డీలర్ల కేంద్రీకృతంగానే వ్యాపారం… బ్రోకర్ల చేతికి రేషన్ బియ్యం…

దిశ దశ, దండకారణ్యం:

నదుల పరవళ్లను మించి పోయిందక్కడ స్మగ్లింగ్ దందా… లక్షల టీఎంసీల్లో నీరు సముద్రంలో కలిసినట్టే టన్నుల కొద్ది సబ్సీడీ బియ్యం అవతలకు చేరుతున్నాయి. అడిగేవారు లేరు… అభ్యంతరాలు చెప్పే వారు అంతకన్నా లేరు… చెక్ పోస్టుల కళ్లకు గంతలు కట్టేసి మరీ రేషన్ బియ్యం పొరుగు రాష్ట్రానికి తరలించుకపోతున్నారు. సివిల్ సప్లై విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు నామమాత్రపు దాడులతోనే సరిపెడ్తారా… సరిహద్దులపై నిఘాను కట్టుదిట్టం చేస్తారా అన్న చర్చే సాగుతోంది.

ఛానెల్స్ ఈ విధంగా…

బియ్యం అక్రమ దందాకు ఎంచుకున్న మార్గాలు మాత్రం అత్యంత విచిత్రంగా ఉన్నాయి. పేదలకు సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన రేషన్ షాపుల కేంద్రంగానే బియ్యం క్రయవిక్రయాలు సాగుతున్నట్టు నిఘా వర్గాల విచారణలో తేలింది. ఉచిత బియ్యం కావడంతో చాలామంది లబ్దిదారులకు కిలోకు రూ. 8 నుండి 10 రూపాయల డబ్బులు చెల్లించి డీలర్లు అక్రమ దందాకు కేంద్రబిందువుగా మారినట్టుగా తెలుస్తోంది. అక్కడి నుండి బడా వ్యాపారికి సంబంధించిన బ్రోకర్ వద్దకు బియ్యం చేరుకోగానే అక్కడ కిలోకు రూ. 11 నుండి 14 రూపాయల మేర చెల్లిస్తారు. వీరితో పాటు మరో చానెల్ కూడా ఈ వ్యవహారంలో ఏర్పటయినట్టుగా సమాచారం. ఇండ్ల నుండి రేషన్ బియ్యం సేకరించేందుకు కూడా కొంతమంది ఈ దందాలో భాగస్వాములు అవుతుంటారు. అయితే వీరంతా కూడా బడా వ్యాపారికి సంబంధించిన కీలకమైన ఏజంటుకు మాత్రమే బియ్యాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. వీరికి మార్కెట్ కిలోకు రూ. రూపాయి వరకు గిట్టుబాటు అయ్యే విధంగా ధర నిర్ణయించారు. ఛోటా మోటా బియ్యం దందా చేసే వాళ్లు నేరుగా వ్యాపారి వద్దకు వెల్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బియ్యాన్ని కొనుగోలు చేయరు. వారు ఎంచుకున్న ఏజంట్ల ద్వారా మాత్రమే ధాన్యం సేకరిస్తారు. ఇలా భారీ నెట్ వర్క్ ఏర్పాటు చేసుకున్న బియ్యం వ్యాపారులు ప్రతి నెల సబ్సీడీ బియ్యం అందించే సమయంలో టన్నుల కొద్ది లావాదేవీలు సాగిస్తున్నట్టుగా గుర్తించారు. టన్నుల కొద్ది బియ్యం రవాణా అవుతూ సిరొంచకు చేరుకుని అక్కడి నుండి సన్న బియ్యంగా రూపాంతరం చెంది మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు తరలి వెల్తున్నాయి. మహారాష్ట్రలో ట్రేడ్ లైసెన్స్ ఉన్న వ్యాపారి బియ్యం వ్యాపారం చేసేందుకు అవసరమైన వే బిల్లులు కూడా ట్రేడ్ లైసెన్స్ ద్వారా ఇచ్చే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఇదు అదనుగా మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతమంతా కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రేషన్ బియ్యం దందా దర్జాగా సాగిస్తున్నట్టుగా నిఘా వర్గాలు సమాచారం అందుకున్నాయి.

You cannot copy content of this page