ్మక్క సారలక్క బ్యారేజీకి చేరుతోంది.ఈ బ్యారేజీ గేట్లు ఎత్తడంతో పాటు, వాజేడు మండలం పాలెం వాగు గేట్లు కూడా ఎత్తారు. దీంతో పాటు చత్తీస్ గడ్ నుండి ప్రవహిస్తున్న మరో నది శబరి కూడా పొంగిపొర్లుతోంది. దీంతో భద్రాద్రి కొత్తగూడెం భద్రాచలం వద్దకు వరద పొటెత్తిపోతోంది. భద్రాచలం వద్ద ఆదివారం రాత్రి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ఆదివారం రాత్రం 9 గంటల వరకు ఇక్కడ 44 ఫీట్ల ఎత్తున నీరు ప్రవహిస్తుండగా, ఇక్కడి నుండి 9,77,666 క్యూసెక్కుల నీరు డిఛ్చార్జ్ అవుతోంది. ప్రాణహిత, ఇంద్రావతి, శబరి నదుల ప్రవాహం మరింత పెరిగితే తెల్లవారే సారికే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. మరో 4 ఫీట్ల వరకు వరద నీరు వస్తే 48 అడుగులకు చేరగానే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. 

You cannot copy content of this page