ఇప్పుడు భారత దేశంలో ఈ నెంబర్ కు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. గద్దెనెక్కాలంటే అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కు చేరుకోవాలంటే ఆ నెంబర్ చుట్టే డీల్ సాగుతోందన్న ప్రచారం జరుగుతోంది. వంద కోట్లు అనే పదం తమ మూడు నెలలుగా బీజేపీ, టీఆర్ఎస్, ఆప్ నాయకుల నోళ్లలో నానుతోంది.
బీజేపీ @100 కోట్లు
ప్రజా ప్రతినిదుల కొనుగోళ్ల వ్యవహారంలో మరో అంశం తెరపైకి వచ్చింది. ఢిల్లీ మునిసిపల్ కార్పోరేషన్ కార్పోరేటర్లను కొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని తాజాగా ఆప్ ఆరోపిస్తోంది. ఇటీవల తెలంగాణ ఎమ్యెల్యేల కొనుగోలు వ్యవహారంలో రూ. 100 కోట్ల డీల్ తో బీజేపీ ఆఫర్ ఇచ్చిందని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఫాం హౌజ్ ఫైల్స్ లో, ఢిల్లీ ఎంసీడీ ఫైల్స్ లోనూ బీజేపీ రూ. 100 కోట్లు ఇస్తామని ఎర వేయడం గమనార్హం.
సెంటిమెంటా…?
ఇతర పార్టీల ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేసేందుకు బీజేపీ వంద కోట్లు ఆఫర్ ఇస్తుండడం వెనక ఆ పార్టీకి సెంటిమెంట్ ఏమైనా ఉందా అన్న చర్చ సాగుతోంది. చట్టసభలకు ఎన్నికైన ఎమ్మెల్యేలను కొనాలన్నా, స్థానిక సంస్థల్లో భాగమైన కార్పోరేషన్ ప్రతినిధులను కొనాలన్న బీజేపీ రూ. 100 కోట్లు డీల్ కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నదంటూ వస్తున్న ఆరోపణలు విచిత్రంగానే ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీల నుండి గెలిచిన వారిపై కాషాయ కండువా కప్పేందుకు కషాయం లాంటి విషయం చిమ్ముతున్నదని ఈ సంఘటనల ద్వారా ప్రత్యర్థి పార్టీలు ప్రచారం చేస్తున్నప్పటికీ అన్ని చోట్లా ఒకే పాట పాడుతుండడం విచిత్రంగా ఉంది.
హర్ ఏక్ మాల్…
బల్క్ సేల్స్ కోసం చిరు వ్యాపారులు బజార్ ఏర్పాటు చేసి హర్ ఏక్ మాల్ సౌ రూపయా అన్నట్టుగా బీజేపీ నేతలు ఎవరిని కొన్న రూ. 100 కోట్లు ఇస్తామంటూ బంపర్ ఆఫర్ ఇవ్వడం ఏంటన్నదే అంతుచిక్కకుండా పోతోంది. ఎవరికి కొన్న వంద కోట్లు ఇవ్వాలనేది బీజేపీ ఆనవాయితీగా మారిందా లేక దీని వెనక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో డిస్కషన్ జరుగుతోంది. తెలంగాణ ఎమ్మెల్యేలకు వంద కోట్లే, ఢిల్లీ కార్పోరేటర్లకు వంద కోట్లే ఇస్తామనం ఏంటీ దీని వెనక లాజిక్ ఏమైనా ఉందా ఏంటని అనకుంటున్న వారూ లేకపోలేదు.
కవితపై వస్తున్న ఆరోపణలూ…
మరో వైపున ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవితపై కూడా బీజేపీ ఆరోపణలు చేసింది. లిక్కర్ దందాలో కవితతో రూ. 100 కోట్ల డీల్ జరిగిందని బీజేపీ నాయకులు ఆరోపణలు చేశారు. లక్షల కోట్ల స్కాంలో కవిత కూడా రూ. వంద కోట్ల డీల్ ఏంటోనన్నది మిస్టరీగానే మారిపోయింది.
నాటి పచ్చనోటు…
కొన్నేళ్ల క్రితం పచ్చ నోటుకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. రూ. 100 నోటుల చాలా ప్రాంతాల్లో పచ్చనోటు అని పిలిచేవారు. ఇప్పటికీ అదే వంద అనే పదం మాత్రం పదిలంగానే ఉన్న విలువ మాత్రం మారింది. నాటు వంద రూపాయలను కామన్ గా మాట్లాడే పరిస్థితి నుండి నేడు వంద కోట్లు అని మాట్లాడే పరిస్థితి చేరుకున్నట్టుగా ఉంది. అయితే ఇందులో 100 మాత్రం ముఖ్య భూమిక పోషిస్తుండడం గమనార్హం.