రాజన్న జిల్లాలో సతుల స్థానంలో పతులు…

సహకార చట్టానికి తూట్లు…

నెట్టింట వైరల్ అవుతున్న ఆడియో

దిశ దశ, రాజన్న సిరిసిల్ల జిల్లా:

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరోసారి నిబంధనలకే బంధనాలు వేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతర్గతంగా జరగే సమావేశాల్లో కూడా సహకార చట్టానికి విరుద్దంగా వ్యవహరించడం విడ్డూరంగా మారింది. సాక్షాత్తు మంత్రి కేటీఆర్ ఇలాకాలోనే ఇలా సాగుతుండడం విస్మయం కల్గిస్తోంది. జిల్లాలోని పెద్దూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సమావేశం జరగగా ఈ సమావేశానికి మహిళా డైరక్టర్లు హాజరు కావల్సి ఉండగా వారికి బదులుగా భర్తలు అటెండ్ అయ్యారు. ప్యాక్స్ సభ్యులు ఎన్నుకున్న ప్రతినిధులు కాకుండా వేరే వారు సమావేశాలకు హాజరు కాకూడదన్న నిభందనలు ఉన్నప్పటికీ అధికారులు చూసీ చూడనట్టుగా వ్యవహరించడం స్థానికంగా చర్చనీయాశం అవుతోంది. ఇందుకు సంబంధించిన ఆడియో నెట్టింట వైరల్ కావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బీజేపీ నాయకుడు నవీన్ ప్యాక్స్ సీఈఓతో మాట్లాడిన ఈ ఆడియోలో నిబంధనల ప్రకారం ఇతరులు సమావేశానికి రాకూడదన్న విషయం తాను ఛైర్మన్ కు చెప్తే రానివ్వండన్నారని సీఈఓ అంటున్నారు. అధికారులు నిబంధనలకు విరుద్దంగా సంఘ ప్రతినిధులుగా ఎన్నిక కాని వారికి నో ఎంట్రీ అని చెప్పినా పట్టించుకోకపోవడం వెనక ఆంతర్యం ఏంటన్నదే అంతుచిక్కకుండా పోతోంది. సహకార చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించడం ఏంటని, అధికార పార్టీకి చెందిన వారైనంత మాత్రాన ఇలా వ్యవహరించడం సబబు కాదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అన్నింటా మహిళలకు ప్రాతినిథ్యం కల్పించాలన్న లక్ష్యంతో వారికి ప్రత్యేకంగా రిజర్వేషన్లు కల్పిస్తే వారు రికార్డులకే పరిమితం అవుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికయిన ప్రతినిధులను కాదని వారి భర్తలు దర్జాగా సమావేశానికి హాజరు కావడం సరికాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. సహకార రంగంపై మహిళలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు చొరవ తీసుకుని వారి ప్రత్యక్ష్య హాజరు కోసం ప్రయత్నించడంపై దృష్టి సారించకుండా నిబంధనలు తుంగలో తొక్కడం ఏంటో అధికారయంత్రాంగానికే తెలియాలని అంటున్నారు స్థానికులు. ఇష్టారీతిన సాగుతున్న ఈ తీరును చూసిన పలువురు అసలు మహిళా రిజర్వేషన్ అమలు చేయడం ఎందుకని, అన్ని స్థానాల్లో పురుషులనే గెలిపిస్తే సరిపోయేది కదా అని అంటున్న వారూ లేకపోలేదు. ఓ వైపున అధికార పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చట్ట సభల్లోనూ మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని జాతీయ స్థాయిలో ఉద్యమాలు చేస్తుంటే అదే బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు సహకార ప్రతినిధులుగా ఎన్నికైన మహిళలను ఇంటికే పరిమితం చేయడం… వారి స్థానంలో వారి భర్తలు పెత్తనం చెలాయించడం వల్ల పార్టీ అపవాదును మూటగట్టుకునే ప్రమాదం ఉంటుందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.

బీజేపీ నాయకుడు నవీన్, పెద్దూరు సహాకార సంఘం సీఈఓతో మాట్లాడిన ఆడియోలో ఏముందో మీరూ వినండి

You cannot copy content of this page