అధినేత్రి ఆదేశించినా మారలేదా..?
హుస్నాబాద్ గొడవకు కారణమదేనా?
దిశ దశ, హుస్నాబాద్:
అధినేత్రి సోనియాగాంధీ అంతర్గత విబేధాల గురించి మీడియా ముందు మాట్లాడకండి… పార్టీని వీక్ చేసే విధంగా వ్యవహరించకండి అంటూ ఆదేశాలు జారీ చేశారు. అమ్మ అలా ఫ్లైట్ ఎక్కి ఢిల్లీలో దిగారో లేదో ఇక్కడ మాత్రం బహిరంగంగానే పంచాయితీ పెట్టుకున్నారు కాంగ్రెస్ నాయకులు. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావాలంటే క్రమ శిక్షణ అవసరమని లేనట్టయితే ప్రజలు మనల్ని శిక్షిస్తారన్న సంకేతాలను ఏఐసీసీ పెద్దలు సీడబ్లుసీ మీటింగ్ తో పాటు బహిరంగ సభ జరిగిన రోజున కూడా పదే పదే హెచ్చరించారు. రాష్ట్ర స్థాయి నాయకులు అధిష్టానం చెప్పిన మాటలను పెడ చెవిన పెట్టారో లేక… తమ ఆధిపత్యమే ముఖ్యం అనుకున్నారో తెలియదు కాని రోడ్ల మీద ఒకరినొకరు నెట్టేసుకోవడం మాత్రం క్రమ శిక్షణారాహిత్యాన్ని బహిర్గతం చేసింది.
అసలేం జరిగింది..?
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నుండి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డిలు టికెట్ ఆశిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సారి కరీంనగర్ నుండి కాకుండా హుస్నాబాద్ నుండి పోటీ చేయాలని భావించిన పొన్నం తనకు టికెట్ కూడా అక్కడి నుండే ఇవ్వాలని అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నారు. హుస్నాబాద్ లో తన ప్రచార కార్యాలయాన్ని కూడా ప్రారంభించిన పొన్నం వర్గం ఊరూరా ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 17న తుక్కుగుడలో సోనియాగాంధీ సభలో ప్రకటించిన కాంగ్రెస్ గ్యారెంటీ స్కీమ్స్ గురించి ప్రజలకు వివరించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా సీడబ్లూసీ మెంబర్ మోహన్ ప్రకాష్ ఆధ్వర్యంలో హుస్నాబాద్ లో భారీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో పొన్నం ప్రభాకర్, అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డిలతో పాటు వారి అనుచరగణం కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంది. ఈ ర్యాలీలో ప్రచార రథంలో వేసిన ఓ పాట గురించి వివాదం మొదలైనట్టుగా తెలుస్తోంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు సంబంధించిన పాటలు వేయకుండా స్థానిక నాయకత్వం గురించి పాడిన పాటలు వేయడంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీంతో ఇరు వర్గాల అనుచరులు తమ తమ నేతలకు అనుకూలంగా నినాదాలు చేస్తే తోపులాడుకున్నారు. దీంతో హుస్నాబాద్ పట్టణంలో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ద్వితీయ శ్రేణి నాయకులు ఓ వైపున తోపులాడుకుంటూ గొడవ పడుతున్నా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తమ ర్యాలీని యథావిధిగా కొనసాగించారు.