దిశ దశ, జగిత్యాల:
ఎన్నికల కమిషన్ తో పాటు సామాజిక సృహ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పదే పదే ప్రచారం చేస్తున్నా… నేటికీ చాలామందిలో మాత్రం మార్పు రావడం లేదు. ఓటింగ్ లో పాల్గొనేందుకు చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టుగా స్పష్టం అవుతోంది. తాజాగా గురువారం జరిగిన పోలింగ్ సరళిని పరిశీలిస్తే మాత్రం భాగ్యనగరానికి చెందిన ఓటర్లే పోలింగ్ కు దూరంగా ఉన్నట్టుగా స్పష్టం అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 80 శాతం వరకు పోలింగ్ నమోదయితే హైదరాబాద్ లో మాత్రం దాదాపు సగం మంది ఓటర్లు నిరాసక్తత కనబర్చినట్టుగా ప్రాథమికంగా అందిన సమాచారం. అయితే ఇలాంటి ఓటర్లకు తెలంగాణాలోని ఓ శతాధిక వృద్దురాలు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. జగిత్యాల పట్టణానికి చెందిన రుక్కమ్మ (105) ఏళ్ల బామ్మ వీల్ ఛైర్ లో వచ్చి మరీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పట్టణంలోని 116వ పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్న ఈ పెద్దావిడ బహుష భారత స్వాతంత్ర్యం తరువాత జరిగిన తొలి ఎన్నికల నుండి ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎన్నికలకు హజరైన రికార్డు కూడా సొంతం చేసుకుని ఉంటారు. దేశంలో 1952లో ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పుడు కూడా రుక్కమ్మ ఓటు హక్కు వినియోగించుకుని ఉంటారని స్పష్టం అవుతోంది. మరో వైపున రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన మ్యాన వీణ లండన్ లో స్థిరపడినప్పటికీ పోలింగ్ కు హాజరు కావడం గమనార్హం.