అక్కడిదే స్పెషాలిటీ…
దిశ దశ, కరీంనగర్:
రాష్ట్రం వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆత్మీయ సదస్సులు ఏర్పాటు చేసుకుని నూతనోత్సాహంతో కదం తొక్కుతుంటే అక్కడ మాత్రం ఆ సదస్సులకు దూరంగా ఉన్నాయి పార్టీ శ్రేణులు. మంత్రి కేటీఆర్ కూడా ప్రత్యేకంగా టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఆత్మీయ సదస్సులు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించిన నియోజకవర్గాల్లో ఒకటైన హుజురాబాద్ లో మాత్రం ఆత్మీయత కానరాకపోవడం విడ్డూరం. కరీంనంగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో మాత్రం ఆత్మీయ సదస్సులు ఏర్పాటు చేయకపోవడం వెనక ఆంతర్మం ఏంటన్నదే అంతుచిక్కకుండా పోయింది. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ పరంగా ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో చైతన్యం నింపేందుకు నడుం బిగించకపోవడం విస్మయం కల్గిస్తోంది. అయితే ఈ విషయంలో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు చెప్తున్న విషయాలు వేరేలా ఉన్నా స్థానికంగా జరుగుతున్న ప్రచారం మాత్రం మరోలా ఉండడం చర్చనీయాంశంగా మారింది.
ఇద్దరు నేతల మధ్య…
హుజురాబాద్ నియోజకవర్గంలో మండలి విప్ పాడి కౌశిక్ రెడ్డి, టూరిజం కార్పోరేషన్ ఛైర్మన్ గెల్లు శ్రీనివాస్ మధ్య సయోధ్య లేకుండా పోవడమే కారణం అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జరిగిన బైపోల్స్ లో పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ బరిలో నిలవగా ఇటీవలే హుజురాబాద్ పార్టీ పగ్గాలు కౌశిక్ రెడ్డికి అప్పగించింది అధిష్టానం. అయితే కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ కాకముందు నుండే వీరిద్దరూ కూడా ఎడమొఖం పెడ మొఖంగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్సీ అయిన తరువాత కౌశిక్ దూకుడు ఎక్కువ కాగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ సైలెంట్ అయ్యారు. కొంతకాలం గెల్లు శ్రీనివాస్ పార్టీ బాద్యుడిని తానేనని చెప్పినప్పటికీ హుజురాబాద్ లో మాత్రం కౌశిక్ ను నిలువరించలేకపోయారు. ఇదే సమయంలో అధిష్టానం కూడా పాడి కౌశిక్ రెడ్డి వైపే మొగ్గు చూపింది. ఈ క్రమంలో కొంతకాలం సైలెంట్ గా ఉన్న గెల్లును అనూహ్యంగా టూరిజం కార్పోరేషన్ ఛైర్మన్ పదవి వరించింది. అయితే పార్టీ ఆత్మీయ సదస్సులు నిర్వహిస్తే గెల్లు కూడా ఎంట్రీ ఇవ్వాల్సి వస్తుందన్న కారణంగానే వాటి ఊసెత్తకుండా జాగ్రత్త పడ్డారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో గెల్లు శ్రీనివాస్ భార్య శ్వేతా యాదవ్ కూడా తన వర్గం నాయకులతో నియోజకవర్గంలో పర్యటనలు విస్తృతంగా తిరుగుతున్నారు. ఈ సందర్భంగా తనను ఆశీర్వదించాలని కూడా అభ్యర్థిస్తున్న శ్వేత వచ్చే ఎన్నికల్లో తనకే అధిష్టానం అవకాశం ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్న సంకేతాలు కూడా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తే తప్పుడు సంకేతాలు వెల్తాయన్న ఉద్దేశ్యంతోనే నిర్వహించలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఎమ్మెల్సీ కౌశిక్ వ్యూహం ఇదే…
అయితే ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి వర్గం చెప్తున్న కారణాలు వేరే విధంగా ఉన్నాయి. నియోజకవర్గంలో క్యాడర్ ను ఏకతాటిపైకి తీసుకరావడంతో పాటు గ్రౌండ్ లెవల్ కార్యకలాపాలను పటిష్టం చేసేపనిలో ఎమ్మెల్సీ నిమగ్నం అయ్యారంటున్నారు. అన్ని మండలాల్లో పటిష్టమైన చర్యలు తీసుకున్న తరువాత ఆత్మీయ సమ్మేళనాలకు శ్రీకారం చుడ్తారని అధిష్టానంలోని పెద్దలకు సమాచారం ఇచ్చారంటున్నారు కౌశిక్ రెడ్డి అనుచరులు. ప్రతి ఆరు గ్రామాలకో క్లస్టర్ చొప్పున చేసి క్లస్టర్ల వారిగా సమ్మేళనాలు నిర్వహించాలని వ్యూహం రచించినట్టుగా చెప్తున్నారు. ఈ కారణంగానే పార్టీ సమ్మేళనాలకు దూరంగా హుజురాబాద్ ఉండిపోయిందే తప్ప మరోకారణమేమి లేదంటున్నారు.
గెల్లు సన్మాన సభకు బ్రేకెందుకో..?
అయితే టూరిజం కార్పోరేషన్ ఛైర్మన్ గా గెల్లు శ్రీనివాస్ నియామకం అయిన తరువాత హుజురాబాద్ లో భారీ ఎత్తున సన్మాన సభ ఏర్పాటు చేసేందుకు నియోజకవర్గంలోని ఆయన వర్గీయులు ఏర్పాట్లు చేశారు. ఇందుకు డేట్ కూడా ఫిక్స్ చేసినప్పటికీ అనూహ్యంగా ఈ ప్రోగ్రాంను రద్దు చేశారు. ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెల్తాయని, సన్మాన సభ కౌశిక్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించేందుకు మరో తేది నిర్ణయిస్తారని అధిష్టానం పెద్దలు కొంతమంది గెల్లు శ్రీనివాస్ కు చెప్పడం వల్లే సన్మాన సభను రద్దు చేసుకున్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే గెల్లు శ్రీనివాస్ సన్మాన సభ నిర్వహించే వరకు మాత్రం సొంత ఇలాకాలో పర్యటించే అవకాశాలు లేకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా హుజురాబాద్ బీఆర్ఎస్ పార్టీలో మాత్రం డిఫరెంట్ పాలిటిక్స్ చోటు చేసుకుంటున్నాయన్న చర్చలు మాత్రం తీవ్రంగా సాగుతున్నాయి.
Disha Dasha
1884 posts
Prev Post
Next Post