వైరల్ అవుతున్న లారీ ఓనర్స్ అసోసియేషన్ లేఖ
దిశ దశ, భూపాలపల్లి:
రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కాంట్రాక్టర్లకు వరంగా మారిన ఇసుక వ్యాపారంలో భారీ స్కాం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. సర్కారు అనుమతికి మించి ఓవర్ లోడ్ విధానంతో ఇసుక అక్రమ రవాణా సాగుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా లారీ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన లేఖతో అసలు గుట్టు రట్టయింది. ఇందుకు సంబంధించిన లేఖ వైరల్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇసుక క్వారీల్లో ఓవర్ లోడ్ విధానంతో అవలంభించడం వల్ల రోజుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 2 కోట్ల 30 లక్షల 72 వేల ఆదాయాన్ని నష్టపోతోందని అందులో పేర్కొనడం సంచలనంగా మారింది.
ఎలా అంటే..?
తెలంగాణ మినరల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ (TGMDC) ద్వారా ఇసుక కొనుగోలు చేసేందుకు ఆన్ లైన్ లో బుక్ చేసుకోవల్సి ఉంటుంది. లారీల వివరాలతో పాటు అందుకు సంబంధించిన డిమాండ్ డ్రాఫ్ట్ వివరాలను వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసిన తరువాత లారీకి వే బిల్లు జారీ అవుతుంది. అయితే 14 టైర్ల లారీలో 32 టన్నుల ఇసుక, 16 టన్నుల లారీలో 45 టన్నుల ఇసుక మాత్రమే లోడ్ చేయాల్సి ఉంటుంది. TGMDCకి ఇదే లెక్కన డబ్బులు చెల్లించి లారీలు క్వారీలకు చేరుకుంటున్నాయి. అక్కడకు చేరుకున్న లారీల్లో ఓవర్ లోడ్ విదానాన్ని అమలు చేస్తున్న కాంట్రాక్టర్లు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారని ఆ లేఖలో వివరించారు. క్వారీ స్టాక్ యార్డులకు చేరుకున్న తరువాత ఒక్కో లారీకి ఎక్స్ ట్రా బకెట్ విధానంతో ఇసుక నింపుతు రూ. 2500 చొప్పున ఒక్కో లారీ నుండి రూ. 12 వేల వరకూ వసూలు చేస్తున్నారని వివరించారు. అయితే తమకు ఓవర్ లోడ్ చేయవద్దన్న లారీ వాలాలాలు వే బిల్లులు తీసుకెళ్లినా కూడా స్టాక్ యార్డుల్లో ఉన్న కాంట్రాకర్టకు సంబంధించిన వారు మాత్రం ఎక్స్ ట్రా బకెట్ పద్దతిలో ఇసుక లోడ్ చేసుకుంటేనే లోడింగ్ చేస్తామని లేనట్టయితే వే బిల్లు అనుమతి మేరకు లోడ్ చేసేది లేదని తేల్చి చెప్తున్నారని పేర్కొన్నారు. దీంతో ఇసుక లారీల యజమానులు అదనపు డబ్బు ముట్టజెప్పి ఓవర్ లోడ్ నింపుకోక తప్పనిసరి పరిస్థితులు ఎదురవుతున్నాయని లారీ అసోసియేషన్ ప్రతినిదులు వివరించారు. దీని వల్ల రోజుకు కోట్లలో ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోల్పోతోందని అసోసియేషన్ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని మోసం చేసి కోట్లు గడించిన ఇసుక కాంట్రాక్టర్ల నుండి డబ్బు రికవరీ చేయాలని కూడా అందులో అభ్యర్థించారు.
లారీలు ఎన్నంటే..?
TGMDC వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ అయిన లారీలు 42, 280 కాగా దాదాపుగా ప్రతి లారీలో కూడా ఓవర్ లోడ్ విధానం అమలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కో క్వారీలో లోడింగ్ చేసుకుంటున్న లారీలు ఎన్ని..? వాటి ద్వారా ఎంత మేర ఇసుక రవాణా అవుతోంది అన్న లెక్కలు తేల్చినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయిలో ఆదాయాన్ని కోల్పోతుందో స్పష్టం కానుంది. తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు CMO, రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు, మైన్స్ ఉన్నతాధికారులకు ఈ లేఖలు అందజేసినట్టుగా తెలుస్తోంది. లారీ అసోసియేషన్ ప్రతినిధులు ఇచ్చిన ఈ లేఖతో రాష్ట్ర ప్రభుత్వం క్వారీల్లోని స్టాక్ యార్డులపై ఏసీబీ, విజిలెన్స్ విభాగాలతో పాటు ఇతరాత్ర సాంకేతిక అధికార యంత్రాంగం ద్వారా దర్యాప్తు చేసినట్టయితే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని వందల కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందో లెక్క తేలే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.